Dogs Crying । కుక్కలు ఎందుకు ఏడుస్తాయి..ఇది ఎవరి మరణానికైనా సంకేతమా..?!-why do dogs cry is dog s howl an indication of someone s death ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Do Dogs Cry, Is Dog's Howl An Indication Of Someone's Death

Dogs Crying । కుక్కలు ఎందుకు ఏడుస్తాయి..ఇది ఎవరి మరణానికైనా సంకేతమా..?!

Manda Vikas HT Telugu
Jul 27, 2022 06:45 PM IST

వీధిలో అంతటా నిశబ్దం ఆవహించినపుడు కుక్కలు ఏడ్వటం మొదలు పెడితే అపశకునంగా భావిస్తారు. అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? ఎవరైనా చనిపోయే ముందు కుక్కలు ఏడుస్తాయనటం నిజమేనా? ఈ స్టోరీ చదవండి.

Why do dogs cry. here are some reasons
Why do dogs cry. here are some reasons (Unsplash)

రాత్రివేళ చిమ్మచీకటిలో కొండకోనల వద్ద దూరంగా ఏదైనా అరుపు వినిపిస్తే అది నక్క అరుపు కావొచ్చు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు భయం పుట్టిస్తాయి. అయితే ఎక్కడో దూరంగా కాకుండా మన వీధిలోనే రాత్రివేళ కుక్క ఏడుపు అంతకంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. వీధి కుక్కలు అన్నీ ఒక్కచోట చేరి శోకం పెట్టి ఏడిస్తే గుండె దడ మొదలవుతుంది. అటుగా ఎవరైనా వెళ్లేవారు వాటిని చెదరగొడతారు కూడా. ఎందుకంటే కుక్కలు ఏడుస్తున్నాయి అంటే ఆ వీధిలో ఎవరో ఒకరు చనిపోతారు, ఇది దానికి సంకేతమే అని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అయితే ఇలాంటి నమ్మకం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక సంస్కృతులు కుక్క అరుపు మరణానికి శకునమని నమ్ముతున్నాయి. అమెరికా లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ ఉన్నదేశంలోనూ ఈ నమ్మకం ఉంది. U.S.లో రెండు కుక్కలు కలిసి ఏడిస్తే ఒక ఎవరైనా ఒక వ్యక్తి మనిషి త్వరలో చనిపోబోతున్నారని నమ్ముతారు. అదే సందర్భంలో మూడు కుక్కలు కలిసి ఏడిస్తే ఆ చనిపోయే వారు ఒక స్త్రీ అని కొందరు నమ్ముతారు.

మరి ఇది నిజమేనా? అంటే సైన్స్ దీనిని ఒక మూఢనమ్మకం అని కొట్టిపాడేస్తుంది. కుక్కలు ఏడవటానికి కారణాలు సైన్స్ జాబితా చేసింది. కుక్క అరుపు జన్యుశాస్త్రానికి సంబంధించిన అంశం అని పరిశోధకులు చెబుతున్నారు. పురాతన కుక్క జాతులు వాటి DNA తోడేళ్ళ , నక్క జాతులను పోలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రకారంగా వీధి కుక్కలు అరవటం అనేది వాటి DNA లోనే ఉందని చెబుతున్నారు. అలా అరవటానికి కూడా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..

సమావేశం నిర్వహించటం కోసం

వేటకుక్కలు లేదా నక్కలు వేట ముగిసిన తర్వాత రాత్రి వేళ తిరిగి సమావేశం అవుతాయి. రాత్రి చీకటిగా ఉంటుంది, ఏమి కనిపించదు. కాబట్టి వాటి స్థావరాన్ని తమ సహచరులకు తెలిపేందుకు అవి ఒకరమైన శబ్దం చేస్తాయి. మన సమాజంలో మనతో పాటుగా జీవించే కుక్కలు కూడా ఇందుకోసమే శబ్దం చేస్తాయి.

సరిహద్దుల విభజన, రక్షణ యంత్రాంగం

మీరు ఎప్పుడైనా గమనిస్తే కుక్కల గుంపులోకి ఏదైనా కొత్త కుక్క వస్తే అన్నీ కలిసి ఆ కొత్త కుక్కపై దాడి చేస్తాయి. దీంతో ఆ కొత్త కుక్క తోక ముడుచుకొని పారిపోతుంది. దీని అర్థం కొన్ని కుక్కలు కలిసి తమకంటూ ఒక ప్రాంతాన్ని ఏర్పరుచుకుంటాయి. కొంత పరిధిని కలిగి ఉంటాయి. వాటి ఉనికి చాటేందుకు అవి రాత్రివేళ ఒక రకమైన శబ్ధం చేసి మిగతా కుక్కలకు తెలియపరుస్తాయి. ఆ భూభాగం తమకే చెందినది అని సిగ్నల్స్ పంపుతాయి. ఇందుకోసం మరో రకమైన అరుపు చేస్తాయి.

భావోద్వేగాల వ్యక్తీకరణకు

ఇక అప్పుడప్పుడు శోకం పెట్టి ఏడుస్తూ ఉంటాయి. మనుషుల్లాగే కుక్కలు కూడా ఎమోషనల్ జీవులు. వాటికి బాధ, కోపం, ఆవేదన, ఆందోళన లాంటివి ఉంటాయి. బయట చలిచలిగా ఉంటుంది లేదా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో వాతవరణ పరిస్థితులను తట్టుకోలేనపుడు బాధను వ్యక్తపరుస్తూ అరుస్తాయి. గాయం అయినపుడు నొప్పిని భరించలేక ఏడుస్తాయి. అదే సమయంలో గుంపులో మిగతా కుక్కలకు జోడి ఉండి తనకు లేనపుడు. తన ప్రేయసి వేరే కుక్కతో వెళ్లిపోయినపుడు, లేదా చనిపోయినపుడు ఆ బాధను భరించలేక ఆ విరహ వేదనను తట్టుకోలేక ఇదేమి కుక్కకు బతుకురా అన్నట్లుగా ఏడుపు అందుకుంటాయి. ఇదీ సంగతి!

అయితే కుక్క ఏడుపులన్నీ చావు సంకేతాలు కాదు, ఇక అదే సమయంలో ఎవరైనా చనిపోతే అది యాదృచ్ఛికం అంటున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం