యోగా కొన్ని భంగిమల ద్వారా శరీరంలోని ఎన్నో లోపాలను వ్యాధులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి వాటిలో మత్స్యాసనం ఒకటి. థైరాయిడ్, థైమాస్ గ్రంథులను ఉత్తేజపరిచేలా ఈ మత్స్యాసనం పనిచేస్తుంది. గొంతు, మెడలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన కూడా చాలా వరకు తగ్గుతుంది.
మత్స్యాసనం ప్రతిరోజూ వేయడం వల్ల మెడ, గొంతు సాగుతాయి. దీనివల్ల థైరాయిడ్, థైమాస్ గ్రంధులలో ఉన్న లోపాలు చాలా వరకు తీరిపోతాయి. అంతేకాదు థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచేలా మత్స్యాసనం కృషి చేస్తుంది. ఈ భంగిమ థైరాయిడ్ తో పాటు థైరాయిడ్ చుట్టుపక్కల ప్రాంతాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కేవలం థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికే కాదు నాడీ వ్యవస్థ సమస్యలు ఉన్నవారు కూడా మత్స్యాసనం వేయడం ఎంతో అవసరం. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మార్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడకుండా అడ్డుకుంటుంది.
శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు కూడా మత్స్యాసనం వేయవచ్చు. ఇది ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచి శ్వాస ఇబ్బందులు లేకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా మహిళలు మత్స్యాసనం వేయడం అత్యవసరం.
మత్స్యం అంటే చేప అని అందరికీ తెలిసిందే. ఈ ఆసనం వేస్తే చేప భంగిమలో ఒక మనిషి కనిపిస్తాడు. అందుకే దీనికి మత్స్యాసనం అని పేరు పెట్టారు.
ఈ మత్స్యాసనం వేయడం వల్ల మెడ, భుజాల ప్రాంతంలో వచ్చే నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. అలాగే అక్కడున్న కండరాలు కూడా బలంగా మారుతాయి. మహిళల్లో నెలసరి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించే శక్తి కూడా మత్స్యాసనంకు ఉంది. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. ఆస్తమా వ్యాధితో బాధపడే వారికి కూడా మత్స్యాసనం ఎంతో మేలు చేస్తుంది.
మత్స్యాసనం వేసేందుకు ముందుగా పద్మాసనం వేసుకొని కింద కూర్చోవాలి. పద్మాసనంలో భాగంగా కుడి కాలిని ఎడమ తొడ మీద, ఎడమకాలుని కుడి తొడ మీద వేయాలి. ఇప్పుడు ఎడమ చేతితో కుడి కాలి బొటనవేలిని, కుడి చేతితో ఎడమ కాలి బొటనవేలిని పట్టుకోవాలి.
అలా మెల్లగా తలను నేలవైపుగా ఆన్చాలి. భుజాలను, ఛాతీ భాగాన్ని మాత్రం పైకి లేపాలి. ఇది వేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉండి తిరిగి పద్మసన స్థితిలోకి చేరుకోవాలి. మత్స్యాసనం రెండు మూడు నిమిషాల పాటు ప్రతిరోజు వేయడం వల్ల పైన చెప్పిన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.