Camphor: హారతి కర్పూరానికీ, తినే కర్పూరానికీ మధ్య తేడా ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు?-what is the difference between harati camphor and edible camphor how is it made ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Camphor: హారతి కర్పూరానికీ, తినే కర్పూరానికీ మధ్య తేడా ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు?

Camphor: హారతి కర్పూరానికీ, తినే కర్పూరానికీ మధ్య తేడా ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు?

Haritha Chappa HT Telugu
Jun 19, 2024 09:34 AM IST

Camphor: ప్రతి ఇంట్లోనూ కర్పూరం ఉండడం సహజం. తెలుగిళ్లల్లో హారతి ఇచ్చేందుకు కర్పూర బిళ్లలను వాడతారు. కర్పూరంలో తినదగినవి కూడా ఉంటాయి.

కర్పూరం ఎలా తయారుచేస్తారు?
కర్పూరం ఎలా తయారుచేస్తారు?

Camphor: లడ్డూలు వంటి స్వీట్లు చేసేటప్పుడు మంచి సువాసన కోసం కర్పూరాన్ని వేస్తారు. అయితే మన ఇంట్లో హారతి కోసం వాడే కర్పూరాలు, తినే కర్పూరాలు ఒకటి కాదు. కర్పూరాన్ని కాంఫర్ అని పిలుస్తారు. భారతీయ వంటకాలలో ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం అని రెండు రకాలు ఉంటాయి. తినే కర్పూరాలను స్వీట్లు తయారీలో వినియోగిస్తూ ఉంటారు.

yearly horoscope entry point

తినే కర్పూరం అంటే

తినే కర్పూరం ఒక విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు, సుగంధ ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ప్రపంచంలోని అనేక వంటకాల్లో దీన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆసియాలోని దేశాల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది పదార్థాలను పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంచుతుంది. అందుకే దీన్ని కొన్ని రకాల స్వీట్లలో వాడతారు. ఆహారంలో కర్పూరాన్ని భాగం చేయడం వల్ల వంటకాలకు ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి. ముఖ్యంగా లడ్డూలు, బర్ఫీలు వంటి స్వీట్లలో, బిర్యానీలలో వంటి వాటిలో కొన్ని రకాల కూరల్లో కూడా చిటికెడు కర్పూరం పొడిని వేసి కలుపుతారు.

కర్పూరాన్ని ఆహారంలో భాగం చేయడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. ఇది సహజ సంరక్షక లక్షణాలను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వంటి వాటిని దూరంగా ఉంచుతుంది. కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. స్వీట్లలో చక్కెర ఉంటుంది. కాబట్టి అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే స్వీట్ల తయారీలో కర్పూరాన్ని వాడుతూ ఉంటారు. కర్పూరం తినడం వల్ల జీర్ణక్రియకు ఎంతో సహాయం దొరుకుతుంది. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. జీర్ణ ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు?

కర్పూరం చెట్లను ప్రత్యేకంగా పెంచుతారు. చెట్లనుండి చెక్కను తీసి దానితో కర్పూరాన్ని తయారుచేస్తారు. ముఖ్యంగా ఆసియాలోనే ఈ కర్పూరం చెట్లు అధికంగా ఉంటాయి. కర్పూరం తయారీ కాస్త కష్టతరమైనదే. చెట్లనుండి తీసిన పాలను అనేక రకాల ప్రక్రియలకు గురిచేసి వాటి నుంచి నూనెను తీసి ఆ నూనెను ఘనీభవించేలా చేసి కర్పూరాన్ని తయారుచేస్తారు. ఆ ముడి కర్పూరాన్ని మెరుగుపరచడం ద్వారా మలినాలను తొలగిస్తారు.

కర్పూరాల్లో సింథటిక్ కర్పూరం కూడా ఒకటి. ఇవి తినడానికి ఉపయోగపడేవి కాదు. సహజ కర్పూరం అంటే మొక్కల నుండి ఇలా సేకరించి తయారు చేసేది. కాబట్టి తినే కర్పూరం ప్రత్యేకంగా అమ్ముతారు. దీని ఖరీదు కూడా అధికంగా ఉంటుంది. తినే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. ఈ పచ్చ కర్పూరం చెట్లు వేర్లు, కాండం, కొమ్మలతో తయారు చేసుకుంటారు. ఔషధాల్లో కూడా దీన్ని వినియోగిస్తారు. అలాగే కాటుక తయారీలో కూడా వినియోగిస్తారు.

హారతి కర్పూరం అంటే

హారతి కర్పూరం అనేది ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిలో రసాయనాలను వినియోగిస్తారు. ముఖ్యంగా టర్పంటైన్ ను కలిపి రసాయనిక పద్ధతిలో ఈ హారతి కర్పూరాలు తయారు చేస్తారు. ఇది తినడానికి గానీ, మందుల్లో వాడడానికి కానీ వినియోగించకూడదు. వాటిని తింటే చాలా ప్రమాదకరం. జుట్టుకు రాసే నూనెలో కూడా కొంతమంది కర్పూరాన్ని కలుపుకుంటారు. పచ్చ కర్పూరాన్ని ఆ నూనెలో కలపవచ్చు, హారతి కర్పూరాలను కలపకూడదు. హారతి కర్పూరంలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. మంట వెంటనే అంటుకునేందుకు ఈ రసాయనాలను కలుపుతూ ఉంటారు.

పచ్చ కర్పూరాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎంతో మంచిది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ పచ్చ కర్పూరం వేసిన నీటితో ఆవిరి పడితే మేలు జరుగుతుంది. నూనెలో ఈ పచ్చ కర్పూరాన్ని వేసి బాగా కలిపి తలకు పట్టించిన నిద్ర బాగా పడుతుంది. అలాగే జుట్టు బాగా ఎదుగుతుంది.

మనదేశంలో కర్పూరం చెట్లు అధికంగా నీలగిరి కొండల్లో, మలబార్ ప్రాంతంలో, మైసూర్ ప్రాంతంలో కనిపిస్తాయి. అలాగే బోర్నియో, తైవాన్ దేశంలో కూడా కర్పూరం చెట్లు అధికంగానే ఉన్నాయి. ఈ చెట్ల పేరు క్యాంపర్ లారెల్. ఆ చెట్ల నుండి ఒక రకమైన పాలు కారుతాయి. ఆ పాలతోనే కర్పూరాన్ని తయారు చేస్తారు కొన్ని చోట్ల.

Whats_app_banner