Wheat Halwa: స్వీట్ తినాలనిపిస్తే చిటికెలో గోధుమ హల్వా ఇలా చేసేయండి, ఈ నేతి వంటకం అదిరిపోతుంది-wheat halwa recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wheat Halwa: స్వీట్ తినాలనిపిస్తే చిటికెలో గోధుమ హల్వా ఇలా చేసేయండి, ఈ నేతి వంటకం అదిరిపోతుంది

Wheat Halwa: స్వీట్ తినాలనిపిస్తే చిటికెలో గోధుమ హల్వా ఇలా చేసేయండి, ఈ నేతి వంటకం అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Nov 06, 2024 05:30 PM IST

Wheat Halwa: గోధుమలతో చేసిన వంటకాలు రుచినే కాదు, శక్తిని కూడా అందిస్తాయి. ఇక్కడ మేము చాలా సులువైన పద్ధతిలో గోధుమ హల్వా ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీ ఫాలో అవ్వండి.

గోధుమ హల్వా రెసిపీలు
గోధుమ హల్వా రెసిపీలు

స్వీట్ రెసిపీలు కష్టమనుకుంటాం కానీ, కొన్నింటినీ చాలా సులువుగా చేసేయచ్చు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తక్కువ సమయంలో రెడీ అయిపోయే గోధుమ హల్వా వండుకోండి. ఇది రుచిగా ఉంటుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీని ప్రయత్నించవచ్చు. పండుగల సమయంలో నైవేద్యంగా కూడా ఈ స్వీట్ ను నివేదించవచ్చు. తక్కువ సమయంలోనే దీన్ని వండేయచ్చు. ఈ స్వీట్ ఎలా చేయాలో తెలుసుకోండి.

గోధుమ హల్వా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - ఒక కప్పు

నెయ్యి - ఒక కప్పు

నీళ్లు - రెండు కప్పులు

బెల్లం తురుము - ఒక కప్పు

యాలకుల పొడి - చిటికెడు

జీడిపప్పులు - గుప్పెడు

కిస్మిస్లు - గుప్పెడు

గోధుమ హల్వా రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి గోధుమ పిండిని వేసి వేయించాలి.

2. చిన్న మంట మీద వేయిస్తే మాడిపోకుండా ఉంటుంది.

3. ఇప్పుడు అందులో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా కప్పు నెయ్యిని పోయాలి.

4. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.

5. ఇందులో రెండు కప్పుల నీటిని మెల్లగా పోస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి, లేకుంటే గడ్డలు కట్టేసే ప్రమాదం ఉంటుంది.

6. కాబట్టి ఒకపక్క నీళ్లను వేస్తూనే మరోపక్క కలపాలి.

7. నీళ్లు పోసిన తర్వాత పిండి మెత్తగా అవుతుంది.

8. కాసేపటికి గుల్ల గుల్లగా అవుతుంది. ఇప్పుడు బెల్లం తురుమును అందులో వేసి బాగా కలపాలి.

9. బెల్లం వేడికి కరిగి నీళ్లల్లా అవుతుంది. ఆ మిశ్రమాన్ని కళాయికి అంటుకోకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి.

10. ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి.

11. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉంచి కలుపుతూనే ఉండాలి.

12. చివర్లో జీడిపప్పులు, కిస్మిస్లను వేయించి అందులో వేసుకోవాలి.

13. ఇది హల్వాలాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

14. ఎప్పుడైతే ఇది హల్వా లాగా అవుతుందో కళాయి నుంచి ఈ మిశ్రమం విడిపోయి వచ్చేస్తూ ఉంటుంది. అంటే హల్వా రెడీ అయినట్టే.

15. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కి నెయ్యి రాసి అందులో వేసుకోవాలి.

16. చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. లేదా గిన్నెలో హల్వా లాగా తినేసినా టేస్టీ గానే ఉంటుంది.

17. ఇందులో మనం పంచదారను వాడలేదు కాబట్టి ఆరోగ్యానికి ఇది మేలే చేస్తుంది.

ఈ స్వీట్లో మనం ఆరోగ్యానికి మేలు చేసేవే ఉపయోగించాము. గోధుమపిండి కూడా కొంతవరకు శక్తిని మనకు అందిస్తుంది. అలాగే బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. బెల్లాన్ని ప్రతిరోజూ తినమని చెప్పే వైద్యులు కూడా ఉన్నారు. ఇది పొట్టకు కూలింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం వంటివి రాకుండా ఉంటాయి. ఈ గోధుమ హల్వాను తినడం వల్ల అన్ని రకాలుగా మనకు ఆరోగ్యమే. పైగా ఇందులో నెయ్యి కూడా వేసాము. కాబట్టి నెయ్యిలో ఉండే పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి. పిల్లలకు ఈ గోధుమ హల్వాను అప్పుడప్పుడు పెట్టడం వల్ల వారు బలంగా ఎదుగుతారు. శక్తి కూడా శరీరానికి అందుతుంది. ఒక్కసారి దీని చేసి చూడండి ఎంత సులువు మీకే అర్థమవుతుంది.

Whats_app_banner