బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. వాటిలో జుట్టు రాలడం కూడా భాగమే. దీన్ని నిపుణులు ప్రసవానంతరం జుట్టు రాలడం అని పిలుస్తారు. సుమారు 40 నుండి 50 శాతం మంది మహిళలు ఈ సమస్యను అనుభవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రసవం తరువాత మూడు నుంచి ఐదు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. దీని వెనుక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహార లోపం వంటి అనేక కారణాలు ఉన్నాయి. కాలక్రమేణా ఈ సమస్య నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ పూనమ్ జైన్ ప్రకారం, గర్భధారణ సమయంలో చాలా మంది మహిళల జుట్టు చాలా ఆరోగ్యంగా మారుతుంది. దీనికి కారణం ప్రొజెస్టెరాన్ హార్మోన్. దీనిని జుట్టుకు అనుకూలమైన హార్మోన్ అంటారు. గర్భధారణ సమయంలో ఇది అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలదు కూడా. అయితే ప్రసవించిన మూడు నెలల తర్వాత ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్లే వెంట్రుకలు వేగంగా రాలిపోతాయి.
గర్భధారణ సమయంలో ఒత్తుగా, మందంగా పెరిగిన జుట్టు… ప్రసవం తరువాత రాలడం ప్రారంభమవుతుంది. డెలివరీ తర్వాత జుట్టు రాలడం వెనుక ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి, ఆందోళన చెందకుండా, జుట్టు సంరక్షణకు కొంత సమయం కేటాయించండి.
చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అమిత్ బంగియా వివరిస్తూ "మీ జుట్టు రోజుకు ఎంత రాలిపోతుందో గమనించండి. రోజుకు వంద వెంట్రుకలు కోల్పోతున్నారంటే, మీకు జుట్టు సమస్యలు ఉన్నాయని అర్థం’ అని చెబుతున్నారు.
జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం కావచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఒత్తిడికి గురికావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల తల్లి ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ విడుదల ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం, ధ్యానం వంటి చిట్కాలను ప్రయత్నించడం ద్వారా ఒత్తిడిని మీ నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి.
ప్రసవం తర్వాత జుట్టు రాలే సమస్య కొంతవరకు జరుగుతుంది. తరువాత కొంత కాలానికి మళ్లీ పెరగడం మొదలవుతుంది. ప్రసవం తరువాత ఏడాది వరకు జుట్టు రాలే సమస్య కనిపించి… తరువాత పెరగడం మొదలు కావచ్చు. ఏడాది తర్వాత కూడా సమస్య కొనసాగితే కచ్చితంగా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. బట్టతల, చర్మం, గోళ్లలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సంప్రదింపులు కూడా అవసరం కావచ్చు.
జుట్టు విపరీతంగా రాలిపోతున్నాప్పుడు మీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఇనుము, బీటా కెరోటిన్ వంటి పోషకాలను ఉంచండి. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ రాత్రిపూట ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోకూడదు. ఒక క్యాల్షియం నిండిన ఆహారాలను ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్న తర్వాత కొంతకాలం టీ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
పంచదార, బియ్యం, బంగాళాదుంపలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆహారంలో కొవ్వు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. నీరు, ఇతర ద్రవాలు పుష్కలంగా త్రాగాలి.
మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, సోయా ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల నుంచి మనకు లభించే ప్రోటీన్ మన జుట్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్లు, గింజలు, అరటిపండ్లు, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు మొదలైన వాటి నుండి వచ్చే బయోటిన్ మన జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అదే సమయంలో, విటమిన్సి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, అలాగే ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది, అలాగే ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. విటమిన్-డి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు రక్త సరఫరా, జుట్టు పెరుగుదలకు ఇనుము సహాయపడుతుంది.
కొబ్బరి, బాదం, భృంగరాజ్ వంటి నూనెలతో ఎప్పటికప్పుడు జుట్టుకు మసాజ్ చేయాలి. ఇది జుట్టు మూలాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. మైల్డ్ షాంపూ, కండీషనర్ వాడాలి. టైట్ హెయిర్ స్టైల్స్ చేయడం మానుకోండి.