అండాశయ క్యాన్సర్ విషయంలో మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో అండాశయ క్యాన్సర్ ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. అండాశయ క్యాన్సర్ ప్రపంచంలో మహిళలకు వస్తున్న ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్.
ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 324,000 మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అంచనా. వీరిలో 2,07,000 మంది చనిపోతున్నారు. అందువల్ల, అండాశయ క్యాన్సర్ తో సంబంధం ఉన్న లక్షణాలు, చికిత్స గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడగలదు. కొన్ని లక్షణాలు శరీరంలో తరచూ కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలి. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.
ఈ క్యాన్సర్ సోకినవారిలో కొన్ని రకాల లక్షణాలు అధికంగా ఉంటాయి. నిరంతరం పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. దాన్ని తేలికగా తీసుకోకండి. కొంచెం తిన్న తర్వాతే కడుపు నిండుగా, బిగుతుగా అనిపించడం, పొట్ట పెద్దదిగా కనిపించడం వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాలే.
గర్భాశయం చుట్టూ అంటే పొత్తికడుపులో అసౌకర్యం, నొప్పి లేదా సున్నితంగా అనిపిస్తున్నా తేలికగా తీసుకోకండి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. నిరంతరం ఇలా పొత్తికడుపు దగ్గర నొప్పిగా అనిపిస్తుంటే అది అండాశయ క్యాన్సర్ కు కారణం కావచ్చు.
కొంచెం ఆహారం తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపించినా, తినడానికి ఇబ్బంది ఉన్నా కూడా అది అండాశయ క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి.
తరచూ మూత్ర విసర్జన చేస్తున్నా, మూత్రంలో రంగు లేదా ఏదైనా మార్పు కనిపించినా కూడా అనుమానించాలి. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డయాబెటిస్ లక్షణాలుగా ఎంతో మంది భావిస్తారు. కానీ ఇది అండాశయ క్యాన్సర్ లక్షణం కూడా. మూత్రాశయ గోడల వెలుపల క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు, మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కూడా మూత్రవిసర్జనకు కారణం అవుతాయి.
అలిసిపోవడం, బలహీనంగా అనిపించడం కూడా అండాశయ క్యాన్సర్ లక్షణాలే. క్యాన్సర్ కణాలు హార్మోన్ల స్థాయిలు, ప్రోటీన్లను మారుస్తాయి. దీని వల్ల శరీరంలో వాపు మొదలై భరించలేని నొప్పి పెరుగుతుంది.
వెన్నునొప్పి బాగా వస్తున్నా… ఆ నొప్పి నిద్ర, ప్రశాంతతను హరిస్తుంటే జాగ్రత్తగా ఉండండి. కటి చుట్టూ ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు దిగువ వీపున ఉన్న కణజాలాలలో నొప్పి పెరుగుతుంది. కాబట్టి భరించలేని వెన్నునొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి.
మెనోపాజ్ తర్వాత యోని నుండి రక్తస్రావం సాధారణమైనదిగా భావించకూడదు. ఇది కూడా అండాశయ క్యాన్సర్ లక్షణాలే.
అండాశయ క్యాన్సర్ రావడానికి కారణాలు గురించి వైద్యులు వివరిస్తున్నారు. కుటుంబాలలో అండాశయం క్యాన్సర్, రొమ్ము లేదా కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్న చరిత్ర ఉంటే ఆ మహిళలకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశంపెరుగుతుంది. అండాశయ క్యాన్సర్ ప్రమాదం వయస్సుతో పెరుగుతుంది. ముఖ్యంగా పెరిమెనోపాజ్ లేదా పోస్ట్ మెనోపాజ్ తరువాత వచ్చే అవకాశం ఉంది.
గర్భం ధరించని స్త్రీలలో కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనికి కారణం నిరంతర అండోత్సర్గము కారణంగా, కొన్ని ఫలదీకరణం చెందని గుడ్లు గర్భాశయంలో ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. సంతానోత్పత్తి చికిత్స సమయంలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం హార్మోన్ల రుగ్మతలకు కారణమవుతుంది. ఇది అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
టాపిక్