No Dinner for Weight Loss: రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గుతారా? ప్రయత్నించాలనుకుంటే లాభాలతో పాటు నష్టాలు తెలుసుకోండి!-will skipping dinner help you lose weight if youre thinking of trying it know the benefits and risks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Dinner For Weight Loss: రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గుతారా? ప్రయత్నించాలనుకుంటే లాభాలతో పాటు నష్టాలు తెలుసుకోండి!

No Dinner for Weight Loss: రాత్రి భోజనం మానేస్తే బరువు తగ్గుతారా? ప్రయత్నించాలనుకుంటే లాభాలతో పాటు నష్టాలు తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

No Dinner for Weight Loss: బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లు రాత్రి పూట భోజనం మానేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఇదేనా? ఈ నియమం పాటించడం వల్ల జీవక్రియ, జీవనశైలి వంటి వ్యక్తిగత అంశాలపై ఎటువంటి ఫలితాలు కనిపిస్తాయో తెలుసుకుందామా!

బరువు తగ్గాలంటే, భోజనం మానేయాలా? (Pixabay)

రాత్రుళ్లు భోజనం చేయకుండా పడుకోవడం బరువు తగ్గడానికి చేసే మార్గాల్లో ప్రభావవంతమైనదిగా భావిస్తుంటారు. మరికొందరి వాదన ప్రకారం, డిన్నర్ చేయకపోవడం అంటే, ఉపవాసంతో పడుకోకుండా ఎంతో కొంత తినాలని చెబుతుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఎలా ఉంటే, (తింటే) త్వరగా బరువు తగ్గుతామనే గందరగోళం చాలా మందిలో ఉండేదే. వాస్తవానికి ఇలా చేయడం వల్ల శరీరంలోకి కేలరీలు చేరే శాతం తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గేందుకు ఓ మోస్తారు ప్రయోజనం ఉంది. కానీ, ఇది అందరికీ కాదు. కొందరిలో ఈ పద్దతి సమస్యలను తెచ్చిపెడుతుంది.

రాత్రి భోజనం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎవరెవరు దీన్ని పాటించాలి? ఎవరెవరు పాటించకూడదు? తెలుసుకుందాం రండి.

రాత్రి భోజనం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. కేలరీలను తగ్గిస్తుంది

మీరు రోజూ తీసుకునే దానికంటే తక్కువ కేలరీలను శరీరంలోకి పంపినప్పుడు బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రాత్రి సమయంలో ఎక్కువ పని చేయరు. కాబట్టి, రాత్రి పూట భోజనం మానేయడం లేదా తగ్గించి తినడం ద్వారా కేలరీలను తగ్గించవచ్చు.

2. ఆలస్యంగా తినడాన్ని తగ్గిస్తుంది

చాలా మంది ఆలస్యంగా స్నాక్స్ (మిఠాయిలు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్) తీసుకోవడం వల్ల అదనపు కేలరీలను తీసుకుంటారు. రాత్రి భోజనం లేదా స్నాక్స్ మానేయడం వల్ల ఈ అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటారు.

3. జీర్ణక్రియ, నిద్రను మెరుగుపరుస్తుంది

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణమయ్యేందుకు యాసిడ్లు ఉత్పత్తి అవుతుండటం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల జీర్ణక్రియ మెరుగై, నాణ్యమైన నిద్ర కలుగుతుంది.

రాత్రి భోజనం మానేయడం వల్ల కలిగే నష్టాలు

1. అధిక ఆకలి, అతిగా తినడం

రాత్రి భోజనం మానేయడం వల్ల కొంతమందికి మరుసటి రోజు ఉదయం తీవ్రమైన ఆకలి అనిపిస్తుంది. ఇది అతిగా తినడానికి ప్రేరేపిస్తుంది. ఎక్కువగా తినేయడం వల్ల బరువు తగ్గడంలో ఎటువంటి ఫలితం కనిపించదు.

2. శక్తి స్థాయిలను తగ్గిస్తుంది

సాయంత్రం సమయంలో శారీరక వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్లు, రాత్రి భోజనం మానేయడం వల్ల అలసట, తక్కువ పనితీరు కనబరుస్తారు. కొంతమంది దీర్ఘకాలం తినకుండా ఉంటే తలనొప్పి లేదా చిరాకును అనుభవిస్తారు.

3. జీవక్రియను నెమ్మదిస్తుంది

మీరు రాత్రి భోజనం మానేసి, మొత్తం మీద చాలా తక్కువగా తింటూ ఉంటే, మీ జీవక్రియ నెమ్మదిస్తుంది.

రాత్రి భోజనం మానేయడం చాలా కష్టమని అనిపిస్తే

తక్కువ మోతాదులో రాత్రి భోజనం చేయండి - భోజనాన్ని పూర్తిగా మానేయడానికి బదులుగా, ప్రోటీన్, కూరగాయలతో మంచి భోజనం చేయండి.

ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలను తగ్గించండి - కేలరీలను తగ్గించడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి. సహజమైన పదార్థాలతో చేసిన ఆహారం తీసుకోండి.

ప్రోటీన్, ఫైబర్ తీసుకోవడాన్ని పెంచండి - ఇవి తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ సమయం పాటు పొట్ట నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రిస్తుంది.

రాత్రి భోజనం మానేయడం కేలరీలను తగ్గించి, కొవ్వును కరిగించడానికి ప్రోత్సహిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, ఇది అందరికీ సరిపోదు. కొంతమంది తక్కువ ఆకలి, మెరుగైన జీర్ణక్రియ వంటి ప్రయోజనం పొందుతారు. మరికొందరు ఆకలితో నిద్రలేమి, అలసట లేదా తరువాత అతిగా తినడం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం