Pregnancy Saffron tips: గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం ఎప్పుడు ప్రారంభించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Pregnancy Saffron Tips: గర్భంతో ఉన్న వారు కుంకుమ పువ్వు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎప్పుడు దీన్ని తీసుకోవడం మొదలుపెట్టాలో తెలుసుకోవాలి. ఇంకొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
గర్భం దాల్చిన మహిళలకు చాలా మంది రకరకాల సలహాలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా వినిపించేది కుంకుమ పువ్వు. గర్భం దాల్చినప్పుడు కుంకుమ పువ్వు తినాలని చాలా మంది పెద్దలు చెబుతారు. ఇది తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారని అనుకుంటారు. అయితే, ఆ విషయంలో వాస్తవం లేకపోయినా కుంకుమ పువ్వు వల్ల గర్భిణులకు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, గర్భం దాల్చిన తొలి రోజుల్లో దీన్ని అసలు తీసుకోకూడదు. కుంకుమ పువ్వును ఎప్పుడు తీసుకోవాలో నిపుణులు చెప్పారు. ఈ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏడో నెల నుంచి ఉత్తమం
గర్భం దాల్చిన తొలి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకోకూడదు. దీనివల్ల నొప్పి పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. గర్భిణులు.. కుంకుమ పువ్వు తీసుకోవడం మొదలుపెట్టేందుకు ఏడో నెల సరైన సమయంగా ఉంటుందని డాక్టర్లు చెబుతారు. ఏడో నెల నుంచి గర్భంలో బిడ్డ ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. అందుకే అప్పటి నుంచే కుంకుమ పువ్వు తీసుకోవాలని సూచిస్తున్నారు. నాలుగో నెల నుంచి తీసుకున్నా పర్వాలేదు.
కుంకుమ పువ్వుతో గర్భిణులకు ప్రయోజనాలు ఇవే
నిద్రలేమి సమస్య తీరుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలకు సరిగా నిద్రపట్టదు. నిద్రలేమితో ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంటుంది.
చర్మానికి మేలు: గర్భం దాల్చినప్పుడు శరీరంలో హర్మోన్ల అసమతుల్యత ఉంటుంది. వీటి వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంకుమ పువ్వు తీసుకోవడం ఆ చర్మ సమస్యలు తగ్గేందుకు సహకరిస్తుంది.
మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది: గర్భం దాల్చినప్పుడు హర్మోన్ల మార్పు వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే చిరాకు, కోపం పడడం లాంటివి జరుగుతుంటాయి. అయితే, ఈ మూడ్ స్వింగ్‍లు తగ్గేందుకు కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు కూడా తోడ్పడుతుంది.
శ్వాసకు, గుండెకు మంచిది: ప్రెగ్నెన్సీ సమయంలో కొందరికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. బ్రడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా సహకరిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా కుంకుమ పువ్వు మంచిది.
బిడ్డ ఎదుగుదలకు: కుంకుమ పువ్వులో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు కూడా కుంకుమ పువ్వు మేలు చేస్తుంది.
ఎక్కువగా తీసుకుంటే సైడ్‍ఎఫెక్ట్స్ ఇవి
మంచిది కదా అని ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వు మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఓ మోతాదు మేరకు తీసుకోవాలి. కుంకుమ పువ్వు ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విరేచనాలు కలిగే రిస్క్ ఉంటుంది. ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ప్రెగెన్సీ సమయంలో రోజులో 1.5 గ్రాముల కుంకుమ పువ్వు తీసుకుంటే సరిపోతుంది. ప్రతీ రోజు రెండు కుంకుమ పువ్వు రెబ్బలను గోరువెచ్చని పాలలో వేసుకొని తాగితే సరిపోతుంది. మోతాదు మేరకు అయితే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
టాపిక్