Burnt food: అన్నం మాడినా తింటున్నారా? మాడిన పదార్థాలు తింటే ఎంత నష్టమో చూడండి
Burnt food: మాడిన అన్నం, బిర్యానీ.. లాంటివి ఇష్టంగా తినే అలవాటుందా? అయితే దీనివల్ల వచ్చే నష్టాల గురించి తెల్సుకోవాల్సిందే. మాడిన ఆహారం తింటే ఏం జరుగుతుందో వివరంగా తెల్సుకోండి.
ఇంట్లో అన్నం మాడినా, కూర మాడినా, పూరీలు, చపాతీలు.. ఏవైనా కాస్త మాడితే ఇష్టంగా తినేవాళ్లు ఒక్కరైనా ఉంటారు. అడుగు అంటిన అన్నం, ఉప్మాలు, పోహా, చివరికి మాడిన బిర్యానీ రుచి కూడా చాలా మందికి నచ్చుతుంది. వాటిని గీక్కుని మరీ ఇష్టంగా తింటారు.
క్యాన్సర్ ప్రభావం:
ఆహారాన్ని ఎవరూ కావాలని మాడగొట్టరు. పని హడావుడి వల్లనో, సమయం లేకనో స్టవ్ మీద పాత్ర పెట్టినట్లు మర్చిపోతే అవి మాడిపోతాయి. దాంతో వంట రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి మాడిన ఆహారానికి, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధం తెల్సుకోడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ ఆహారాలు మాడితే మరింత ప్రమాదం:
ఎక్కువ ఉష్ణోగ్రత మీద వండటం వల్ల ఆహారం మాడిపోతే వాటిలో అక్రిలమైడ్ అనే సమ్మేళనం ఉత్పత్తి అవుతుంది. ఇది అనారోగ్య కారకం. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు బంగాళదుంపలు, కాఫీ, బ్రెడ్, తృణధాన్యాల(బియ్యం, జొన్న, మొక్కజొన్నలు, ఓట్స్..) లాంటి వాటిలో అక్రిలమైడ్ తయారవుతుంది. అక్రిలమైడ్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల జంతువుల్లో క్యాన్సర్‌కు దారితీస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మనుషుల్లో క్యాన్సర్ కలగజేస్తుందనడానికి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాల్లేవు. అలాగని దీనివల్ల ఏ నష్టం జరగదు అనుకోకూడదు. యూఎస్ నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లు అక్రిలమైడ్ అనారోగ్యాన్ని కలగజేసే కారకంగా పరిగణిస్తున్నాయి.
ప్రెగ్నెన్సీలో:
గర్భవతిగా ఉన్నప్పుడు మాడిపోయినవేవీ తినకూడదని పెద్దవాళ్లు చెబుతారు. వాళ్లు దానికి చెప్పే కారణం వేరే ఉన్నా మాడినవి తినడం మాత్రం మంచిది కాదు. అక్రిలమైడ్ పరమాణు బరువు చాలా తక్కువ. ఇది కణజాలాల్లోకి చొచ్చుకుని పోగలదు. దీంతో శిశువుపై ఈ ప్రభావం పడొచ్చు.
ఈ పద్ధతులు:
ఎక్కువ నూనె వండి వంటలు చేస్తే అనారోగ్యకరమని కొన్ని తక్కువ నూనెతో వంట పూర్తయ్యే పద్ధతులు వాడుతున్నారు చాలా మంది. బార్బిక్యూయింగ్, గ్రిల్లింగ్, టోస్టింగ్, రోస్టింగ్, బేకింగ్ లాంటివి అలాంటి పద్ధతులే. వీటికి నూనె తక్కువ అవసరం. కానీ ఈ పద్ధతుల్లో వండిన ఆహారాల్లో అక్రిలమైడ్ తయారు కావచ్చు. అవి తొందరగా మాడిపోవడమే దానికి కారణం.
నష్టాలివే:
- క్యాన్సర్ విషయం మీద స్పష్టమైన ఆధారాలు లేవు. అలాగనీ మాడిన ఆహారం తినడం మంచిదే అనుకోనక్కర్లేదు. దీంట్లో పోషకాలూ తక్కువే ఉంటాయి. తినకూడదు.
- మాడిన ఆహారాల నుంచి హానికరమైన పొగలు వస్తాయి. ఇది శ్వాసకోశ ఇబ్బందులను కలగజేస్తాయి.
- ఎక్కువగా మాడిన ఆహారాల్ని తీసుకోవడం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురవుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు:
ఆహారం మాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పద్ధతిలో వండుతున్నా సరే ముదురు బంగారు వర్ణం లోకి రాగానే వండటం ఆపేయాలి. మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత మీద ఎక్కువ సేపు వండాల్సి వచ్చే ఆహారాలు ముందుగానే ఉడికించి వండితే తొందరగా వంట కూడా పూర్తయిపోతుంది. పోషకాలు కూడా పోవు. తొందరగా ఉడికిపోతాయి కూడా.