Kohinoor Diamond : నిజానికి కోహినూర్ వజ్రం అసలైన ఓనర్లు ఎవరు? తెలుగు రాష్ట్రాలకు చెందినదేనా?
Kohinoor Diamond History : కోహినూర్ వజ్రం ఎవరిది అనే ప్రశ్న చాలా కాలంగా వేధిస్తోంది. బ్రిటీష్ కాలంలో భారత్ నుంచి తీసుకెళ్లిన కోహినూర్ వజ్రం తిరిగి రాలేదు. కానీ నిజానికి ఇది మన తెలుగు రాష్ట్రాలకు చెందినదిగా చరిత్ర చెబుతుంది.

కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడూ వివాదాలు ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం ఇది. అంతేకాదు దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. సాధారణ జనాలు కూడా ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో కోహినూర్ వజ్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతటి గొప్ప చరిత్ర ఈ వజ్రానిది. అయితే ఈ వజ్రానికి అసలైన ఓనర్లు ఎవరు? ఈ వజ్రం ఎక్కడ నుంచి వచ్చింది?
కోహినూర్ వజ్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 105.6 క్యారెట్ల బరువుతో, అద్భుతమైన కోహినూర్ వజ్రం ఎప్పటి నుంచో పరాక్రమం, విజయం, ప్రతిష్ట, శక్తికి చిహ్నంగా కనిపిస్తుంది. ఈ వజ్రం ఉన్న పాలకులు ఆధిపత్యం చెలాయించేవారని ఓ నమ్మకం కూడా ఉంది. దీంతో ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజుల మధ్య పోటీ కూడా నెలకొంది. అయితే కొందరికి కలిసి రాలేదని కూడా చెబుతుంటారు. కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటిష్ వారి దగ్గర ఉంది.
కానీ నిజానికి ఈ కోహినూర్ వజ్రం పుట్టుక మన తెలుగు రాష్ట్రాల్లోనే మెుదలైంది. మన రాజుల దగ్గర నుంచి ఇది ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లింది. చివరకు బ్రిటన్ చేరుకుంది. వాస్తవానికి కోహినూర్ వజ్రం కాకతీయ సామ్రాజ్యానికి చెందినది. కాకతీయ రాజవంశం ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను పరిపాలించింది. ఆ కాలంలో కాకతీయ రాజవంశం అత్యంత శక్తివంతమైన రాజవంశం. వీరు కోహినూర్ వజ్రానికి యజమానులుగా ఉండేవారు. కాకతీయ రాజవంశం వారి శక్తి, ప్రతిష్టకు చిహ్నంగా కోహినూర్ వజ్రాన్ని ఉపయోగించారు.
కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గని నుండి తవ్వబడింది. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఇది 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజులకు చెందినది. కాకతీయుల ఆధీనంలో ఉన్న ఈ వజ్రాన్ని తుగ్లక్ రాజవంశం, తరువాత లోధీ రాజవంశానికి వెళ్లింది. 1526లో లోధి రాజవంశాన్ని ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు, కోహినూర్ అతని చేతిలోకి వచ్చింది. తర్వాతి తర్వాతి కాలంలో ఆగ్రాలో తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్, తన నెమలి సింహాసనంపై కోహినూర్ వజ్రాన్ని అలంకరించాడని చెబుతారు. తర్వాతి కాలంలో ఔరంగజేబు దానిని తన లాహోర్‌కు తీసుకువచ్చి ఉంచాడు.
1849లో బ్రిటిష్ వారు పంజాబ్‌పై దండెత్తినప్పుడు కోహినూర్ వారి దృష్టిలో పడింది. తర్వాత వారు తీసుకెళ్లారు. 1851లో ఇది బ్రిటన్ రాణి విక్టోరియా ఆస్తిగా మారింది. అప్పుడు కోహినూర్ 186 క్యారెట్లు. తర్వాత కాస్త దీనికి కత్తిరించారని చెబుతారు. క్వీన్ ఎలిజబెత్ II తల్లి ఎలిజబెత్ ఏంజెలా, 1937లో కింగ్ జార్జ్ IV పట్టాభిషేకం సందర్భంగా తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని ధరించారు. క్వీన్ విక్టోరియా, అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ ఇప్పటివరకు ఈ వజ్రాన్ని ధరించారు.
మెుత్తానికి కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ఈ విలువైన డైమండ్ బ్రిటిష్ వారి దగ్గర ఉంది. దీనికి అసలైన యజమానులు కాకతీయ రాజులైన గణపతిదేవుడు, ఆయన కుమార్తె రుద్రమదేవి. ఎంతో మంది రాజుల చేతులు మారి చివరకు.. బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లింది కోహినూర్.