నిద్ర అనేది మానవ శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియల్లో ఒకటి. ఇది కేవలం విశ్రాంతినివ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడే వారు బోలెడు మంది. మీకు తెలుసా, మెగ్నీషియం సరైన మోతాదులో అందడం వల్ల మీ నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందట. ఈ ఖనిజానికి నిద్రకు ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
మెగ్నీషియం కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. మెగ్నీషియం తగినంత లేకపోతే, కండరాలు పట్టేయడం లేదా బిగుతుగా ఉండటం వంటివి కలిగి నిద్రకు భంగమవుతుంటుంది.
మెగ్నీషియం నాడీ వ్యవస్థను శాంత పరచడానికి సహాయపడుతుంది. ఇది గామా-అమైనోబ్యూటిరిక్ యాసిడ్ అనే న్యూరోట్రాన్స్మిటర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మెదడు కార్యకలాపాలను తగ్గించి నిద్రను ప్రోత్సహిస్తుంది.
మెగ్నీషియం మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అవసరం.
మెగ్నీషియం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ ఒత్తిడితో ఉండటం వల్ల ఆందోళన దూరమై మంచి నిద్రకు దోహదం చేస్తుంది.
ఈ చిన్న చిన్న అలవాట్లతో శరీరానికి తగినంత మెగ్నీషియం అందించవచ్చు. అవేంటంటే,
మీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి.
మీ వైద్యుని సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. వివిధ రకాల మెగ్నీషియం సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు ఏది ఉత్తమమో డాక్టర్ మీకు సూచిస్తారు.
మెగ్నీషియం నూనెను చర్మానికి రాయడం ద్వారా లేదా మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సమ్ సాల్ట్) కలిపిన నీటిలో స్నానం చేయడం ద్వారా కూడా శరీరం కొంత మెగ్నీషియంను గ్రహించగలదు.
అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం మెగ్నీషియం స్థాయిలను తగ్గించవచ్చు. వీటిని మితంగా తీసుకోవడం మంచిది.
ఆరోగ్యకరమైన ప్రేగు మెగ్నీషియంను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ వాడటం వల్ల ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీరు నిద్రలేమి లేదా మెగ్నీషియం లోపం లక్షణాలను కలిగి ఉంటే, సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.