మహిళలకు 30 ఏళ్లు దాటిందంటే ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని అర్థం చేసుకోండి. ఎందుకంటే 30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకలు బలహీనంగా మారడం మొదలవుతాయి. వారి ఎముక ద్రవ్యరాశి త్వరగా తగ్గుతుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. 30 ఏళ్లు దాటిన మహిళలు ప్రత్యేకంగా ఆహారంలో కొన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి బలమైన ఎముకలను అందిస్తాయి. ఎముక అనారోగ్యాలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తాయి.
మార్కెట్లో దొరికే ఆకుపచ్చని ఆకుకూరలను అధికంగా తినాలి. ముఖ్యంగా మెంతికూర, పాలకూర వంటివి తినాల్సిన అవసరం ఉంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి వీటిని కూరగా వండుకొని తిన్నా లేదా సలాడ్లలో వేసుకొని పచ్చిగా తిన్నా మంచిదే. వారంలో రెండు మూడు సార్లు ఈ ఆకుకూరలను తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి.
పప్పుధాన్యాలు, బీన్స్ వంటివి రెండు మూడు రోజులకు ఒకసారి తినాల్సిన అవసరం ఉంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా మంచి మొత్తంలో ఉంటుంది. పెసరపప్పు, రాజ్మా, కొమ్ము శెనగలు వంటివి కూడా తినాలి. వాటిని సూప్, సలాడ్ రూపంలో తినడం వల్ల వారికి ఎముకలు బలంగా మారుతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాల్షియం లోపం మహిళల్లో కనిపించదు.
నువ్వుల్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు రకాలు ఉంటాయి. నల్ల నువ్వులైనా, తెల్ల నువ్వులైనా కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. కూరల్లో పైనా నువ్వుల్ని చల్లుకోవడం లేదా నువ్వులతో ఏదైనా ఆహారాలు అంటే నువ్వుల లడ్డులు వంటివి చేసుకొని తినడం చేయాలి. అలాగే పెరుగులో నువ్వులు కలుపుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ వంటివన్నీ కూడా క్యాల్షియంతో నిండి ఉంటాయి. అలాగే వీటిలో ఎంతో కొంత విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి అనేది క్యాల్షియం మన శరీరం గ్రహించడానికి అత్యవసరమైనది. కాబట్టి మీ ఆహారంలో ప్రతిరోజూ రెండుసార్లు ఏవైనా పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోండి.
సోయాబీన్స్ తో తయారు చేసే ఆహారాలు మార్కెట్లో అధికంగానే ఉంటాయి. సోయా టోఫు, మీల్ మేకర్ వంటివి సోయాతోనే తయారు చేస్తారు. వీటిలో ప్రోటీన్, క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మూడు రోజులకు ఒకసారి సోయాబీన్స్ తో చేసిన ఆహారాన్ని తినడం వల్ల మహిళలకు ఎముకలు బలంగా మారుతాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం