Independence Day : భారత్ కంటే ఒక్కరోజు ముందే పాక్‌లో సంబరాలు.. 30 నిమిషాలు తెచ్చిన తంట!
Independence Day 2024 : భారత్‌తో అన్ని విషయాల్లోనూ కుట్రపూరితంగా పోటీపడే పాకిస్థాన్.. చివరికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ పైచేయి సాధించేందుకు తేదీలనే మార్చేసింది. కేవలం 30 నిమిషాలను బూచిగా చూపిస్తూ.. ఒక్క రోజు ముందే
Pakistan Independence Day : దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్.. 1947 ఆగస్టులో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాయి. కానీ.. భారత్ కంటే ఒక్క రోజు ముందు.. అంటే ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను జరుపుకుంటోంది. ఇలా పాక్ ఒక్కరోజు ముందు వేడుకలు జరుపుకోవడానికి కొన్ని ఓ ఇంట్రస్టింగ్ కారణం ఉంది.
ఆగష్టు 14, 1947న వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్థాన్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడి.. అధికారాన్ని బదిలీ చేశాడు. నిజానికి భారత్, పాకిస్థాన్‌కి ఒకేసారి అధికారాన్ని బదిలీ చేయాలని అతను ఆశించాడు. కానీ.. ఒకేరోజు న్యూఢిల్లీ, లాహోర్‌లో ఉండి అధికారాన్ని బదిలీ చేయడం సాధ్యంకాదని తొలుత పాకిస్థాన్‌కు.. ఆ తర్వాత భారత్‌కి అధికారాన్ని బదిలీ చేశాడు.
ఢిల్లీ, కరాచీలో ఒకే రోజు కష్టమని!
ఆగస్ట్ 14న కరాచీలో పాకిస్తాన్‌కు అధికారాన్ని బదిలీ చేసిన లార్డ్ మౌంట్ బాటన్.. ఆ తర్వాత న్యూఢిల్లీకి బయల్దేరారు. దాంతో అధికార మార్పిడి జరిగిన రోజునే.. స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించి పాకిస్థాన్ జరుపుకుంటోంది. వాస్తవానికి తొలుత భారత్ లాగే పాకిస్థాన్ కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అనుకుంది.
కానీ.. 1948లో పాకిస్థాన్ మొట్ట మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ కొన్ని సిద్ధాంతాలను తెరపైకి తెచ్చి ఆగస్టు 14న జరుపుకోవాలని ప్రతిపాదించగా.. కేబినెట్ కూడా ఆమోదించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగస్టు 14న పాక్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే అలీ ఖాన్ సిద్ధాంతాలను వ్యతిరేకించే కొందరు మరో కారణాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు.
30 నిమిషాల లాజిక్
కాలమానం ప్రకారం పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ 30 నిమిషాలు ముందు ఉంటుంది. ఆగస్టు 14న అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ.. పాకిస్థాన్‌లో మాత్రం అప్పుడు సమయం రాత్రి 11.30 నిమిషాలే. కాబట్టి.. ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని పాకిస్థాన్ వాళ్లు వాదిస్తుంటారు. ఏది ఏమైనా దాయాది దేశాలు గంటల వ్యవధిలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాయి.