Ramadan 2025: రంజాన్ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 31 లేదా ఏప్రిల్ 1 రెండ్రోజుల్లో పండుగ ఎప్పుడు?-when should the festival of ramadan be celebrated when is the festival celebrated on march 31 or april 1 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ramadan 2025: రంజాన్ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 31 లేదా ఏప్రిల్ 1 రెండ్రోజుల్లో పండుగ ఎప్పుడు?

Ramadan 2025: రంజాన్ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 31 లేదా ఏప్రిల్ 1 రెండ్రోజుల్లో పండుగ ఎప్పుడు?

Ramya Sri Marka HT Telugu

Ramadan 2025: పవిత్రమైన రంజాన్ మాసం మార్చి 2వ తేదీ నుంచి మొదలైంది. నెల రోజుల పాటు కొనసాగే ఈ మాసం చివరి రోజైన రంజాన్‌ను ఎప్పుడు జరుపుకోనున్నారు? ఇండియాలో రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) ఏ తేదీన రాబోతుందంటే..

రంజాన్ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి

ఈ ఏడాది ఇండియాలో రంజాన్ ఎప్పుడు జరుపుకోవాలి, మార్చి 2న మొదలైన పవిత్ర మాసం రంజాన్ ఎప్పుడు ముగియబోతుంది? పండుగ తేదీని ఎలా నిర్ణయిస్తారు? ఈ నెల 29 రోజులు ఉంటుందా.. 30 రోజులు ఉంటుందా అనేది ఎలా ఫైనల్ చేస్తారు. ముస్లిం ఉపవాస దినాలు ఎన్ని రోజులు.. అనే ఆలోచన మీ అందరిలోనూ ఉందా? రండి. రంజాన్‌గా పిలుచుకునే ఈద్ ఉల్ ఫితర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

రంజాన్ మాసం:

షవ్వాల్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెల అయిన రంజాన్‌ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో, కఠినమైన ఉపవాస దీక్షతో జరుపుకుంటారు. ఈ నెల ముగిసిన తర్వాత మరుసటి రోజును ఈద్-ఉల్-ఫితర్‌గా జరుపుకుంటారు. ఈ నెలారంభాన్ని, నెల ముగియడాన్ని చంద్రుని ఆధారంగా నిర్ణయిస్తారు. అమావాస్యతో ముగిసిన ఎనిమిదో నెల తర్వాత వచ్చే నెలవంకతో రంజాన్ మొదలైతే మళ్లీ నెలవంకతో మాసం ముగుస్తుంది. ఆ తర్వాత రోజే పండుగ. చంద్రుని భ్రమణాన్ని బట్టి చూస్తే సౌదీ అరేబియాలో ముందుగానే నెలవంక కనిపిస్తుంది. కాబట్టి, ఒక రోజు ముందే సౌదీలో జరుపుకుంటే, మరుసటి రోజు ఇండియాలో జరుగుతుంది.

మార్చి 2వ తేదీన మొదలైన రంజాన్ నెల మార్చి 30న నెలవంక కనిపించడంతో ముగిస్తుంది. అప్పుడు మార్చి 31న రంజాన్ పండుగ జరుపుకుంటారు. లేదంటే మార్చి 31న నెలవంక కనిపించి రంజాన్ నెల ముగిస్తే ఏప్రిల్ 1న పండుగ జరుపుకుంటారు.

ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్):

ఈద్ ఉల్ ఫితర్ అంటే ఫిత్రాలు చేసే పండుగ అని అర్థం. ఇక్కడ ఫిత్రా అంటే దానాలు. ఈ నెల రోజుల్లో ఉపవాసం ఉంటూ ఎక్కువ దానధర్మాలు చేయాలని ముస్లింలు భావిస్తారు. అలా చేసిన వారికి దానం చేసిన దానికి 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని భావిస్తారు.

ఇస్లాంను నడిపించే ఐదు ధర్మాల్లో ఒకటి రంజాన్ ఉపవాసం. ఆరోగ్యం సహకరించలేని వృద్ధులు, రోగులు, చిన్న పిల్లలు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు తప్పించి ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాస దీక్ష పాటించాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షకు భగ్నం కలిగితే, రంజాన్ పండుగ తర్వాత దీక్షకు విరామం కలిగిన రోజులను పూర్తి చేయాలి. ఉపవాసం ఉంటూ, ఆ అల్లాహ్ ప్రసన్నం చేసుకునేందుకు ఐదు పూటలా నమాజ్ (సలాత్)ను చదువుకోవాలి.

ఇక ఉపవాసం విషయానికొస్తే, రోజులో ఉపవాసం మొదలుపెట్టడానికి ముందు, ఉపవాస విరమణ తర్వాత తినే ఆహారానికి విభిన్నమైన పేర్లు ఉంటాయి. ఇవి సూర్యోదయ, సూర్యాస్తమయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఉదయం తినే ఆహారాన్ని సహరీ అని, సాయంత్రం తినే ఆహారాన్ని ఇఫ్తార్ అని పిలుస్తారు. విరమణ సమయంలో కచ్చితంగా ఒకటి లేదా మూడు ఖర్జూరాలు తిని, నీరు తాగుతారు. ఇదే విధంగా 30 రోజులు లేదా 29 రోజుల పాటు ఉపవాసాలను కొనసాగిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా, ఈ ఉపవాస సమయంలో కొన్ని గంటల తేడా ఉంటుంది. కానీ, ప్రతి ముస్లిం కచ్చితంగా 12 నుంచి 13 గంటల పాటు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాల రోజుల్లోనే, ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథంలోని సూక్తులు (సూరాలు) అవతరించాయని నమ్మకం.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం