Type 1.5 diabetes: టైప్ 2 కాదు.. టైప్ 1.5 డయాబెటిస్.. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
Type 1.5 diabetes: టైప్ 2 డయాబెటిస్ గురించి, టైప్ 1 డయాబెటిస్ గురించే ఎక్కువగా వింటుంటాం. టైప్ 1.5 డయాబెటిస్ ఉంటుందని తెలుసా? ఇది ఎవరికి వస్తుంది? ఎలా నయం చేసుకోవాలో వివరాలున్నాయిక్కడ.
డాక్టర్ గనక టైప్ 1.5 డయాబెటిస్ వచ్చిందని రిపోర్ట్ రాసిస్తే పొరపాటున రాశారేమో అనుకుంటాం. కానీ టైప్ 2, టైప్ 1 తో పాటే టైప్ 1.5 డయాబెటిస్ కూడా ఉంటుంది.దీన్నే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (LADA) అంటారు. టైప్ 1, 2 లక్షణాలు రెండూ ఈ డయాబెటిస్ రకంలో ఉంటాయి.
టైప్ 1.5 డయాబెటిస్ అంటే?
ఇలి ఆటో ఇమ్యూన్ రకం డయాబెటిస్. ముప్ఫై ఏళ్లు పైబడిన వాళ్లలో మాత్రమే సాధారణంగా ఇది వస్తుంది. 10 శాతం షుగర్ పేషెంట్లకు టైప్ 1.5 డయాబెటిస్ ఉంటుందని కరెంట్ డయాబెటిస్ రివ్యూస్ ప్రచురణ చెబుతోంది.
టైప్1, 1.5, 2 డయాబెటస్ మధ్య తేడాలు:
1. వయసు:
టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో, యుక్త వయసు పిల్లల్లో వస్తుంది. టైప్ 1.5 ముప్ఫై ఏళ్ల పైబడిన వాళ్లలో సాధారణంగా వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ మాత్రం 45 ఏళ్లు దాటిని పెద్దల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువు సమస్య వల్ల తక్కువ వయస్కులలోనూ టైప్ 2 డయాబెటిస్ ఈ మధ్య కనిపిస్తోంది.
2. రోగం తీరు:
టైప్ 1, టైప్ 1.5 డయాబెటిస్ రెండూ కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులు. అంటే శరీర రోగనిరోధక శక్తి తన సొంత కణాల మీదే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధుల్ని ఆటో ఇమ్యూన్ రోగాలంటారు. టైప్ 2 మాత్రం ఇన్సులిన్ నిరోధకత వల్ల వస్తుంది.
3. వ్యాది ముదరడం:
టైప్ 1 డయాబెటిస్ చాలా వేగంగా పెరుగుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. టైప్ 1.5 మాత్రం చాలా మెల్లగా పెరుగుతుంది. ఈ వ్యాధి ఉందని తెలిసిన కొన్ని నెలలు లేదా సంవత్సరం దాకా కూడా ఇన్సులిన్ చికిత్స అవసరం పడకపోవచ్చు. టైప్ 2 ఇంకా మెల్లగా పెరుగుతుంది. జీవన విధానంలో మార్పుల వల్ల దీన్ని అదుపులో పెట్టుకునే అవకాశాలుంటాయి.
టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు:
- రక్తంలో గ్లుకోజ్ స్థాయులు పెరిగిపోతాయి. దాంతో చక్కెరను శరీరం మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. దీనివల్ల దాహం పెరగడం, తరచూ మూత్రానికి వెళ్లాలి అనిపిస్తుంది.
- చక్కెర స్థాయులు పెరగడం వల్ల బాగా అలిసిపోతారు.
- దృష్టిలో స్పష్టత తగ్గుతుంది.
- రోగనిరోధక శక్తి తగ్గి సులువుగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.
- శరీరం గ్లుకోజ్ వాడుకునే శక్తి కోల్పోవడం వల్ల ఎంత తిన్నా సరే బరువు తగ్గిపోతారు.
- గాయాలైతే తొందరగా మానిపోవు.
టైప్ 1.5 డయాబెటిస్ రాకుండా ఎలా జాగ్రత్తపడాలి?
ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి కావడం వల్ల దీని కారణాల్ని సరిగ్గా చెప్పలేరు. సరైన బరువులో ఉండటం, శరీరాన్ని కదలించడం లాంటి ఆరోగ్యకర జీవన విధానాల వల్ల ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాధి వచ్చిందని నిర్ధరణ అయితే సమతుల ఆహారం ఆహారం, వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నిరంతరం బ్లడ్ గ్లుకోజ్ స్థాయుల్ని పరీక్షించుకోవడం వల్ల తీవ్రత కాస్త తగ్గుతుంది.