World Earth Day 2024 : మన ముందు తరాలకు మంచి పుడమిని గిఫ్ట్‌గా ఇద్దాం
World Earth Day 2024 : భూమిని సరిగా చూసుకుంటేనే మనకు బతుకు. లేదంటే అనేక ఇబ్బందులు. మనం చేసే చిన్న చిన్న తప్పులే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి.
ప్రపంచ ఎర్త్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 న నిర్వహించుకుంటారు. భూమి పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకొంటారు. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీనితో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పర్యావరణ మార్పులతో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడూ వర్షాలు పడే ప్రాంతాల్లో కరువు వస్తుంది. అసలు వానలే లేని ప్రాంతంలో వరదలు వస్తుంటాయి. మనం చేస్తున్న తప్పులతో చాలా దేశాలలో నీటి సమస్యలు తలెత్తాయి. ఈ భూమిని మనిషి ఎంత స్వార్థంతో వినియోగిస్తాడో ప్రకృతి కూడా అంతే నష్టాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే సంతోషకరమైన జీవితం గడపడం సాధ్యమవుతుంది. అప్పుడే అందరం హ్యాపీగా ఉండవచ్చు.
ప్రపంచ ఎర్త్ డేను మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970న జరుపుకొన్నారు. 1969లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన UNSEO సమావేశంలో శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ భూమి, శాంతి అనే భావనను ప్రతిపాదించాడు. ప్రపంచ ఎర్త్ డేని మొదట మార్చి 21, 1970న నిర్వహించాలని ప్రతిపాదించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణపై ఆందోళనను ప్రేరేపించారు. ఆ రోజును ఎర్త్ డే అని పేరు పెట్టారు.
మనిషి భూమికి హాని చేస్తే.. దుష్ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. మన భవిష్యత్ తరాలకు మనం చేయగలిగిన గొప్ప ఆస్తి ఈ భూమిని రక్షించడం. భూమిని ఎంత బాగా చూసుకుంటే.. మనకు అంత మంచిది. ఎలాంటి హాని చేయకుండా కాపాడుకోవాలి. ప్రకృతి తనకు నచ్చినట్టుగా చేస్తే.. భూకంపాల వల్ల భవనాలు నేలమట్టం, వరదల వల్ల ఆస్తులు కొట్టుకుపోవడంలాంటివి జరుగుతాయి.
ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి
పర్యావరణానికి దగ్గరగా ఉండడం అంటే పర్యావరణాన్ని ప్రేమించడం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ పదార్థాలు వాడాలి. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ బ్యాగ్ ఉపయోగించవద్దు. కార్లు, బైక్‌లకు బదులు సైకిళ్లను ఎక్కువగా వాడితే వాయు కాలుష్యం తగ్గుతుంది. ప్రతి మనిషి తన జీవితకాలంలో చెట్లను నాటాలి. ఇది మన తర్వాతి తరానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి
ఇలాంటి మాటలు చెప్పండి
ఈ భూమి ఉంటేనే మనం ఉంటాం.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
భూమిలో మొక్క నాటితే చల్లదనాన్ని ఇస్తుంది, వర్షాలు కురుస్తాయి, అదే కరువు వస్తే ఎడారి అవుతుంది.
మనిషి ప్రకృతిని ఎలా చూసుకుంటాడో దాని ప్రకారం ప్రతిఫలం ఇస్తుంది. పర్యావరణానికి హాని కలగకుండా ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు, ప్రతి రోజు ఎర్త్ డే.
మనం వాతావరణ మార్పులను నిరోధించడానికి ప్రయత్నించినప్పటికీ, భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. వాతావరణం మారినప్పుడు ఏమి జరుగుతుందో చూశాం.
భూమి అన్ని జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తుంది, మనిషి తప్ప మరే జంతువు ఈ భూమికి హాని చేయదు. మనం జీవించాలి.. కానీ భూమి ఉంటేనే మనం జీవించగలం.
ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. దాని కోపం వస్తే మన జీవితం వృథా.
భూదేవికి కోపం వస్తే ప్రళయమే. అందుకే పుడమిని కాపాడుకుందాం.. సంతోషంగా జీవిద్దాం..