డయాబెటిస్ అనేది నిశ్శబ్దంగా చంపే వ్యాధి. ఒక్కసారి శరీరంలో చేరితే దాన్ని పూర్తిగా నిర్మూలించడం ఎవరితరం కాదు. ఆరోగ్యకరమైన జీవన శైలితో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవాల్సిందే. ఇది జీవిత నాణ్యతను కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారిలో ఎక్కువ మంది భుజం నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ భుజం నొప్పి వల్ల వారు అప్పుడప్పుడు ఏ పని చేసుకోలేరు.
డయాబెటిక్ రోగులలో దీర్ఘకాలికంగా రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇవి భుజాల దృఢత్వాన్ని కూడా తగ్గిస్తుంది. భుజం కదలికలపై ప్రభావాన్ని చూపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో కండర ద్రవ్యరాశి కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్లే భుజం బలంపైనా, కదలిక పైన చాలా ప్రభావం పడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, భుజం నొప్పి ఉండే అవకాశం ఎక్కువ. భుజాలలో నొప్పి వేధిస్తున్నప్పుడు వెంటనే వైద్యులను కలిసి అక్కడ కండరాలు మందంగా మారకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే భుజం చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
డయాబెటిస్ వల్ల అక్కడ ఉండే కొలాజిన్ జిగటగా మారి కదలికలు కష్టతరం చేస్తుంది. దీనివల్ల భుజం కదపడానికే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి క్యాప్సూలర్ ఫైబ్రోసిస్ వంటి సమస్య కూడా వస్తుంది. ఇది భుజం దగ్గర ఘనీభవించేలా చేస్తుంది. అప్పుడు భుజం కదిపితే చాలు తీవ్రంగా నొప్పి వస్తుంది. డయాబెటిస్ వల్ల కలిగే భుజం నొప్పి రోజువారి జీవనానికి కూడా అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి భుజం నొప్పి ని తక్కువ అంచనా వేయకండి.
మనదేశంలో డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుంది. భారతదేశం డయాబెటిస్ రాజధానిగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం