సమ్మర్లో సరదాగా స్విమ్మింగ్ క్లాసులకు వెళుతున్నారా? ఈత కొట్టినంతసేపు పర్లేదు. కానీ, క్లాస్ మొదలైన కొన్ని రోజుల తర్వాత మీరు చాలా అలసిపోయినట్లుగా, కళ్ళు నిద్రతో నిండినట్లు అనిపిస్తున్నాయా? ఇలాంటప్పుడే మీలో అపోహలు మొదలవుతాయి. మీకు శరీరంలో ఏదైనా బలహీనత వచ్చిందని అనుమానం కూడా కలగొచ్చు? ఇది నిజమే అయితే, అది బలహీనత కాదని తెలుసుకోండి. దానికి వేరే కారణాలున్నాయి. ఈత కొట్టిన తర్వాత అలసట, నిద్ర రావడం సాధారణ విషయమే. శరీరం ఇలాంటి మార్పులు జరగడానికి కారణమేంటో తెలుసా!
వాస్తవానికి, స్విమ్మింగ్ అనేది ఒక వ్యక్తి కీళ్లపై భారం పడకుండా చేసే వ్యాయామాలలో ఒకటి. ఈత శరీరంలోని కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈత కొట్టిన తర్వాత అలసట, నిద్రగా అనిపించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
స్విమ్మింగ్ అనేది పూర్తి శరీర వ్యాయామం. ఇది చేసేటప్పుడు శరీరంలోని కండరాలు, గుండె, ఊపిరితిత్తులు చురుకుగా పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీని కారణంగా వ్యక్తి అలసిపోయినట్లు అనిపించడంతోపాటు నిద్ర వస్తుంది. కండరాలలో గ్లైకోజెన్ తక్కువగా ఉన్నప్పుడు వ్యక్తి నీరసంగా ఉంటాడని గుర్తుంచుకోండి.
ఈత కొట్టే సమయంలో నీరు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. చల్లటి నీటిలో ఈత కొట్టిన తర్వాత శరీరం వేడెక్కడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల నిద్రను ప్రోత్సహించే హార్మోన్ మెలటోనిన్ విడుదల అవుతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం వేళలో ఈత కొట్టినప్పుడు ఇలా నిద్ర వస్తున్నట్లుగా అనిపించొచ్చు.
ఈత కొట్టే సమయంలో గుండె వేగంగా పనిచేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈత కొట్టిన తర్వాత గుండె వేగం తగ్గుతుంది. ఇది శరీరాన్ని రిలాక్స్ మోడ్‌లోకి తీసుకువెళుతుంది. ఈ రిలాక్సేషన్ మెదడులోని పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్‌ను కంట్రల్లోకి తీసుకొస్తుంది. దీనివల్ల నిద్రపోవాలనే కోరిక పెరుగుతుంది.
ఈతలో శ్వాస తీసుకునే పద్ధతి చాలా ముఖ్యం. నీటిలో శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది. ఆక్సిజన్ కొరత లేదా సక్రమంగా శ్వాస తీసుకోకపోవడం వల్ల మెదడు, కండరాలు అలసిపోవచ్చు. దీనివల్ల నిద్రగా అనిపిస్తుంది.
ఈత కొట్టే సమయంలో చెమట వస్తుంది. అది నీటిలో కనిపించకపోయినా. దీనివల్ల డీహైడ్రేషన్ లేదా ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం వంటి లోపానికి దారి తీస్తుంది. డీహైడ్రేషన్ అలసట, నీరసానికి కారణమవుతుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది.
ఈత కొట్టే సమయంలో నీటిలో ఉండటం వల్ల వ్యక్తి ఒత్తిడిని తక్కువగా అనుభవిస్తాడు. దీనివల్ల అతని మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు రిలాక్స్ అవ్వడం, టెన్షన్ ఫ్రీ అవ్వడంతో వ్యక్తికి నిద్ర వస్తుంది.
స్విమ్మింగ్ పూల్ నీటిలో ఉండే క్లోరిన్, ఇతర రసాయనాలు చర్మంతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావితం చూపించవచ్చు. దీనివల్ల కొంతమందికి క్లోరిన్ వాసన వల్ల అలసట, నిద్రగా అనిపించవచ్చు.
ఈతకు ముందు, తర్వాత తగినంత నీరు త్రాగాలి. ఎలక్ట్రోలైట్స్ అంటే కొబ్బరి నీరు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి.
ఈత కొట్టిన తర్వాత పండ్లు, గింజలు వంటి తేలికపాటి స్నాక్స్ తినండి. తద్వారా శరీరంలో శక్తి స్థాయి అలాగే ఉంటుంది.
చల్లటి నీటిలో ఎక్కువసేపు ఉండకండి. ఈత కొట్టిన తర్వాత వేడి నీటి స్నానం చేయండి.