World Sleep Day : చక్కని నిద్ర కోసం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి
World Sleep Day : మనిషికి నిద్ర అనేది అవసరం. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా చక్కటి నిద్ర కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..
మన దైనందిన జీవితంలోని హడావుడిలో నిద్రను అశ్రద్ధ చేస్తాం. ఇది మన శ్రేయస్సుకు మంచిది కాదు. మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక దృఢత్వాన్ని కూడా నిద్ర ప్రభావితం చేస్తుంది. ప్రపంచ నిద్ర దినోత్సవం అనేది ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వడం, విశ్రాంతి తీసుకోవడం, పునరుజ్జీవనానికి అనుకూలమైన నిద్ర వాతావరణాన్ని పెంపొందించే ప్రాముఖ్యతలను గుర్తు చేస్తుంది.
అమెరిస్లీప్ (Amerisleep) ఇటీవలి నివేదిక మన నిద్ర వాతావరణానికి సంబంధించిన ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఉతకని దిండు కేవలం ఒక వారంలో 3 మిలియన్ బ్యాక్టీరియాను సేకరించుకుంటుంది. ఇది టాయిలెట్ సీటు కన్నా 17,000 రెట్లు ఎక్కువ కలుషితంగా ఉంటుంది. బాత్రూమ్ డోర్ నాబ్ కన్నా ఉతకని దుప్పటి 24,631 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.
డైసన్‌లోని మైక్రోబయాలజీలో లీడ్ రీసెర్చ్ సైంటిస్ట్ జోవాన్ కాంగ్.. అందరూ విస్మరిస్తున్న ఈ అంశాలపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పడక గది నుంచి ఎక్కువ దుమ్ము, అలెర్జీ కారకాలను తొలగించేందుకు శుభ్రపరచడం, వాక్యూమింగ్ క్లీనర్ బెడ్‌రూమ్ వాతావరణాన్ని మెరుగుపరచుకునేందుకు చిట్కాలను అందిస్తున్నారు.
వేడి నీటిలో ఉతకాలి
పరుపుపై దుప్పట్లు, దిండు కవర్లు, కప్పుకునే దుప్పట్లను బాగా వేడి చేసిన నీటిలో ఉతకడం ద్వారా అలర్జీలను విచ్ఛిన్నం చేసి వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. మైక్రోస్కోపిక్ చర్మపు కణాలను తొలగించేందుకు, దుమ్ము, అలెర్జీ కారకాలను దూరంగా ఉంచేందుకు మీరు వారానికి ఒకసారి మీ పరుపును ఉతకడం, మార్చడం మంచిది.
వాక్యూమ్‌లు ఉపయోగించవచ్చు
దుమ్ము పురుగులు చిన్నవిగా ఉంటాయి. కానీ అవి మీ పరుపులో అతుక్కొని ఉంటాయి. వాటిని తొలగించడం కష్టమవుతుంది. దీనికి వాక్యూమ్‌లు శక్తివంతంగా పని చేస్తాయి. మీ పరుపులో ఉన్న దుమ్మును సమర్థవంతంగా తొలగిస్తాయి. చర్మపు మృత కణాలు, దుమ్ము పురుగులు, అలెర్జీ కారకాలను తొలగించేందుకు దిండ్లు, కుషన్లు వాక్యూమ్ చేయడం కూడా మంచి పద్ధతి.
అన్ని శుభ్రం చేయాలి
మీరు మీ పరుపును లోతుగా శుభ్రం చేసిన తర్వాత, ఏదైనా దాగిన ధూళిని తొలగించేందుకు వాక్యూమ్ క్లీనర్స్ దొరుకుతాయి. ఆ సాధనంతో అంచులు, పగుళ్లను శుభ్రం చేయండి. దుమ్ము పురుగులు చీకటి, వెచ్చని, తేమతో కూడిన ప్రదేశాలలో వృద్ధి చెందుతాయి. మీ మంచం కింద, అల్మారాలు, వార్డ్‌రోబ్‌లపై శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
ఎయిర్ ప్యూరిఫైయర్‌లు
మనం ఎక్కువ సమయం గడిపే బెడ్‌రూమ్‌ను సరిగా చూసుకోవాలి. ఇందుకోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌లను వాడుకోవచ్చు. కచ్చితమైన, సమర్థవంతమైన సెన్సింగ్ సామర్థ్యాలతో తగిన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉంచుకోవాలి. హానికరమైన కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయవచ్చు. ఇది మీ పడకగదిలోని ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెరుగైన నిద్ర కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.