Rare Blood Groups | ఈ బ్లడ్ గ్రూప్స్ కలవారు ప్రపంచంలోనే చాలా అరుదు, ఇందులో మీరు ఉన్నారా?
World Blood Donor Day: అర్హులైన అందరూ రక్తదానం చేయాలని ప్రొత్సహిస్తూ ప్రతీ ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తారు. అరుదైన రక్త వర్గాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
World Blood Donor Day: రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను కాపాడే మహోన్నత దానం. ఇప్పటివరకు ఎంతోమంది మనుషులు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు, మహోన్నత వ్యక్తులుగా నిలిచారు. అలాంటి వారిని గుర్తుచేసుకుంటూ, అర్హులైన అందరూ రక్తదానం చేయాలని ప్రొత్సహిస్తూ ప్రతీ ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తారు.
కార్ల్ ల్యాండ్‌స్టైనర్, అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త,రక్తదాతలను గుర్తించడానికి ABO అనే రక్త వర్గాన్ని కనుగొన్నారు. ఈరోజు మన బ్లడ్ గ్రూప్ ఏమిటి, మనకు అత్యవసర సమయాల్లో ఎలాంటి రక్తం అవసరం అవుతుందో తెలుసుకోగలుగుతున్నాం అంటే అది కార్ల్ ల్యాండ్‌స్టైనర్ బ్లడ్ గ్రూప్ లను గుర్తించిన తర్వాత సాధ్యపడింది. అందుకే ఆయన జ్ఞాపకార్థం తన జన్మదినమైన జూన్14నే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
స్థూలంగా మనకు ABO బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పటికీ ఇందులోనూ పాజిటివ్, నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయి. అందులోనూ కొన్ని అరుదైన బ్లడ్ గ్రూప్స్ (Rare Blood Groups) ఉంటాయి. ముఖ్యంగా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ లను అరుదైన బ్లడ్ గ్రూప్ లుగా చెప్తారు. అంటే అలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. దీంతో అత్యవసర సమయాల్లో ఈ దాతల రక్తం లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు సమయానికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. AB నెగెటివ్, B నెగెటివ్ అలాగే O నెగెటివ్ బ్లడ్ గ్రూప్ లను అరుదైన బ్లడ్ గ్రూప్స్ గా వర్గీకరించారు.
O బ్లడ్ గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే బ్లడ్ గ్రూప్. ముఖ్యంగా O పాజిటివ్ ఎక్కువ మంది కలిగి ఉంటారు, సుమారు 63 శాతం మంది ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటారు. సాధారణంగా O పాజిటివ్ రక్తం కలవారిని విశ్వదాతలుగా చెబుతారు, అంటే వీరు వీరి రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ O నెగెటివ్ కలవారు తక్కువ, వీరికి O పాజిటివ్ రక్తాన్ని కూడా ఎక్కించలేం. O నెగెటివ్ ఉన్నవారికి O నెగెటివ్ రక్తాన్ని మాత్రమే అందించాల్సి ఉంటుంది. ఇక AB నెగెటివ్ బ్లడ్ గ్రూప్ చాలా అరుదైనది, కేవలం 1శాతం మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారు.
ఇలాంటి కొన్ని అరుదైన రక్త వర్గాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూడండి.
AB నెగెటివ్ (AB-)
AB నెగెటివ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్త వర్గంగా పరిగణించడమైనది, ప్రపంచ జనాభాలో 1% కంటే తక్కువ మంది ఈ రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు.
B నెగెటివ్ (B-)
B నెగెటివ్ కూడా చాలా అరుదు, జనాభాలో కేవలం 2% మంది మాత్రమే ఈ రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు.
A నెగెటివ్ (A-)
A నెగెటివ్ సాధారణంగా తక్కువ మందికి ఉంటుంది. జనాభాలో 6% మంది ఈ రక్త వర్గాన్ని కలిగి ఉంటారు.
AB పాజిటివ్ (AB+)
ఇతర పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ కలిగిన వారి కంటే AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు కూడా చాలా అరుదుగా కనిపిస్తారు, ప్రపంచ జనాభాలో దాదాపు 3-4% మందికి AB+ రక్తం ఉంది.
A1B నెగెటివ్ (A1B-)
A1B నెగెటివ్ అనేది సాపేక్షంగా అరుదైన రక్త రకం, ఇది జనాభాలో 1% మందికి ఇలాంటి రక్తం ఏర్పడవచ్చు. ఒక వ్యక్తి వారి ఎర్ర రక్త కణాలపై A, B యాంటిజెన్‌లను కలిగి ఉండి, Rh కారకం లేనప్పుడు ఈ బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది.
బాంబే బ్లడ్ గ్రూప్
బాంబే బ్లడ్ గ్రూప్ చాలా అరుదు, చాలా తక్కువ సంఖ్యలో వ్యక్తులకు ఈ రకమైన బ్లడ్ గ్రూప్ కనిపిస్తుంది, ప్రధానంగా భారతదేశానికి చెందిన వ్యక్తుల్లోనే ఈ రకమైన బ్లడ్ గ్రూప్ కనిపిస్తుంది.
మీరూ ఈ అరుదైన రక్త వర్గాల జాబితాలో ఉంటే బాధ్యతగా మీ రక్తాన్ని దానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇది మీకు మరో రూపంలో అనగా మీకు కూడా అత్యవసర సమయంలో అవసరం అయినపుడు ప్రయోజనం చేకూర్చవచ్చు.
సంబంధిత కథనం