Easter 2024: ఈస్టర్ ఎందుకు జరుపుకుంటారు? యేసుని శిలువ వేసిన తర్వాత మూడో రోజు ఏం జరిగింది?-why is easter celebrated what happened on the third day after the crucifixion of jesus ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Is Easter Celebrated? What Happened On The Third Day After The Crucifixion Of Jesus?

Easter 2024: ఈస్టర్ ఎందుకు జరుపుకుంటారు? యేసుని శిలువ వేసిన తర్వాత మూడో రోజు ఏం జరిగింది?

Gunti Soundarya HT Telugu
Mar 30, 2024 02:03 PM IST

Easter 2024: యేసు క్రీస్తుని శిలువ వేసిన తర్వాత మూడో రోజు ఏం జరిగింది. ఈస్టర్ ఎందుకు జరుపుకుంటారు? పునరుత్ఠానుడిగా ముందుగా ఎవరికి యేసు క్రీస్తు కనిపించారు అనే ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

ఈస్టర్ ఎందుకు జరుపుకుంటారు?
ఈస్టర్ ఎందుకు జరుపుకుంటారు? (unsplash)

Easter 2024: ప్రజల పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం యేసు ప్రభువు శిలువ వేయబడ్డాడు. ఆరోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. మూడో రోజున తాను సమాధి నుంచి పునరుత్థానుడిగా తిరిగి వస్తానని చెప్తాడు. యేసు తిరిగి లేచిన రోజును ఈస్టర్ గా జరుపుకుంటారు. ఈ ఏడాది ఈస్టర్ మార్చి 31వ తేదీ వచ్చింది.

శిలువ వేసిన తర్వాత ఏం జరిగింది?

కల్వరి శిలువలో ప్రాణాలు వదిలిన తర్వాత ఆయన శిష్యుడైన యోసేపు యేసుక్రీస్తు శరీరాన్ని అప్పగించమని రోమా శతాధిపతిని అడుగుతాడు. అందుకు అంగీకరించిన శతాధిపతి యేసు శరీరాన్ని అప్పగిస్తారు. అతడు యేసు శరీరానికి నార బట్టలు చుట్టి సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయిని సమాధికి మూతగా దొర్లించి వెళ్తారు. అక్కడ రోమా సైనికులు కాపలాగా ఉంటారు.

గుడ్ ఫ్రైడే తర్వాత మూడో రోజు సూర్యోదయం సమయాన యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాసేందుకు మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియ సమాధి దగ్గరికి వస్తారు. అయితే అక్కడ సమాధికి పెట్టిన రాయి దొర్లించి ఉండడం చూసి భయపడి పోతారు. లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సమాధి తెరిచి ఉంటుంది. అక్కడ సమాధి తలవైపు ఒక దేవదూత, కాళ్ళ వైపు మరొక దేవదూత ఉంటారు.

నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారు. కానీ ఆయన ఇక్కడ లేరు పునరుత్థానుడిగా సమాధి నుంచి తిరిగి లేచాడని ఈ విషయం వెళ్లి అందరికీ చెప్పమని దేవదూతలు వారికి చెప్తారు. అయితే మగ్ధలేని మరియ తమ యేసుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడుస్తూ వెళ్తుండగా అక్కడ తెల్లని వస్త్రాలు ధరించి ఉన్న ఒకరు కనిపిస్తారు. తోటమాలి అనుకుని మరియ ఏడుస్తూ మా యేసుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఎవరు తీసుకుపోయారో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు యేసు నేను ముందుగానే చెప్పినట్టు సమాధి నుంచి తిరిగి లేచానని ఈ విషయం అందరికీ చెప్పమని చెప్తాడు. యేసు పునరుత్థానుడిగా తిరిగి లేచిన తర్వాత మొదటిగా కనిపించింది మగ్ధలేని మరియకేనని బైబిల్ చెప్తోంది.

మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి యేసు పునరుత్థానుడిగా తిరిగి లేచాడని చెప్తుంది. యూదులకు భయపడి శిష్యులు ఒక ఇంట్లో తలుపులు మూసుకుని ఉంటారు. ఆరోజు ఆదివారం సాయంత్రం. అప్పుడు యేసు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కలుగును అని యేసు వారితో చెప్పాడు.

అయితే యేసు పునరుత్దానుడిగా తిరిగి వచ్చిన విషయాన్ని శిష్యులలో ఒక వ్యక్తి మాత్రం నమ్మలేదు. నేను యేసు చేతులలో ఉన్న మేకు గుర్తులు చూసి నా వేలు ఆ గుర్తులో పెట్టి నా చేయి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనని వారితో చెప్పారు. అప్పుడు యేసు ఆ శిష్యుడి వద్దకు వచ్చి నా చేతిలో వేలు పెట్టి చూడము అనగానే శిష్యుడు తన చేసిన తప్పుని ఒప్పుకుని క్షమించమని కన్నీరు పెట్టుకుంటాడు.

నిత్యజీవముతో తనను నమ్మిన వారిని యేసు సమాధులలో ఉన్నప్పటికీ వారిని తిరిగి పునరుత్థానులుగా లేపి తనతోపాటు పరలోకానికి తీసుకుని వెళ్తానని చెప్తాడు. మృతువుని జయించిన యేసు పరలోకానికి వెళ్లి తన తండ్రి కుడి పార్స్వమున కూర్చుని ఉంటాడు.

మనుష్య కుమారుడిగా పుట్టి యేసు మృత్యువుని జయించి సమాధి నుంచి తిరిగి లేచిన రోజు ఆదివారం. అందుకే ఈస్టర్ ని ఆదివారం జరుపుకుంటారు. ఈస్టర్ రోజు ఉదయాన్నే అందరూ సమాధుల దగ్గరకు వెళ్లి క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేస్తారు. తమ వారి సమాధులను కుటుంబ సభ్యులు శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు. పునరుత్థానుడైన యేసు తమ వారిని కూడా క్షమించి తనతో పాటు పరలోకానికి తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తారు.

ఈస్టర్ రోజు ఏం చేస్తారు?

క్రైస్తవులు అందరూ చర్చికి వెళ్ళి తమ పాపాలను క్షమించమని ప్రార్థనలు చేస్తారు. మృత్యువుని జయించిన యేసుని కొనియాడుతూ స్తుతి గీతాలు ఆలపిస్తారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. బంధువలు, స్నేహితులతో కలిసి విందు కార్యక్రమాలలో పాల్గొంటారు.

WhatsApp channel

టాపిక్