Menopause: మహిళల్లో పీరియడ్స్ ఏ వయసులో ఆగిపోతాయి? మెనోపాజ్ లక్షణాలివే
Menopause: మహిళల్లో మెనోపాజ్ దశ రాగానే పీరియడ్స్ ఆగిపోతాయి. ఏ వయసులో సాధారణంగా నెలసరి ఆగిపోతుంది, మెనోపాజ్, ప్రి మెచ్యూర్ మోనోపాజ్ లక్షణాలేంటో వివరంగా తెల్సుకోండి.
రజస్వల అయినప్పటినుంచి ప్రతి అమ్మాయికి నెలకోసారి పీరియడ్స్ వస్తాయి. అయితే ఒక వయసు వచ్చాక పీరియడ్స్ రావడం పూర్తిగా ఆగిపోతుంది. దాన్నే మెనోపాజ్ దశ అంటారు. పీరియడ్స్ ఆగిపోతే మహిళలు మెనోపాజ్ దశలో అడుగు పెట్టినట్లే. ఏ వయసులో మహిళల్లో పీరియడ్స్ రావడం పూర్తిగా ఆగిపోతుందో తెల్సుకోండి.
ఏ వయసులో పీరియడ్స్ ఆగిపోతాయి?
సాధారణంగా మహిళలు 45 నుంచి 55 ఏళ్ల వయసులో మెనోపాజ్ లోకి అడుగుపెడతారు. ఈ సమయంలోనే అండాశయాలు అండాలు విడుదల చేయడం ఆపేస్తాయి. పీరియడ్స్ రావడం కూడా ఇదే వయసులో ఆగిపోతాయి. ఒక సంవత్సరం పాటూ లేదా 12 నెలల పాటూ క్రమంగా పీరియడ్స్ రాకపోతే మోనోపాజ్ దశలోకి సహజంగా అడుగు పెట్టినట్లే. అంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా పూర్తిగా పోయినట్లే. కాకపోతే ఈ వయసులో కూడా కొన్ని సంతాన సాఫల్య చికిత్సల ద్వారా మాత్రం పిల్లల్ని కనడం సాధ్యపడొచ్చు.
అలాగే రేడియేషన్, కీమోథెరపీ లాంటి చికిత్సల వల్ల, అండాశయాలు తొలగించాల్సిన అవసరం పడే చికిత్సల వల్ల కూడా పీరియడ్స్ ఆగిపోతాయి. హిస్టెరెక్టమీ చికిత్స వల్ల, అంటే.. గర్భాశయాన్ని తొలిగించినా కూడా పీరియడ్స్ రావు. కొంతమంది హార్మోనల్ గర్భనిరోధక మార్గాన్ని ఎంచుకుంటే ఆ మందుల వల్ల కూడా క్రమరహిత పీరియడ్స్ లేదా పీరియడ్స్ రావడం పూర్తిగా ఆగిపోవచ్చు.
మెనోపాజ్ లక్షణాలు:
మెనోపాజ్‌తో వచ్చే మార్పుల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. ప్రతి వ్యక్తికీ ఈ లక్షణాలు మారొచ్చు. కొంతమందికి ఏ లక్షణాలు లేకపోవచ్చు కూడా. కొంతమందికి ఏళ్ల తరబడి ఈ సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. మోనోపాజ్ లక్షణాలేంటో చూడండి.
- రాత్రి పూట చెమటలు పట్టడం. ఉన్నట్లుండి జ్వరం వచ్చినట్లు అయ్యి శరీరం వేడెక్కడం. ముఖ్యంగా ముఖం, మెడ, చాతీ దగ్గర వేడిగా అనిపిస్తుంది.
- నెలసరి క్రమంలో మార్పులు రావడం. రక్త స్రావం తక్కువ, ఎక్కువ అవ్వడం.
- యోని దగ్గర పొడి బారడం, లైంగిక కలయికలతో నొప్పి రావడం
- నిద్రలేమి సమస్య చుట్టు ముట్టడం లేదా నిద్ర పోవడంలో ఇబ్బంది
- భావోద్వేగాల్లో మార్పులు. డిప్రెషన్, ఆందోళన పెరగడం
ఇవన్నీ మోనోపాజ్ దశను సూచించే లక్షణాలు.
ప్రి మెచ్యూర్ మెనోపాజ్:
మహిళల్లో మెనోపాజ్ సాధారణ వయసు 45 నుంచి 55 మధ్యలో ఉంటుంది. కానీ కొందరిలో 40 ఏళ్ల కన్నా ముందే మోనోపాజ్ వస్తే దాన్ని ప్రి మెచ్యూర్ మెనోపాజ్ అంటాం. దీని ప్రభావం సంతానం కోసం ప్రయత్నించే వాళ్ల మీద తీవ్రంగా ఉంటుంది. ఇలా రావడానికి వంశపార్య ప్రభావం నుంచి కొన్ని రకాల వ్యాధుల వరకు అనేక కారణాలుండొచ్చు. నిరంతర వైద్య పరీక్షల వల్ల ఈ సమస్యలు ముందుగానే గుర్తిస్తే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.
టాపిక్