World health day 2024: ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని జీవితం కావాలా? ఈ పది పనులు చేయండి
World health day 2024: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చేసింది. ప్రతి ఏడాది ఆరోగ్యం విలువను తెలిపేందుకు, అవగాహనను పెంచేందుకు ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని జీవితం కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
World health day 2024: ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించిన సందర్భంగా ప్రతి ఏడాది ఏప్రిల్ ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 1948 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే అనేక ఆరోగ్య విషయాలపై అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, జీవన నాణ్యతను పెంచుకోవాలని చెప్పడమే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని జీవితాన్ని గడపాలని అనుకుంటే కచ్చితంగా మీరు కొన్ని జీవనశైలి పద్ధతులను పాటించాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 10 చిట్కాలు ఉన్నాయి.
హైడ్రేటెడ్‌గా ఉండండి
శరీరంలో తగినంత నీరు ఉంటేనే శరీర పనితీరు సక్రమంగా ఉంటుంది. ప్రతి రోజూ 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగేలా చూసుకోండి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందేలా నీరు సహకరిస్తుంది. శరీరంలో నీరు తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సమతుల భోజనం
ఏదో ఒకటి తిన్నాం కదా అనుకునేట్టు తినకండి. సమతుల భోజనాన్ని ప్రతి పూట తినాలి. మీరు తినే భోజనంలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అన్నీ ఉండేలా చూసుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్ వంటివి తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.
వ్యాయామం
ఎంత ఆరోగ్యకరమైన భోజనం తిన్నా కూడా ఎముకలు, కండరాలు బలంగా ఉండాలంటే ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక స్థితిని కూడా మెరుగుపరుచుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్.చు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయడం చాలా అవసరం.
తగినంత నిద్ర
ఆహారం ఎంత ముఖ్యమో శరీరానికి నిద్ర కూడా అంతే ముఖ్యం. మన మెదడు సరిగ్గా పని చేయాలన్నా, రోగ నిరోధక వ్యవస్థ చక్కగా ఉండాలన్నా, మానసిక స్థితి నియంత్రణలో ఉండాలన్నా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కచ్చితంగా శరీరానికి తగినంత నిద్ర ఉండాలి. అది కూడా నాణ్యమైన నిద్ర పొందాలి. ప్రతి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలకు తగ్గకుండా నిద్రపోవడం చాలా ముఖ్యం. పగటిపూట నిద్రపోయామని చాలామంది రాత్రి సరిగా నిద్రపోరు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
ఒత్తిడిని తగ్గించుకోండి
ఆధునిక జీవితంలో ఒత్తిడి ఎక్కువైపోతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా, పచ్చని ప్రకృతిలో గడపడం వంటివి చేయాలి. ఇవన్నీ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.
మద్యం వద్దు
ఎంతోమందికి మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతిరోజూ రాత్రి మద్యం తాగనిదే నిద్రపోని వారి సంఖ్య ఎంతో ఎక్కువ. ఆల్కహాల్ వల్ల కాలేయం దెబ్బతింటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మద్యం వినియోగానికి దూరంగా ఉండటమే మంచిది.
ధూమపానం
స్మోకింగ్ చేయడం ఒక ఫ్యాషన్ లా అయిపోయింది. ధూమపానం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయి. అవి శరీరంలో చేరి ఊపిరితిత్తుల కాన్సర్, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు రావడానికి సహకరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మరణాలకు ధూమపానం కారణమవుతుంది. ధూమపానాన్ని మానేస్తే మీ ఆరోగ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
పరిశుభ్రత
అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిరోజూ రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కుంటూ ఉండాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. పరిశుభ్రత వల్ల క్రిములు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
సామాజిక బంధాలు
శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే సామాజిక సంబంధాలు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఒంటరితనంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజులో కాసేపు ఒంటరితనం మంచిదే కానీ, పూర్తిగా ఒంటరిగా మిగిలిపోవడం అనేది మీ జీవన కాలాన్ని తగ్గిస్తుంది.
హెల్త్ చెకప్
కొన్ని రకాల అనారోగ్యాలు ఎలాంటి లక్షణాలను చూపించవు. ఒకేసారి వెల్లువలా ముంచుకొస్తాయి. కాబట్టి ముందస్తుగా కొన్ని రకాల హెల్త్ చెకప్ లు చేయించుకోవడం చాలా అవసరం. వీటిలో ముఖ్యమైనవి రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటివి. అలాగే వివిధ రకాల క్యాన్సర్ల స్క్రీనింగ్ లు కూడా చేయించుకోవాలి. తగిన సమయానికి టీకాలను తీసుకోవాలి.
ఆరోగ్యంగా జీవించాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా పైన చెప్పిన పది పనులు చేయడం ద్వారా తమ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు.
టాపిక్