Wednesday Motivation: ఈనాడు మీరు చేసే పనులే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి, అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకోండిలా
Sunday Motivation: భవిష్యత్తు ఎలా ఉండాలని నిర్ణయించుకునేది మనమే. ఈనాడు మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. కాబట్టి ఈరోజు మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి.
ప్రతి మనిషి భవిష్యత్తుపై ఆశతోనే జీవిస్తారు. భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కలలు కంటారు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే భవిష్యత్తు అనేది నేడు మీరు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. మీరు మంచి పనులు చేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కష్టపడి పని చేస్తూ ఉంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఈనాడు చేసే ప్రతి పనీ భవిష్యత్తులో మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి నేడు మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
మనుషుల్లో నూటికి 90 శాతం మంది తమకున్న శక్తి యుక్తులలో తక్కువ భాగమే వినియోగిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడితే ఏదో ఒక రోజు అతడు మంచి ఉన్నత స్థాయికి కచ్చితంగా చేరుతాడు.
ముందుగా మీరు మీ శక్తి ఏంటో, మీరు ఎంతవరకు కష్టపడి పని చేయగలరో వంటి విషయాలపై అవగాహన అవసరం. అలాగే మీకు ఏ రంగంలో ఎక్కువ ఆసక్తి ఉందో, మెదడు చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఆ రంగంలోనే మీరు అడుగుపెట్టి ఈరోజు నుంచే ప్రతి క్షణం కష్టపడుతూ ఉండాలి. మీరు కష్టపడే ప్రతి క్షణం భవిష్యత్తులో మీకు అద్భుతమైన ఆనంద క్షణాలను అందిస్తుంది.
నిన్న ఏం జరిగింది అని బాధపడుతూ కూర్చునే కన్నా ఈరోజు మనం ఏం చేయాలి అన్నది ఆలోచించడమే ముఖ్యం. మీరు ఈరోజు చేసే ప్రతి పనీ మీ ఎదుగుదలకు గుర్తుగా, జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జీవితంలో ప్రతిరోజూ మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. రేపటిని తీర్చిదిద్దుకోవడానికి ఈ రోజే మీరు సిద్ధమవ్వాలి. అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకోవాలనుకునే ప్రతి వ్యక్తి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. ఈరోజు సుఖపడితే భవిష్యత్తులో కష్టపడక తప్పదు.
మీ శరీర శక్తి, మీ బుద్ధి బలం, మీ భావోద్వేగాల తీవ్రతలను బట్టి మీరు అందుకునే అత్యున్నత స్థాయి ఏంటో మీరే నిర్ధారించండి. ఆ స్థాయిని చేరుకోవడానికి మీ లక్ష్యంగా పెట్టుకోండి. భవిష్యత్తులో ఆ స్థాయిని చేరుకోవడానికి ఈ క్షణం నుంచే పని చేయడం మొదలు పెట్టండి.
ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మీరే ఉత్తేజితం చేసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు అడుగేయాలి. అప్పుడే ఏదైనా సాధించగలరు. మీలోనే ఆ స్ఫూర్తి లేకపోతే స్వర్గంలో ఉన్నా కూడా మీరు దాన్ని నరకంగా మార్చేసుకోగలరు. గతాన్ని ఒక సోపానంగా వాడుకోండి. గతం సాయంతో జాగ్రత్తగా భవిష్యత్తును నిర్మించుకోండి.
ఇతరులు విసిరే రాళ్లను చూసి వెనకడుగు వేయకండి. వాళ్ళు విసిరే రాళ్లతోనే మీ కోటను నిర్మించండి. కానీ తిరిగి వారి మీదకి అదే రాళ్ళను విసిరే ప్రయత్నం చేయకండి. జీవితం కూడా ఎన్నో సవాళ్లు మీకు విసురుతూనే ఉంటుంది. ఆ సవాళ్లను తీసుకుని ముందుకు వెళ్ళండి. ఆ సవాళ్లతోనే వంతెన కట్టుకొని భవిష్యత్తుకు చేరుకోండి. ప్రతిరోజూ సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ప్రతిరోజూ సుఖపడే వ్యక్తికి హఠాత్తుగా చిన్న సమస్య వచ్చినా దాన్ని తట్టుకోలేక విలవిలలాడిపోతాడు. కాబట్టి సవాళ్లు, సమస్యలు అన్నవి మిమ్మల్ని మరింత కఠిన తరం చేసే శిక్షణలో భాగంగా భావించండి.
మీ మీద విషం చిమ్మే వాళ్ళని ద్వేషించడం మానేయండి. ఆ విషాన్ని కూడా మీ మంచికే వినియోగించండి. ఔషధాలలో కూడా విషాలను వాడడం గురించి వినే ఉంటారు. పనికొచ్చే విషయమైతే దాన్ని సలహాగా స్వీకరించండి. మిగతా విషయాలను చెత్తగా భావించి వదిలేయండి. ఇంట్లో ఎవరూ చెత్తను పెట్టుకోరు... బయటపడేస్తారు. అలాగే మెదడులోంచి కూడా మీకు నచ్చని విషయాలను, నచ్చని మనుషుల గురించి తొలగించండి. మీ లక్ష్యాన్ని మాత్రమే గురిపెట్టండి.