ప్రపంచంలోనే అతి ఖరీదైన శునకాన్ని బెంగళూరుకు చెందిన వ్యక్తి కొన్నారు. ఈ వార్త వైరల్ గా మారింది. ఒక శునకం కోసమే అన్ని కోట్లు ఖర్చుపెట్టారంటే ఆ కొన్న వ్యక్తి ఎంత ఆస్తిపరుడో అనుకుంటారు. అతడిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. అలా బెంగళూరుకు చెందిన ఓ కుక్క ప్రేమికుడు సతీష్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఈ కుక్కను చూసేందుకు సతీష్ ఇంటి చుట్టూ జనాలు చేరిపోతున్నారు.
బెంగళూరుకు చెందిన ఎస్.సతీష్ కడబాంబ్ ఓకామి అనే జాతికి చెందిన శునకాన్ని కొనుగోలు చేశారు. ఇది చూసేందుకు తోడేలులా కనిపిస్తుంది. ఈ కుక్కను అడవి తోడేలు, కాకేసియన్ షెప్పర్డ్ జాతి కుక్కల సంకరణతో జన్మించిది. అంటే ఇది తోడేలు, కుక్కకు కలిపి జన్మించినదన్న మాట. అందుకే ఇది తోడేలులా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తోడేలు కుక్కగా చెప్పుకుంటారు.
51 ఏళ్ల సతీష్ ఫిబ్రవరిలో ఓ బ్రోకర్ ద్వారా ఈ శునకాన్ని కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కుక్కగా చెప్పే ఈ ఓకామికి ఇప్పుడు కేవలం ఎనిమిది నెలల వయస్సు. దీని బరువు 75 కిలోలు, 30 అంగుళాల ఎత్తు ఉంది.
తన ఇంటికి వచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క ఓకామి గురించి సతీష్ మాట్లాడుతూ .. ‘ఇది తోడేలులా కనిపించే చాలా అరుదైన కుక్క జాతి. ఈ జాతి ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు. ఈ కుక్కను అమెరికాలో పెంచారు. నాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ అరుదైన కుక్కను భారత్ కు పరిచయం చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ కుక్కను కొనడానికి నేను రూ.50 కోట్లు ఖర్చు చేశాను’ అని చెప్పారు.
బలం, మందపాటి బొచ్చుకు ప్రసిద్ధి చెందిన కాకేసియన్ షెప్పర్డ్ శునకాలను గొర్రెల కాపరులు జార్జియా, రష్యా వంటి శీతల ప్రాంతాల్లో పెంచుతారు. వీటిని సాధారణంగా గొర్రెలను రక్షించడానికి కాపలాగా ఉంచుతారు.
సతీష్ బెంగళూరుకు చెందిన డాగ్ బ్రీడర్. పలు డాగ్ బ్రీడింగ్ అసోసియేషన్స్ కు నేతృత్వం వహిస్తున్నాడు. సతీష్ చాలా ఏళ్ల క్రితమే కుక్కల పెంపకాన్ని మానేసినప్పటికీ అరుదైన కుక్కను మాత్రం కొన్నారు. దీనితో ఆయన పలు షోలలో పాల్గొంటూ ఉంటారు. ఈ కుక్క ద్వారా ఆయన ఎంతో సంపాదిస్తున్నాడు. సతీష్ ఈ శునకంతో ఏ కార్యక్రమంలో అయినా పాల్గొనాలంటే అరగంటకు రెండున్నర లక్షల రూపాయలు తీసుకుంటారు. ఈ శునకం రోజూ మూడు కిలోల పచ్చి చికెన్ తింటుంది.
ఈ కుక్కలు చాలా అరుదుగా ఉంటాయి… అందుకు తాను తన దగ్గర ఉన్న డబ్బున్నంతా ఖర్చుపెట్టి కొన్నానని సతీష్ చెప్పారు. ఇలాంటి శునకాలను ప్రజలు వాటిని చూడటానికి ఆసక్తి చూపుతారు. ప్రజలు ఇలా కుక్కతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. సినిమా హీరోల కంటే ఎక్కువ మంది ఈ కుక్క వైపు ఆకర్షితులవుతారు. తాము ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతామని అని సతీష్ చెప్పారు.
సతీష్ కు ఒక చౌ చౌ డాగ్ కూడా ఉంది. అది ఎర్ర పాండాను పోలి ఉంటుంది. ఆయన దగ్గర 150కి పైగా శునకాలు ఉన్నాయి. అతను ఈ కుక్కలను పెంచుకునేందుకు ఏడు ఎకరాల భూమిని కేటాయించారు. విశాలమైన డాగ్ హౌస్ ఉంది. పెంపుడు జంతువులను రక్షించడానికి అవి ఉండే ఇంటి చుట్టూ 10 అడుగుల ఎత్తైన గోడ, 24/7 సిసిటివి కెమెరాలు ఉన్నాయి.
సంబంధిత కథనం