White Hair: మీ జుట్టు తెల్లబడుతోందా? ఇదే ముఖ్యమైన కారణం అయిండొచ్చు.. జాగ్రత్త పడండి!
White Hair - Nutrients Deficiency: తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడేందుకు పోషకాల లోపం కూడా ప్రధాన కారణంగా ఉంటుంది. కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు సరిగా లేక జుట్టుకు ముప్పు వాటిల్లుతోంది. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
జుట్టు తెల్లబడుతుండడం ఇప్పుడు చాలా మందికి సమస్యగా మారింది. 40 ఏళ్లు నిండక ముందే చాలా మందికి తెల్ల జుట్టు వచ్చేస్తోంది. కొందరికి టీనేజ్ నుంచే ఈ సమస్య ఎదురవుతోంది. వెంట్రుకల రంగు నెరిసిపోవడం, తెల్లగా మారడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఈ విషయంలో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే, జుట్టు తెల్లగా మారేందుకు పోషకాల లోపం ముఖ్యమైన కారణంగా ఉంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకొని జాగ్రత్త పడండి.
విటమిన్ డీ లోపం
శరీరంలో విటమిన్ డీ లోపం ఉండడం వల్ల జుట్టు తెల్లబడడం, నెరిసిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. జుట్టు కుదుళ్లను ఉత్తేజ పరిచడంలో విటమిన్ డీ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే శరీరంలో ఇది తక్కువైతే వెంట్రుకల రంగు మారడం, పలుచబడడం జరుగుతుంది. విటమిన్ డీ లోపం ఉన్న వారిలో తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడే అవకాశాలు అధికం అని కొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈ సమస్య ఉంటే విటమిన్ డీ పుష్కలంగా ఉండే గుడ్లు, చేపలు, ఫోర్టిఫైడ్ పాలు లాంటివి తీసుకోవాలి.
ప్రోటీన్
జుట్టుకు ప్రోటీన్ చాలా కీలకంగా ఉంటుంది. వెంట్రుకల జీవక్రియ బాగుండాలంటే శరీరంలో ప్రోటీన్ మెండుగా ఉండాలి. అందుకే శరీరంలో ప్రోటీన్ లోపం కూడా జుట్టు తెల్లబడేందుకు ఓ ప్రధానమైన కారణంగా ఉంటుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా దక్కే ఆహారాలు తీసుకోవాలి. కోడిగుడ్లు, పప్పు ధాన్యాలు, క్వినోవా, ఫ్యాటీ ఫిష్ లాంటివి రెగ్యులర్‌గా తినాలి.
ఐరన్
శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల కూడా జుట్టు రంగు మారుతుంది. అందుకే వెంట్రుకల ఆరోగ్యానికి ఐరన్ కూడా చాలా ముఖ్యం. కాపర్ లోపం ఉన్నా జుట్టుపై చెడు ప్రభావం ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, షెల్‍ఫిష్, గుడ్లతో ఐరన్, కాపర్ ఎక్కువగా ఉంటాయి.
బీ కాంప్లెక్స్ విటమిన్లు
విటమిన్ బీ12, బీ6, బయోటిన్ లాంటి బీ కాంప్లెక్స్ విటమిన్ల లోపం ఉన్నా జుట్టు తెల్లబడే రిస్క్ ఉంటుంది. వీటిల్లో ఏది తగ్గినా జుట్టుపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే ఈ బీ కాంప్లెక్స్ విటమిన్ల లోపం ఉంటే గుడ్లు, లివర్, మాంసం, నట్స్, కూరగాయాలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
జుట్టు, స్కాల్ప్ పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీలకంగా ఉంటాయి. అయితే, వీటిని శరీరం ఉత్పత్తి చేయదు. ఆహారం ద్వారా మనం తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటే జుట్టు పెరుగుదల, మెరుపు బాగా ఉంటాయి. ఈ లోపం ఉంటే జుట్టు తెల్లబడేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. నట్స్, సీడ్స్, సోయా బీన్స్, ఫ్యాటీ ఫిష్‍లు లాంటి వాటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.