Pregnancy: గర్భం ధరించిన విషయం మూడు నెలల వరకు బయటికి చెప్పరు ఎందుకు?-why is pregnancy hidden for three months what is the reason ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy: గర్భం ధరించిన విషయం మూడు నెలల వరకు బయటికి చెప్పరు ఎందుకు?

Pregnancy: గర్భం ధరించిన విషయం మూడు నెలల వరకు బయటికి చెప్పరు ఎందుకు?

Haritha Chappa HT Telugu
Published Feb 10, 2025 04:30 PM IST

Pregnancy: గర్భం దాల్చిన తర్వాత 3 నెలల పాటు గర్భిణులను ఆ విషయం బయటికి చెప్పొద్దని అమ్మమ్మలు సలహా ఇస్తుంటారు. అయితే ప్రెగ్నెన్సీని మూడు నెలలు ఎందుకు దాస్తారో తెలుసా? దీనికి ఒక కారణం ఉంది.

ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడు బయటికి చెప్పాలి?
ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడు బయటికి చెప్పాలి?

ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో ఎంతో సంతోషకరమైన సందర్భం. ఆ విషయాన్ని ఆమె ఎంతో ఆనందంగా బయటికి చెప్పాలని అనుకుంటారు. అయితే ఇంట్లోని అమ్మమ్మలు, నాన్నమ్మలు మాత్రం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెంటనే బయటకి చెప్పనివ్వరు. గర్భం వయసు మూడు నెలలు దాటాకే అందరికీ చెప్పేందుకు అనుమతిస్తారు.

ఇప్పుడు మహిళలు చాలా ఆలస్యంగా కుటుంబాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు, కనీసం మూడు నెలల వరకు గర్భం గురించి ఎవరికీ చెప్పవద్దని ఎంతో మంది సలహాలు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ శుభవార్తను మూడు నెలలపాటు ఎందుకు దాచమని చెబుతారో పెద్దలు వివరిస్తున్నారు.

గర్భం గురించి ఎప్పుడు బయటపెట్టాలి?

గర్భం ధరించాక మొదటి త్రైమాసికం అంటే గర్భం దాల్చిన తరువాత మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తల్లి పొట్టలో ఉన్న బిడ్డకు సంబంధించిన ప్రధాన అవయవాలన్నీ ఏర్పడతాయి. దీని వల్ల స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే గర్భిణులు కూడా మొదటి మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది గర్భధారణ వార్తలను ఎవరికైనా చెప్పడానికి మూడు నెలలు వేచి ఉండటానికి ఇష్టపడతారు ఎందుకంటే ప్రారంభ నెలల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా గర్భస్రావాలు మొదటి త్రైమాసికంలో అంటే 12 వారాలలో సంభవిస్తాయి. అందుకే గర్భం నిలిచిన తరువాతే బయటికి చెప్పేందుకు ఇష్టపడతారు.

అల్ట్రాసౌండ్ స్కానింగ్ గర్భం దాల్చిన ఆరు నుండి ఎనిమిది వారాలలో చేస్తారు. ఇందులో శిశువు హృదయ స్పందన ఎలా ఉందో, బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో చూస్తారు. గర్భం ఆరోగ్యకరంగా ఉందో లేదో చెబుతారు. గర్భం ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్నాకే ప్రెగ్నెన్సీ గురించి అందరికీ చెప్పాలని అంటారు.

ప్రారంభ రోజుల్లో కొంతమంది సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే గర్భం ధరించినట్టు చెబుతారు. అయితే సన్నిహితులు, ఇతర స్నేహితులకు కూడా చెప్పాలంటే గర్భం ఆరోగ్యంగా ఉందని, గర్భస్రావం అయ్యే అవకాశం లేదని నిర్ధారించుకున్నాకే చెప్పాలి.

గర్భం ధరించిన తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. గర్భం ధరించిన మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయకూడదు. కారు డ్రైవింగ్, స్కూటీ డ్రైవింగ్ వంటివి మానేయాలి. రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఇక పగటిపూట ఒక గంట నిద్రపోవాలి.

గర్భం ధరించాక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా పైనాపిల్, నారింజ తినడం మానేయాలి. మొదటి మూడునెలలపాటూ ఈ పండ్లతో పాటూ బొప్పాయి కూడా తినకూడదు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం