Tuesday Motivation: మీలో ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు ఈ సంస్కృత వాక్యాలను తలచుకోండి, మీలో కొత్త బలం పుట్టుకొస్తుంది
Tuesday Motivation: మనిషి ఎప్పుడో ఒకప్పుడు తనపై నమ్మకాన్ని కోల్పోతాడు. తీవ్రమైన నిరాశలోకి చేరుకుంటాడు. అలాంటి సమయంలో ఆయనకు ఒక చేయూత అవసరం. అలాంటి చేయూతలా పనికొచ్చేవే ఈ సంస్కృత వాక్యాలు.
Tuesday Motivation: సంస్కృతం దైవ భాష. తాత్వికమైనది. ఎంతో లోతైనది. చిన్న మాటల్లోనే ఎంతో అర్ధాన్ని ఇస్తుంది. అన్ని భాషలు సంస్కృత భాష నుంచి వచ్చాయని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ ఎంతోమంది సంస్కృతాన్ని దైవ భాషగా పూజిస్తారు. సంస్కృతంలోనే పచ్చబొట్లు వేయించుకుంటారు. అలాంటి సంస్కృత భాషలో కొన్ని అద్భుతమైన పదబంధాలు ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు, మీపై మీకు నమ్మకం లేనప్పుడు వీటిని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. వాటి అర్థాలను తెలుసుకోండి. మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీపై మీకు నమ్మకం కలుగుతుంది.
ఉద్ధరేదాత్మనాత్మానమ్
ఈ సంస్కృత వాక్యానికి అర్థం మిమ్మల్ని మీరే ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలి అని. ఇది వ్యక్తులు తమకు తామే సహాయం చేసుకోవాలని చెప్పేది. ఎదుటివారి సహాయం కోసం వేచి చూస్తే సమయం గడిచిపోతుంది, కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని వివరిస్తుంది. ఇది భగవద్గీతలో ఉండే వాక్యం. స్వీయ విశ్వాసాన్ని, అంతర్గత బలాన్ని సూచించేది. ఎటువంటి బాహ్య సహాయాన్ని కోరకుండా స్వశక్తితో పైకి రమ్మని చెప్పేది.
అహమస్మి యోధః
దీన్ని మీరు పదే పదే తలుచుకుంటే మీరంతా బలవంతులు లేరు. అహమస్మి యోధః అంటే నేను ఒక యోధుడిని అని అర్థం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అవసరమైన ధైర్యాన్ని పొందడానికి మీరు పదేపదే అహమస్మి యోధః అనుకుంటూ ఉండాలి. ఇది మీలో బలమైన సంకల్పాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. ఇది మీకు ప్రేరణలా ఉపయోగపడుతుంది. మీరే యోధుడైనప్పుడు మీకు మరొకసారి సాయం అవసరం లేదు, కాబట్టి మీలో స్ఫూర్తి నింపే ఇలాంటి వాక్యాలను తరచూ తలుచుకోవడం చాలా అవసరం.
కర్మణ్యేవాధికారస్తే
భగవద్గీతలోని మరొక అందమైన సంస్కృత పద బంధం కర్మణ్యేవాధికారస్తే. మీరు కర్తవ్యాన్ని నిర్వహించే హక్కు మాత్రమే మీకు ఉంది, దాని ఫలితాన్ని ఆశించకూడదు అని అర్థం. కష్టపడి పని చేయడమే మీ పని, ఫలితం ఎలా వస్తుందన్నది తర్వాత ఆలోచించాల్సింది అని నిజజీవితంతో దీన్ని ముడి పెట్టుకోవాలి. దైనందిన జీవితంలో ఒక పని మనం చేస్తున్నప్పుడు ఆ పని తాలూకు ఫలితాన్ని ముందే ఊహించడం, ఆశించడం చేయకూడదు. కష్టపడి పని చేస్తే ప్రశంసలు, బహుమతులు అవే దక్కుతాయి.
సా విద్యా యా విముక్తయే
జ్ఞాన సంపాదన మొదట ముఖ్యమని చెప్పేది ఈ సంస్కృత వాక్యం. నిజమైన జ్ఞానం లేకుండా మనిషి ఏ విషయం నుండి విముక్తి పొందలేడని చెబుతుంది. జ్ఞానం సంపాదించడం ద్వారానే మనిషి ఏదైనా సాధించగలడని, సంకెళ్ల నుంచి విముక్తి పొందగలడని చెప్పే వాక్యం ఇది. మీరు స్వేచ్ఛగా మీకు నచ్చినట్టు జీవించాలంటే ముందు మీరు దానికి తగ్గ ప్రయత్నాన్ని కష్టాన్ని చేయాలి.
ఏకాంతే సుఖమాస్యతామ్
ఈ వాక్యానికి అర్థం ఏకాంతంలోనే ఎంతో ఆనందం ఉంది అని. రోజూ ఉండే బిజీ ప్రపంచంలో పడి మనిషి తనని తానే కోల్పోతున్నాడు. తన జ్ఞానాన్ని, తన ఆలోచనలను, తన ప్రశాంతతను తిరిగి పొందాలంటే రోజులో కాసేపైనా ఏకాంతంగా ఉండాలి. ఇతర వ్యక్తులతో కాకుండా తనతోనే తను మాట్లాడుకోవాలి. ఒంటరితనం చెడ్డది కాదు, రోజులో కాసేపు ఒంటరిగా ఉండటం వల్ల మీకు స్వచ్ఛమైన ఆనందం దక్కుతుంది.