Women's Day 2024 : కోట్ల మందికి స్ఫూర్తి ఈ మహిళా ఐపీఎస్‌లు.. సెల్యూట్
Women's Day Special : మహిళలు ఈరోజుల్లో ఎందులోనూ తక్కువ కాదు. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. అయితే కొంతమంది మహిళా ఐపీఎస్‌ల జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. వారి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
మహిళలు నేడు ప్రతీ రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు స్ఫూర్తిదాయకమైన మహిళల గురించి తెలుసుకుందాం. సివిల్ సర్వీసెస్‌లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన కొంతమంది మహిళా అధికారుల గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వారు కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి.
డైనమిక్ ఆఫీసర్
1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విమ్లా మెహ్రా చాలా డైనమిక్ ఆఫీసర్. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాంలో పని చేశారు. ఢిల్లీ పోలీస్‌లో కీలక పాత్ర పోషించారు. 2012లో తీహార్ జైలు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. తన పదవీ కాలంలో ఖైదీలను ఉద్యోగ ఆధారిత నైపుణ్యాల కోసం సిద్ధం చేశారు. వృత్తిపరమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడంతో సహా అనేక మార్పులను తీసుకువచ్చారు. మహిళా ఖైదీలు, అండర్ ట్రయల్ కోసం విదేశీ భాషా కోర్సులను ప్రారంభించారు. మహిళలపై నేరాల విభాగానికి అధిపతిగా ఉమెన్స్ హెల్ప్‌లైన్ 1091ను ప్రారంభించి, మహిళలకు రక్షణ శిక్షణ కార్యక్రమాలను అమలు చేశారు విమ్లా.
రెండో మహిళా ఐపీఎస్
1947లో సిమ్లాలో జన్మించిన కంచన్ చౌదరి భట్టాచార్య ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరారు. ఆమె భారతదేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిని నిర్వహించిన మొదటి మహిళ. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తొలి ఐపీఎస్ అధికారి కూడా. 2004లో మెక్సికోలోని కాంకున్‌లో జరిగిన ఇంటర్‌పోల్ సమావేశానికి కాంచన్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమె ఆల్ ఇండియా ఉమెన్ పోలీస్, ఉత్తరాఖండ్ పోలీస్ చైర్ పర్సన్. 1997, 1989లో రాష్ట్రపతి పతకాలు, 2004లో రాజీవ్ గాంధీ అవార్డు అందుకున్నారు. కాంచన్ 2007లో సర్వీస్ నుండి రిటైర్ అయ్యారు. అనారోగ్యంతో 2019లో 72 సంవత్సరాల వయసులో మరణించారు. కానీ ఆమె చేసిన సేవలు మాత్రం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.
సిమ్లా తొలి మహిళా ఐపీఎస్
సిమ్లా తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి సౌమ్య సాంబశివన్. మహిళల భద్రత కోసం ఎంతో కృషి చేశారు. స్థానికంగా ఒక స్ప్రేని కనిపెట్టారు. మహిళలు తమ రక్షణ కోసం ఉపయోగించమని కోరారు. దీంతో వార్తగా నిలిచారు. కానీ మహిళలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేవారు కాదు.
కాశ్మీర్ లోయ నుంతి తొలి ఐపీఎస్
ఐపీఎస్‌లో చేరాలన్న తన తండ్రి కలను సాకారం చేస్తూ డాక్టర్ రువేదా సలామ్ కాశ్మీర్ లోయ నుంచి తొలి ఐపీఎస్ అధికారిణి అయ్యారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీలో ఉత్తీర్ణులయ్యాక ఐపీఎస్ కేడర్‌లో చేరారు. చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు.
ఎంపిని కొట్టిన ఐపీఎస్
చండీగఢ్‌కు చెందిన సోనియా నారంగ్ కర్ణాటకలోని పలు నగరాల్లో సేవలందించారు. 2006లో జరిగిన ఓ ఘటనలో ఓ ఎంపీని కొట్టి వార్తల్లో నిలిచారు.
సంగీత కలియా
సంగీత కలియా 2009లో మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అయ్యారు. ఐపీఎస్ సంగీతా కలియా తండ్రి ధరంపాల్ ఫతేహాబాద్ పోలీస్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. సంగీతకు మంచి పేరు ఉంది. డైనమిక్ ఆఫీసర్ అని చెబుతారు.
పవర్ ఫుల్ ఆఫీసర్
అస్సాంకు చెందిన సంజుక్తా పరాశర్ 16 మంది ఉగ్రవాదులను హతమార్చిన గొప్ప అధికారి. ఆమె అస్సాంలో 15 నెలల కాలంలో ఉగ్రవాదులను పట్టుకున్నారు. బంగ్లాదేశ్ మిలిటెంట్ల హింసను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నారు. ఆమె పేరు చెబితే ఇప్పటికీ చాలా మంది భయపడుతారు. పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా సంజుక్తాకు పేరు ఉంది.