World Blood Donor Day । రక్తదానం చేయడం వలన మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
World Blood Donor Day 2023: రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం. రక్తదానం చేయడం వలన ఆ దాతకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
World Blood Donor Day 2023: రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం, ఇదొక నిస్వార్థమైన చర్య, సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్నే దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. గణాంకాల ప్రకారం. మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరం అవుతుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు, అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు.
వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. రక్తదానం చేసే ముందు రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రక్త పరీక్షలలో ఆ వ్యక్తికి ఏవైనా రక్తహీనత, అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనేది తెలుసుకోవచ్చు, తద్వారా సమస్యను గుర్తించి చికిత్స పొందడానికి వీలు కలుగుతుంది.
ఇదికాకుండా, రక్తదానం చేయడం వలన ఆ దాతకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits of Donating Blood) ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గవచ్చు
ఆరోగ్యకరమైన వ్యక్తులు సమయానుసారంగా రక్తదానం చేయడం వల్ల వారు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది, వారిలో సామర్థ్యం పెరుగుతుంది. అలా అని బరువు తగ్గేందుకే రక్తదానం చేయడం మంచిది కాదు. దీనిని బరువు తగ్గించే నియమావళిగా పరిగణించకూడదు. రక్తదానం కూడా ఒక విధంగా అధిక బరువును నియంత్రించగలదు. ఏదైనా మీరు రక్తం ఇచ్చే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
వివిధ దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించడానికి ఇమ్యునాలజీ కీలకం. రక్తదానం చేస్తూ ఉండటం వలన శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు. రక్తాన్ని ఇవ్వడం వలన శరీరంలోని పాత రక్తం పోయి కొత్త రక్తం తయారవుతుంది. బ్లడ్ ప్లాస్మా కూడా పునరుజ్జీవం పొంది, ల్యూకోసైట్‌ల పెరుగుదలలో సహాయపడుతుంది. ఈ ల్యూకోసైట్‌లు అనేవి వివిధ అనారోగ్యాల నుండి రక్షించే రోగనిరోధక కణాలు. కాబట్టి రక్తదానం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
సాధారణ రక్తదానం శరీరంలో ఇనుము స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రక్తంలో అధిక మొత్తంలో ఇనుము ఉంటే అది ధమనులను నియంత్రిస్తుంది, ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు రక్తంలో ఐరన్ శాతం ఎక్కువైతే హెమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి దారితీస్తుంది. రక్తదానం వలన శరీరంలోని అదనపు ఇనుము నిక్షేపాలను తగ్గించడం జరుగుతుంది. ఫలితంగా మీ ధమనులు పనితీరు మెరుగుపడి, బ్లడ్ ప్రెషన్ నియంత్రణలో ఉంచుతుంది. ఈ రకంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్యాన్సర్ వ్యాధిని దూరం చేస్తుంది
క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల రక్తంలో అధికమైన ఐరన్ శాతం తగ్గుతుంది, ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో అధిక ఇనుము ఉంటే అది రక్త క్యాన్సర్‌తో సహా ఇతర కొన్ని రకాల క్యాన్సర్‌లకు కారకం కాగలదు.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రక్తాన్ని దానం చేయడం వల్ల శారీరక ప్రయోజనాలే కాదు, మానసిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎలా అంటారా? మీరు వేరొకరికి రక్తదానం చేయడం వలన మీరు మరొకరి మంచి చేశారు, ఒకరి ప్రాణం పోశారు అనే అనుభూతిని కలిగిస్తుంది. ఈ రకమైన భావనలు, మీరు చేసే స్వచ్ఛంద కార్యకలాపాలు మీ మానసిక ఆరోగ్యంపై సానుకూలమైన ప్రభావాన్ని చూపుతాయి, ఇలా మీ మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. మీరు సంతోషంగా, సంతృప్తిగా జీవించగలరు.
రక్తదానం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం (World Blood Donor Day) గా జరుపుకుంటారు.
సంబంధిత కథనం