Wife's Demand: జాబ్ మానేసి హౌస్‌వైఫ్‌గా ఉండమన్నందుకు.. ఓ మహిళ భర్త నుంచి ఏం కోరుకుందంటే..
రెడిట్‌లో ఒక మహిళ తన భర్త కంపెనీలో ఈక్విటీ కోరింది. దానికి కారణం, దానిమీద యూజర్ల స్పందన ఆసక్తికరంగా ఉంది. అదేమిటో చూడండి.
ఇటీవల ట్విటర్లో పోస్ట్ చేసిన రెడిట్‌లో అడిగిన ఓ ప్రశ్న కాస్త ఆసక్తిని రేకెత్తించింది. తాను గృహిణిగా ఉండాలని తన భర్త కోరుకుంటున్నాడని, కానీ దానికోసం తను అడిగిన మూల్యం చెల్లించడానికి ఏకీభవించడం లేదని ఓ మహిళ పోస్ట్ చేసింది. చివరికి ఏమైందో కూడా తెల్సుకోండి.
తన షరతు గురించి ఏం రాసిందంటే..
తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. “నాకూ, మా ఆయనకు 35 సంవత్సరాలు. మా పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇప్పుడు మాకిద్దరు పిల్లలు. తొందర్లో ఇంకొకరు రాబోతున్నారు. ఇప్పుడు నా భర్త నన్ను ఉద్యోగం మానేసి హౌస్‌వైఫ్‌గా ఉండమంటున్నారు. ఆ మాటతో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. మా కుటుంబం కోసం, పిల్లలకోసం నేను హౌజ్‌వైఫ్ గా ఉంటే బాగుంటుందని, మమ్మల్ని పోషించి మంచి జీవితాన్నిచ్చే సామర్థ్యం ఆయనకుందని నా భర్త అంటున్నారు.
కొన్ని వారాలు ఆలోచించి ఆయనకు నేనొక నిర్ణయం చెప్పాను. నేను హౌజ్‌వైఫ్‌గా ఉండాలంటే ఆయన కంపెనీలో యాభై శాతం వాటా కావాలని అడిగాను. దానికి ఆయన ఆశ్చర్యపోయారు. ఒకవేళ మేం విడాకులు తీసుకుంటే.. ఇలా ఎక్కువ రోజులు ఇంటికే పరిమితమైనందుకు మంచి జీతం ఉన్న ఉద్యోగం సంపాదించుకునే అర్హత కోల్పోతాను. ఆయన మాత్రం ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు. అందుకే ఆయన కంపెనీలో సగం వాటాను కోరాను. పెళ్లంటేనే కలిసి ఉండాలని చేసుకుంటాం. కాబట్టి ఎప్పటికీ మేం విడాకులు తీసుకోకపోతే ఈ షరతు పెద్ద విషయం ఏం కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దానివల్ల నా మీదే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని నా స్నేహితులకు చెప్తే వాళ్లు నా మీద కోప్పడ్డారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ” అని రాసుకొచ్చింది..
మీకేం అనిపిస్తోంది?
రెడిట్ యూజర్లు ఆ మహిళ అడిగింది సమంజసమేనంటూ మద్దతిచ్చారు. ఈ విషయంలో మీరు తగ్గకండి. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం అతనికి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంతే హక్కు ఉంది. మీ షరతుకు ఒప్పుకోకపోతే మీకు నష్టం చేకూర్చాలనే ఆలోచన అతనిలో ఉన్నట్లే. అలాగే మీ సంసారానికి సంబంధించిన విషయాల గురించి మీ స్నేహితులను అడగకండి అని ఒక యూజర్ స్పందించారు.
మరొకరు.. “మీరు చెప్పిన కారణాలన్నీ నాకు సమంజసంగానే అనిపిస్తున్నాయి. యాభై ఏళ్ల వయసులో మీరు ఉద్యోగం కోసం వెతుక్కునే పరిస్థితుల్లో ఉండాలనుకోకండి. మీ కెరీర్ నైపుణ్యాలకున్న గడువు అప్పటికే దాటిపోతుంది. మీ భర్త మాత్రం తన జీవితంలో ముందుకు సాగిపోతారు. మీరు ఆర్థికంగా ఆధారపడి ఉన్నందున ప్రేమలేని బంధంలో ఇరుక్కుపోకండి.” అని తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
ట్విట్లర్లో భిన్న స్పందనలు:
ట్విట్టర్ లో అభిప్రాయం ఒకేలా లేదు. 'ఒకేసారి యాభై శాతం వాటా కోరడం సరికాదు. ఆమెకు సగం వాటా ఇచ్చిన ఏడాదిలోపు విడాకులు తీసుకుంటే ఏమవుతుంది? ఆమె గృహిణిగా ఉన్న ప్రతి సంవత్సరం కొంత ఈక్విటీని పొందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను." అని ఒకరన్నారు. మరొకరు, “నాకోసం ఒక వ్యాపారం మొదలుపెట్టండి. దాంతో నాకు ఒక ఆదాయం వస్తుంది. దాంతో పాటూ నేనూ కొన్ని విషయాలు నేర్చుకుంటాను. అని ఆమె కోరి ఉంటే బాగుండేది. ఈ షరతు స్వార్థ్యంతో అడిగినట్లు అనిపిస్తుంది కానీ, భద్రత కోసం అడిగినట్లు అనిపించట్లేదు. ఆమె అతని నుంచి ఎక్కువగా ఆశపడుతోంది” అని అన్నారు.
ఇలా రకరకాల స్పందనలు యూజర్లు తెలియజేస్తున్నారు. కొందరు మద్దతిస్తే. కొందరు వ్యతిరేకిస్తున్నారు.
చివరికి ఏమైందంటే..
ఈ విషయం గురించి రెడిట్‌లో అప్డేట్ ఇచ్చారు. తన భర్త, భార్య పెట్టిన షరతుకు ఒప్పుకున్నారట. కానీ 50 శాతానికి బదులు 49 శాతం వాటా ఇచ్చాడట. ఇంకొకరు కాస్త సరదాగా దీని గురించి కూడా ట్వీట్ చేశారు. మీ భార్యకు 51 శాతం ఇవ్వండి. ఒక మహిళ సొంత బిజినెస్ నడిపితే వచ్చే లాభాలన్నీ మీరు అనుభవించండి అని.
టాపిక్