World Diabetes Day: ప్రపంచ మధుమేహ దినోత్సవం, మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, హై బ్లడ్ షుగర్ సంకేతాలు ఇవన్నీ-world diabetes day watch out if you experience these symptoms these are all signs of high blood sugar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Diabetes Day: ప్రపంచ మధుమేహ దినోత్సవం, మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, హై బ్లడ్ షుగర్ సంకేతాలు ఇవన్నీ

World Diabetes Day: ప్రపంచ మధుమేహ దినోత్సవం, మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, హై బ్లడ్ షుగర్ సంకేతాలు ఇవన్నీ

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 07:00 AM IST

World Diabetes Day: మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. అందుకే మధుమేహం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నిర్వహిస్తారు.

డయాబెటిస్ లక్షణాలు
డయాబెటిస్ లక్షణాలు (Pexel)

ప్రాణాన్ని సులువుగా తీసేసే వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. గాయం కనిపించనీయకుండా ఇది మరణానికి దగ్గర చేస్తుంది. రక్తంలో అధిక చక్కెర వల్ల ఈ మధుమేహం వ్యాధి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మధుమేహం అనేది క్రానిక్, మెటబాలిక్ వ్యాధి. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే రోగం. దీన్ని అశ్రద్ధ చేస్తే గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలు అన్నీ దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. మధుమేహానికి ముందే ప్రీ డయాబెటిస్ దశ వస్తుంది. ఆ దశలోనే లక్షణాలను జాగ్రత్తగా గుర్తిస్తే పూర్తి డయాబెటిక్ గా మారకముందే జాగ్రత్త పడవచ్చు.

ప్రీ డయాబెటిస్ అంటే

ప్రీ డయాబెటిస్ మధుమేహానికి ముందు దశ. మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పే దశ. ఇదే కొన్ని రకాల లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలి. అలా గుర్తిస్తే మీరు పూర్తి డయాబెటిస్ వ్యాధి బారిన పడకముందే జాగ్రత్త పడవచ్చు.

ప్రీ డయాబెటిస్ లక్షణాలు

ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనిపెట్టడం కాస్త కష్టమే. కానీ వీటిపై అవగాహన పెంచుకుంటే మీరు కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీ మెడ, మోచేతుల్లో, చర్మం నల్లగా మారుతుంది. అలసటగా అనిపిస్తుంది. తగినంత నిద్రపోతున్నప్పటికీ కూడా రోజంతా అలసటగానే ఉంటుంది. తరచూ మూత్ర విసర్జనకు వెళుతూ వస్తూ ఉంటారు. హఠాత్తుగా బరువు పెరిగినట్టు కనిపిస్తారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు కనిపిస్తారు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే అది ప్రీ డయాబెటిస్ లక్షణాలుగా భావించాలి. రక్తంలో చేరిన గ్లూకోజ్ ను శరీరం సమర్థవంతంగా నిర్వహించలేకపోతుంది. దీనివల్ల అది శరీరంలో పేరుకుపోయి బరువు పెరగడంతో పాటు తీవ్ర అలసట, మూత్ర విసర్జనకు వెళ్లి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ఇలాంటి సంకేతాలు కనిపించగానే వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ ద్వారా మీకు ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారో లేదా డయాబెటిక్‌గా మారారో తెలుసుకోవచ్చు.

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పటికే డయాబెటిస్ బారిన పడినవారు వైద్యులు చెప్పిన విధంగా మందులు వాడుతూ దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇక ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారు, డయాబెటిస్ బారిన పడని వారు జీవనశైలిలో కొద్ది మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పంచదార అధికంగా వాడిన పదార్థాలను తక్కువగా తినాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ ను కూడా తక్కువగా తీసుకోవాలి. అంటే బయట దొరికే ప్యాకేజీ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ ను తినకూడదు. ఆహారంలో లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటూ ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరను ఒకేసారి పెరగకుండా స్థిరంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే ప్రతి రోజు గంట సేపు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. మరొక ముఖ్యమైన అంశం బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. శరీర బరువు పెరిగేకొద్దీ టైప్2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు బరువును తగ్గించుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను కూడా నియంత్రించుకోవచ్చు.

మధుమేహం అనేది కుటుంబ వారసత్వంగా కూడా వస్తుంది. మీ కుటుంబ చరిత్రలో ఎవరికైనా మధుమేహం ఉంటే లేదా అధిక బరువును కలిగి ఉంటే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం వల్ల ఆ ప్రభావం మీ కంటిచూపుపై కూడా పడుతుంది. దృష్టి అస్పష్టంగా మారుతుంది. అలా దృష్టి అస్పష్టంగా మారినా కూడా చాలామంది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షించుకొని వస్తారు. కంటి పరీక్షతో పాటు మధుమేహం పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా గర్భిణులు కూడా షుగర్ టెస్ట్ ను ఎప్పటికప్పుడు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే గర్భం ధరించాక జస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Whats_app_banner