Summer Umbrella : వేసవిలో ఏ రంగు గొడుగు ఉపయోగిస్తే వేడి ఎక్కువగా ఉండదు-which colour umbrella is best to use in summer dont use black colour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Umbrella : వేసవిలో ఏ రంగు గొడుగు ఉపయోగిస్తే వేడి ఎక్కువగా ఉండదు

Summer Umbrella : వేసవిలో ఏ రంగు గొడుగు ఉపయోగిస్తే వేడి ఎక్కువగా ఉండదు

Anand Sai HT Telugu
May 10, 2024 02:00 PM IST

Summer Umbrella : వేసవి వేడి చంపేస్తోంది. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇలాంటి సమయంలో గొడుగులు కాస్త ఉపశమనం అనిపిస్తాయి. అయితే మనం వాడే గొడుకు రంగు ఆధారంగా ఎండ మనకు ఇబ్బంది కలిగిస్తుంది.

వేసవిలో ఏ రంగు గొడుగు వాడకూడదు
వేసవిలో ఏ రంగు గొడుగు వాడకూడదు

కొన్ని రోజుల నుంచి ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. బయటకు వెళితే చొక్కా తడవకుండా వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చొన్నా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలు తీసి బయటపెట్టాలంటే.. సూరీడు ఎండ వేడితో చంపేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. దుకాణం వరకో.. లేదా వేరే పని మీదనో బయట తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో మీరు గొడుగులు వాడాలి. కానీ ఎలాంటి గొడుగు వాడలో కచ్చితంగా తెలిసి ఉండాలి. మీరు వాడే గొడుగు రంగు కూడా మీకు ఎండ ఎక్కువగా తాగిలేలా చేస్తుంది.

అసలే ఇప్పుడు వేసవి తాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండ నుంచి రక్షించుకోవడానికి గొడుగులు వాడడం కనిపిస్తూ ఉంటుంది. నల్ల గొడుగును ప్రజలు ఎక్కువగా వాడటం కూడా గమనించవచ్చు. కానీ ఎండాకాలంలో నల్ల గొడుగు వాడటం మంచిదా కాదా? కచ్చితంగా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

నలుపు రంగు గొడుగుతో ఇబ్బందే

వేసవిలో నల్ల గొడుగును ఉపయోగించడం వల్ల సూర్యుని ప్రత్యక్ష వేడిని పాక్షికంగా మాత్రమే నిరోధించవచ్చు. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల పరోక్షంగా శరీరానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? నలుపు రంగుపై ఏ రంగు కాంతి కిరణాలు పడినా వాటిని గ్రహిస్తుంది.

దీని కారణంగా, నల్ల గొడుగులు సూర్యుని నుండి కిరణాలను గ్రహించి నిలుపుకుంటాయి. దీని వలన వేడి గొడుగు కింద ఉన్న వ్యక్తికి తాకుతుంది. దీంతో పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. మీరు ఎంత ప్రయత్నించినా.. వేడి తగ్గదు. మీరు నల్ల గొడుగు కింద నడుస్తూ ఉంటే చెమటలు ఇంకా ఎక్కువగా పడతాయి.

ఈ కారణంగానే ఎండలో నల్లని గొడుగు వాడే వ్యక్తికి విపరీతంగా చెమట పట్టవచ్చు. అంతేకాకుండా వేసవి తాపం వల్ల శరీరంలో ట్యూమర్లు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వేసవికి ఏ రంగు గొడుగు మంచిది?

తెల్లటి గొడుగు సూర్యునిపై పడే వేడి కిరణాలను నిలుపుకోదు. దానిని తిరిగి పైకి ప్రతిబింబిస్తుంది. వేసవి వేడి సమయంలో వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నలుపు రంగుకు బదులుగా తెలుపు లేదా ఇతర రంగుల గొడుగులను ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని ఎండ నుండి రక్షిస్తుంది.

అంతేకాగు మీరు వేసవిలో బయటకు వెళ్లే సమయంలో నలుపు రంగు దుస్తులను వాడకండి. ఇవి ఎండను ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో మీకు వేడి ఎక్కువగా అనిపిస్తుంది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఎక్కువగా తెలుపు రంగు బట్టలు వేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి.