Washing Machine Smell: వాషింగ్ మెషిన్ నుంచి చెడు వాసన వస్తోందా? కారణాలు, జాగ్రత్తలు ఇవే!
Washing Machine Smell: వాషింగ్ మెషిన్ నుంచి ఒక్కోసారి వాసన వస్తుంటుంది. ముక్కిపోయినట్టుగా దుర్వాసన వస్తుంది. దీనికి కొన్ని కారణమవుతాయి. అవేంటంటే..
వాషింగ్ మెషిన్‍ను చాలా మంది ప్రతీ రోజూ వినియోగిస్తారు. దుస్తులను సులువుగా ఉతికేందుకు వీలుండటంతో వాషింగ్ మెషిన్లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే, ఒక్కోసారి వాషింగ్ మెషిన్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఎందుకు ఇలా వస్తుందో అర్థం కాదు. వాసన ఇంట్లో చిరాకుగా అనిపిస్తుంది. వాషింగ్ మెషిన్ నుంచి వాసన వచ్చేందుకు కారణాలు ఏవో.. ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
వెంటనే డోర్ వేయడం వల్ల..
దుస్తులు ఉతికిన తర్వాత వాషింగ్ మెషిన్ డ్రమ్‍లో తేమ ఎక్కువగా ఉంటుంది. గాలి తగలకపోతే అది పొడిగా కాదు. దుస్తులు వాష్ చేసిన వెంటనే డోర్ మూయడం వల్ల అందులోని తేమ వల్ల వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దుస్తులు ఉతికాక.. తేమ ఆరే వరకు కాసేపు వాషింగ్ మెషిన్ డోర్లను తెరచి ఉంచాలి.
డిటర్జంట్ మరీ ఎక్కువైతే..
దుస్తులకు సరిపడా కాకుండా డిటర్జంట్ ఎక్కువగా వాషింగ్ మెషిన్లో వేసినా వాసనకు కారణం అవుతుంది. ఎక్కువగా అయిన డిటర్జంట్ డ్రమ్ రంధ్రాలు, ఫిల్టర్లో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది చెడు వాసనను పెంచుతుంది. అందుకే దుస్తులకు సరిపడా డిటర్జంట్ వేసి మాత్రమే వాషింగ్ మెషిన్‍ను వినియోగించాలి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
శుభ్రం చేయకపోతే..
వాషింగ్ మెషిన్ డ్రమ్‍లో కొన్ని రోజులకు మురికి, దుమ్ము, నురగ, నీటిలోని మినరల్స్ పేరుకుపోతాయి. ఇవి కూడా వాసనకు కారణం అవుతాయి. చాలా కాలం వాషింగ్ మెషిన్‍ను క్లీన్ చేయకపోతే వాసన అధికం అవుతుంది. అందుకే వాషింగ్ మెషిన్‍ను కనీసం 30 రోజులకు ఓసారి శుభ్రం చేయాలి. డ్రమ్‍లో వేడి నీటిని నింపి వెనిగర్ వేసి దుస్తులు లేకుండా తిప్పడం వల్ల వాషింగ్ మెషిన్ బాగా క్లీన్ అవుతుంది. చల్లనీటితో అయినా ఇలా చేయాలి. వాషింగ్ మెషిన్ డ్రమ్‍లో మురికి కనిపిస్తే క్లాత్‍తో తుడవొచ్చు. ఫిల్టర్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి.
దుస్తులను ఎక్కువసేపు ఉంచితే..
వాషింగ్ మెషిన్లో ఉతకడం పూర్తయ్యాక దుస్తులను చాలాసేపు అలాగే ఉంచినా వాసనకు కారణం అవుతుంది. తడిగా ఉన్న దుస్తులు డ్రమ్‍లో ఎక్కువసేపు ఉంటే వాసన పడుతుంది. దీనివల్ల దుస్తులు తీసిన తర్వాత కూడా వాషింగ్ మెషిన్‍లో వాసన ఉంటుంది. అందుకే ఉతికిన తర్వాత వెంటనే దుస్తులు తీయాలి.
వాషింగ్ మెషిన్ నుంచి వాసన వస్తుంటే వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగపడతాయి. డ్రమ్‍లోని నీటిలో రెండు చిన్నకప్పుల వెనిగర్ వేసి స్పిన్ చేస్తే వాసన తగ్గుతుంది. నీరు లేకుండా కేవలం వెనిగర్ వేసి తిప్పినా స్మెల్ తగ్గేలా చేయగలదు. నీటిలో వంట సోడా కలిపి డిటర్జెంట్ కంటైనర్‌లో వేసి వాషింగ్ మెషిన్ తిప్పాలి. ఇలా కూడా వాసన తగ్గుతుంది. ఫిల్టర్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి.