ఆపరేషన్లు చేసే సమయంలో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు మాత్రమే ఎందుకు ధరిస్తారు? కారణం ఏమిటి?-why do doctors wear only green and blue clothes during operations what is the reason ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఆపరేషన్లు చేసే సమయంలో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు మాత్రమే ఎందుకు ధరిస్తారు? కారణం ఏమిటి?

ఆపరేషన్లు చేసే సమయంలో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు మాత్రమే ఎందుకు ధరిస్తారు? కారణం ఏమిటి?

Haritha Chappa HT Telugu
Published Feb 06, 2025 02:00 PM IST

వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరించి కనిపిస్తారు. వైద్యులు ఆకుపచ్చ, నీలం దుస్తులు ధరించి ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళడం మీరు తరచుగా చూశారు. దీనికి కారణం ఏంటో తెలుసా?

ఆపరేషన్ థియేటర్లో నీలం, ఆకుపచ్చ రంగు దుస్తులే వైద్యులు ఎందుకు ధరిస్తారు?
ఆపరేషన్ థియేటర్లో నీలం, ఆకుపచ్చ రంగు దుస్తులే వైద్యులు ఎందుకు ధరిస్తారు? (Pixabay)

ఆసుపత్రికి ఏదో ఒక సమయంలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రతి సమస్యకు వైద్యుల సహాయం అవసరం. అందుకే ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు. అయితే ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆపరేషన్ థియేటర్ కు వెళ్లినప్పుడు డాక్టర్లంతా నీలం, ఆకుపచ్చ రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. అలా ఆ రెండు రంగులే ఎందుకు ధరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోండి.

ఆకుపచ్చ, నీలం రంగే ఎందుకు?

ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగు యూనిఫామ్ వేసుకుని కనిపిస్తారు. దానికి సరైన కారణం ఉంది. ఆపరేషన్ థియేటర్ చీకటిగా ఉంటుంది.వెలుగు నుండి చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు ఆకుపచ్చ లేదా నీలం రంగులు మంచి అనుభూతిని ఇస్తాయి. అందుకే ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఈ రెండు రంగులే ధరిస్తారు.

ఆకుపచ్చ, నీలం కాంతి వర్ణపటంలో ఎరుపు రంగుకు వ్యతిరేక రంగులుగా చెప్పుకుంటారు. శస్త్రచికిత్స సమయంలో, సర్జన్ ఈ దుస్తులు వేసుకోవడం వల్ల అతని మొత్తం దృష్టి మానవ శరీరంలోని రక్తం ఎరుపు రంగుపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆకుపచ్చ, నీలం రంగు సర్జన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కాకుండా ఆపరేషన్ థియేటర్లో వెలుగులో రక్తపు మచ్చలు గోధుమ రంగులో కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు యూనిఫామ్ వేసుకున్నప్పుడు గోధుమ రంగు రక్తం క్లియర్ గా కనిపిస్తుంది. 1998కు చెందిన ఒక నివేదిక ప్రకారం, ఆకుపచ్చ వస్త్రం శస్త్రచికిత్స సమయంలో కళ్ళకు సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించే పద్ధతిని మొదట 1914లో ప్రారంభించారు. అంతకు ముందు వైద్యులు తెల్లని దుస్తులు ధరించి శస్త్రచికిత్సలు చేసేవారు. అయితే 1914లో ఓ ప్రముఖ వైద్యుడు ఆపరేషన్ థియేటర్ లో శస్త్రచికిత్స చేసి తెలుపుకు బదులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడంతో ఈ డ్రెస్ కోడ్ ట్రెండ్ గా మారింది. ఆ తర్వాత శస్త్రచికిత్స సమయంలో డాక్టర్ ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులు ధరించడం ప్రారంభించారు.

సూర్యుడు లేదా ఏదైనా మెరిసే వస్తువును చూస్తే కళ్లు మెరిసిపోతాయి. కానీ ఆ వెంటనే ఆకుపచ్చ లేదా నీలం రంగు కనిపిస్తే కళ్లకు ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయ దృక్పథంలో, ఆకుపచ్చ లేదా నీలం రంగులు… ఎరుపు, పసుపు రంగులను చూడగానే కళ్లకు ఇబ్బందిగా అనిపించేలా చేయవు. ఆకుపచ్చ, నీలం రంగులు కళ్లకు మేలు చేస్తాయి. అందుకే ఆసుపత్రుల్లో కర్టెన్ల నుంచి ఉద్యోగుల దుస్తులు, మాస్క్ ల వరకు ఆకుపచ్చ, నీలం రంగులు అధికంగా ఉంటాయి. దీని వల్ల అక్కడ ఉండే రోగుల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.

మానవ శరీరంలోని రక్తం, అంతర్గత అవయవాలను నిరంతరం చూడటం ద్వారా వైద్యులు చాలాసార్లు ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో, ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ రంగులు మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతాయి. తద్వారా వైద్యుడు తన పనిపై పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాడు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం