చర్మంపై ఉబ్బినట్టు రక్తనాళాలైన సిరలు కనిపిస్తాయి. ఆ సిరల్లోంచి ఎర్రటి రక్తం ప్రవహిస్తున్నా... చర్మం పైనుంచి మాత్రం ఆ సిరలు ఆకుపచ్చ రంగులో లేదా లేత నీలం రంగులో కనిపిస్తూ ఉంటాయి.దాన్ని చూసి ఎంతోమంది రక్తం నీలం రంగులో మారిపోయిందా అని భయపడుతూ ఉంటారు. రక్తం ఎప్పుడైనా ఎరుపు గానే ఉంటుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను మోసుకొల్లే ప్రోటీన్ ఇది. అలాగే ఇనుము అణువులు కూడా ఉంటాయి. ఈ రక్తం ఎరుపు కాంతిని ప్రతిబింబించేలా ఉంటుంది. కాబట్టే రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను బట్టి కూడా ఆ ఎరుపు రంగులో మార్పులు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వెళుతున్నప్పుడు మరింత ప్రకాశవంతమైన చెర్రీ ఎరుపు రంగులో ఉంటుంది. అదే రక్తం శరీరమంతా కణజాలాలకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసి తిరిగి ఊపిరితిత్తులకు చేరేటప్పుడు మాత్రం ముదురు ఎరుపు రంగులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే శరీరంలోని రక్తం కూడా పరిస్థితులను బట్టి అనేక ఎరుపు రంగు షేడ్స్‌ను ప్రదర్శిస్తుంది.
రక్తం ఇలా ఎర్రగా ఉన్నా కూడా చర్మం పైనుంచి చూస్తే... సిరలు నీలం లేదా ఆకుపచ్చ రంగులో కనిపించడానికి కారణాలను వివరిస్తున్నారు వైద్యులు. మనం చూసే రంగులు మన రెటీనా గ్రహించే తరంగదైర్ఘ్యం పై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు.
చర్మం మీద నుంచి చూసినప్పుడు సిరలు ఆకుపచ్చగా లేదా నీలం, ఊదా రంగులో కనిపిస్తాయి. ఎందుకంటే ఆకుపచ్చ, నీలం రంగు కాంతి తరంగధైర్ఘ్యాలు ఎరుపు తరంగధైర్ఘ్యాల కంటే తక్కువగా ఉంటాయి. మానవ కణజాలాల్లోకి కాంతి ప్రసరించినప్పుడు ఎరుపు తరంగధైర్ఘ్యాలను మన చర్మం గ్రహిస్తుంది. కానీ ఆ తరంగధైర్ఘ్యాలను ఆకుపచ్చ, నీలం రంగులో ప్రతిబింబించేలా చేస్తుంది. అంతేతప్ప శరీరంలోని రక్తం రంగు ఎప్పుడూ మారదు. రక్తం రంగు పరిస్థితులను బట్టి ఎరుపులోనే అదే అనేక షేడ్స్ లోకి మారుతుంది... కానీ వేరే రంగులోకి మారే అవకాశం ఉండదు.
సిరల్లో కనిపించే డిఆక్సిజనేటెడ్ రక్తం, ఆక్సిజనేటెడ్ రక్తం కంటే కాస్త ముదురు రంగులో ఉంటుంది. ఈ ముదురు రంగు కూడా చర్మం పైనుంచి చూస్తే రక్తనాళాల్లో నీలం, ఆకుపచ్చ రంగుల్లో కనిపించే భ్రమను కలిగిస్తుంది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)