World Nature Conservation Day: సహజ వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ప్రతి యేటా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రకృతిని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఈ రోజు గుర్తు చేస్తుంది.
ప్రకృతిని పరిరక్షించడం అంటే ఏంటి? వనరులను తెలివిగా ఉపయోగించడం, పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడం. గాలి, నీరు, ఖనిజాలు, మట్టి వంటి మన సహజ వనరులను భావితరాలకు అందుబాటులో ఉండేలా విచక్షణతో వాడుకోవడం. ఈ ప్రత్యేక రోజున ప్రకృతి కోసం మనం ఏం చేయొచ్చు? ఈ సారి థీమ్ ఏంటో కూడా తెల్సుకోండి.
ఈ సంవత్సరం జూలై 28 ఆదివారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. "ప్రకృతిని మనుషులను ఏకం చేయడం, వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణలను అన్వేషించడం" అనేది ఈ ఏడాది థీమ్.
ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని చాలా చోట్ల ప్రకృతి కన్సర్వేషన్ ప్రాజెక్టులు చేపడతారు. వీటిలో మీరు, మీ పిల్లలు కలిసి పాల్గొనండి. కొన్ని ప్రాంతాలను ఎంచుకుని శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం లాంటి పనులనూ స్వచ్ఛంద సంస్థలు చేపడతాయి. కొన్ని చోట్ల సెమినార్స్, మారథాన్లూ ఉంటాయి. వాటిలో పాల్గొనండి. ఈ ఒక్కరోజును మనకు ఊపిరి పోసిన భూమి కోసం కేటాయిస్తే తప్పేం లేదు.
సమయం వెచ్చించే తీరిక మీకు లేకపోతే డబ్బు సాయమూ చేయొచ్చు. మీరు చేసేది చిన్న సాయం అనుకోకుండా ప్రతి రూపాయి ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. ప్రకృతిని కాపాడ్డానికి, కొన్ని ఎన్జీవోలు, నేచర్ వెల్ఫేర్ సంస్థలు డొనేషన్లు సేకరిస్తాయి. అలాంటి మంచి సంస్థ ఏదైనా ఉంటే మీరూ మీ వంతుగా ప్రకృతి బాగుకు సాయం చేయొచ్చు. పిల్లలతో ఈ డొనేషన్ చేయిస్తే వాళ్లకూ ఒక బాధ్యత అలవరుతుంది.
జీవన శైలిలో మార్పుల వల్ల వాతావరణం మీద ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్ వాడకం మానేయండి. బదులుగా బట్ట సంచుల్ని వాడండి. ప్లాస్టిక్ స్ట్రాలు, డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు వాడకండి. బయటికి వెళ్లిన ప్రతిసారీ మీవెంట ఒక స్టీల్ సామాన్ల సెట్ ఉంచుకోండి. స్టీల్ స్ట్రా, ఒక గిన్నె, ప్లేటు, గ్లాసు వెంట ఉంచుకోండి. మీ వల్ల ఎంతో నష్టం జరగకుండా కాపాడినట్లే. మొదట్లో వాటి వాడకం కష్టం అనిపించినా క్రమంగా వాటితో ఆనందం దొరుకుతుంది.
భవిష్యత్తు తరాలు జీవనం కొనసాగించాల్సింది ఈ భూమ్మీదే. భూమి ఆరోగ్యమే వాళ్ల భవిష్యత్తుకు ఆధారం. అందుకే దీని గురించి తెలిసేలా వాళ్ల చేత చిన్న వ్యాసం రాయించండి. లేదా బొమ్మలు గీయమనండి. వాళ్లతో కూడా ఏదైనా ప్రతిజ్ఞ చేయించండి. టిష్యూలు వాడటం, కవర్లు వాడటం లాంటివి తగ్గించాల్సిన అవసరం గురించి చెప్పండి. మంచి ఆర్టికల్స్ వాళ్లతో చదివించండి. మీరూ వాళ్లకు చదివి వినిపించండి. ఈ ఆదివారాన్ని దీనికోసమే కేటాయించండి. ఒక్కరోజు ప్రకృతి పరిరక్షణకు కేటాయించామన్న సంతృప్తి దొరుకుతుంది చూడండి.
టాపిక్