Smoking Causes Blindness । పొగత్రాగితే కంటిచూపు పోవడం గ్యారెంటీ, నళ్ల కళ్లజోడే దిక్కు!
World No Tobacco Day 2023: పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం, కేవలం క్యాన్సర్ కు మాత్రమే కారకం కాదు, మరెన్నో సమస్యలకు కూడా.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం చదవండి
Smoking Causes Blindness: పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా స్మోకింగ్ చేస్తూనే ఉంటారు. ధూమపానం అలవాటు మానేయాలనే ఎంత అనుకున్నా, కొంతమంది మానేయలేకపోతారు. ఎందుకంటే, దీనికి ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. పొగాకు ఉత్పత్తులు నికోటిన్‌ను కలిగి ఉంటాయి, ఇది నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతూ పొగతాగాలనే కోరికను పెంచుతుంది. కానీ, ధూమపానం ఏ విధంగానూ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ అలవాటు వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ధూమపానం శరీరంలోకి చొచ్చుకుపోయే టాక్సిన్‌లను విడుదల చేస్తుంది. ఈ టాక్సిన్లు కళ్ళతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి.
ట్రెండింగ్ వార్తలు
ధూమపానం క్యాన్సర్ కు కారకం అని చాలా మందికి తెలుసు, కానీ తెలియని దుష్ప్రభావాలు ఇంకా చాలానే ఉన్నాయి. ధూమపానం కంటిచూపును దెబ్బతీయడం కూడా ఒకటి. పొగత్రాగే అలవాటు వలన కంటి నిర్మాణాలు ప్రభావితమవుతాయి. కంటిలోని లెన్స్, రెటీనా, మాక్యులా వంటివి దెబ్బతింటాయి. దీనివల్ల కంటిచూపు మందగించడం, దృష్టి సమస్యలతో పాటు అంధత్వం కలిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇది కళ్ల కింద చికాకు, కళ్లలో మంట, కళ్లు ఉబ్బడం ఇతర కనురెప్పల సమస్యలను కూడా కలిగిస్తుంది. గ్లాకోమా, కంటిశుక్లం, డయాబెటిక్ రెటినోపతి మొదలైన అనేక కంటి పరిస్థితులు ధూమపానంతో ముడిపడి ఉన్నాయి.
ఇక్కడ ధూమపానం దుష్ప్రభావాలు అంటే కేవలం మీరు పొగత్రాగటం వల్లనే వస్తాయని చెప్పటం కాదు, మీ పక్కవారు పొగత్రాగిన, వారి పొగను మీరు పీల్చిన మీకు ప్రమాదం తప్పదు. ముఖ్యంగా సెకండ్-హ్యాండ్ పొగకు గురికావడం వలన పిల్లలపై మరింత హానికర ప్రభావాలు ఉంటాయని పరిశోధనలో తేలింది.
ధూమపానం ప్రభావం నుంచి మీ కళ్ళను రక్షించుకోవడానికి అనుసరించాల్సిన చిట్కాలు:
- ధూమపానం దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు మీరు మొట్టమొదటగా చేయాల్సిన పని ధూమపానం మానేయడం.
- పొగత్రాగటం మానేయడం మాత్రమే కాదు, పొగత్రాగే వారికి దూరంగా ఉండాలి. ఎలక్ట్రిక్ సిగరెట్స్ కూడా మంచివి కాదు
- ధూమపానంతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులను నమలడం మానుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, సాధారణ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్ధారించండి.
- ఆకుపచ్చ ఆకు కూరలను, కూరగాయలను అధికంగా తీసుకోండి.
- సన్ గ్లాసెస్ ధరించడం ద్వారా అతినీలలోహిత కిరణాల నుండి మీ కళ్ళను రక్షించండి.
- కళ్ళు ఎండిపోకుండా లేదా మంటగా మారకుండా ఉండటానికి తరచుగా కళ్ళు రెప్పవేయండి.
- మీ కళ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
- మీరు ఎక్కువ గంటలు డిజిటల్ స్క్రీన్‌లను ఉపయోగిస్తుంటే మీ కళ్ళకు రెగ్యులర్ బ్రేక్ ఇవ్వండి.
- చిన్న చిన్న దృష్టి సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా కంటి నిపుణులను సంప్రదించాలి.
ధూమపానం మానేయడం అసాధ్యం కాదు, కష్టమైన పని అంతకంటే కాదు. మీరు మానేయాలని దృఢంగా నిర్ణయించుకుంటే మానేస్తారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ధూమపానం దుష్ప్రభావాలను హైలైట్ చేస్తూ ప్రతీ ఏడాది మే 31 వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) గా నిర్వహిస్తారు.
సంబంధిత కథనం