Cancer: పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు, ఆ రోగాన్ని అడ్డుకునే ఈ ఆహారాలను ముందుగానే తినడం ఉత్తమం
Cancer: ఇప్పుడు అధికంగా వ్యాపిస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ మరణాలు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి. ఆ రోగాన్ని ముందుగానే రాకుండా జాగ్రత్త పడడానికి కొన్ని ఉత్తమ ఆహారాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి.
ఒకప్పుడు క్యాన్సర్ చాలా తక్కువమందిలోనే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎంతో మంది ఏటా రకరకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు. మనదేశంలో కూడా క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చిన్న వయసులోనే క్యాన్సర్ వల్ల ఇబ్బందిపడుతున్న సంఖ్య ఎక్కువగానే ఉంది. యువతలో క్యాన్సర్ మరణాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తినడం ద్వారా క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.
క్యాన్సర్ వచ్చే అవకాశాలను చెడు ఆహారపు అలవాట్లు కూడా కారణమే. నిశ్చల జీవనశైలి అంటే వ్యాయామం చేయకుండా గంటల పాటూ కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయడం కూడా క్యాన్సర్ కు కారణం కావచ్చు. శారీరక శ్రమ తగ్గుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివన్నీ వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
సమతుల్య ఆహారం మన శరీరానికి అవసరమైన క్యాన్సర్ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు.
హెచ్ టి డిజిటల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ శర్మ మీ రోజువారీ ఆహారంలో కచ్చితంగా తినాల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. క్యాన్సర్ బారిన పడకపోయినా కూడా ముందు జాగ్రత్తగా ఈ ఆహారాలను తినడం ద్వారా కొంత మేరకు రక్షణను పొందవచ్చు.
కూరగాయలు
బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఆహారాలను తీసుకోండి. యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ తో నిండిన ఈ కూరగాయలు రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ తో సహా వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ముందుంటాయి.
బెర్రీస్
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలలో రోగనిరోధక శక్తి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి.ఇది క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుంది. ప్రతిరోజూ బెర్రీలను ఆహారంలో తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కర్కుమిన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కర్కుమిన్ అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వంటలో పసుపును కచ్చితంగా వేయండి.
ఆకుకూరలు
పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరలు మొత్తం శరీరం కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే, ఇవి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది.
చేపలు
మాకేరెల్ వంటి కొవ్వు చేపల్లో సమృద్ధిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొలొరెక్టల్ క్యాన్సర్ నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను పొందడానికి వారానికి రెండుసార్లు కొవ్వు చేపలను ఆహారంలో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిని కచ్చితంగా ఆహారంలో ఉండేలా చూసుకోండి. వెల్లుల్లిలో క్యాన్సర్ ను అడ్డుకునే గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో కనిపించే అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంది. వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
పైన చెప్పి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నిర్వహించుకోవడం, పొగాకు, మద్యపానం వంటివి మానేయడం వంటివి చేయాలి.