Womens day 2025: మహిళా దినోత్సవానికీ మొదటి ప్రపంచ యుద్ధానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?-what is the connection between womens day and world war i ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Womens Day 2025: మహిళా దినోత్సవానికీ మొదటి ప్రపంచ యుద్ధానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

Womens day 2025: మహిళా దినోత్సవానికీ మొదటి ప్రపంచ యుద్ధానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

Haritha Chappa HT Telugu

Womens day 2025: వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. మహిళా దినోత్సవం ఎప్పుడు, దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోండి.

ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಮಹಿಳಾ ದಿನ (PC: Canva)

స్త్రీ అంటే శక్తి స్వరూపం. ఆమె ఉన్న చోట ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంటికి, సమాజానికి వెలుగు మహిళే. నేడు స్త్రీలు అడుగుపెట్టని రంగం లేదు. అన్ని రంగాలలో తమ ముద్ర వేసుకుంటూ పురుషులతో సమానంగా పనిచేస్తూ లింగ సమానత్వ సూత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు.

స్త్రీలు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించడంతో పాటు మహిళా సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. మహిళా దినోత్సవం ఎప్పుడు, దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ సమాచారం ఉంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు?

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. భారతదేశం సహా ప్రపంచంలోని అనేక దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర

మహిళా దినోత్సవం వెనుక ఎంతో చరిత్ర ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన కార్మిక ఉద్యమం, ఆ కాలంలోని వేగవంతమైన పారిశ్రామికీకరణ సమయంలో ఈ ఉమెన్స్ డే పుట్టింది. మరెన్నో అంశాలు మహిళా దినోత్సవం ప్రారంభానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.

జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ కమ్యూనిస్టు కార్యకర్త, మహిళా హక్కుల న్యాయవాది. ఆమె తొలిసారి 1910లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రతిపాదించిందని అంటారు. 1909లో యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేశారు. దాని కన్నా ముందు 1908లో న్యూయార్క్ నగరంలో మహిళలంతా తమ హక్కుల కోసం 15,000 మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. 1911 కల్లా ఎన్నో దేశాలకు మహిళా దినోత్సవం గురించి తెలిసింది. దీంతో వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలవు దినంగా నిర్వహించుకోవడం మొదలుపెట్టారు.

1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. దీని వల్ల ఎన్నో దేశాల ప్రజలు ఇబ్బందులు పడడం మొదలైంది. రష్యన్ మహిళలు యుద్దం నుంచి శాంతి కలగాలని కోరుకుంటూ 1917లో మహిళలంతా కలిసి కవాతు చేశారు. ఎన్నో శాంతి ర్యాలీలు నిర్వహించారు. దీంతో రష్యా మహిళలు 1917లో ఫిబ్రవరి 23న మహిళా దినోత్సవం నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. అన్ని దేశాల చర్చల అనంతరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ తేదీగా ధృవీకరించారు.

ఇవన్నీ ఫలితంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. ఇది అధికారికంగా మహిళా దినోత్సవం నిర్వహించుకునన మొదటి సంవత్సరం.

1977లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో మహిళల హక్కులు, ప్రపంచ శాంతిని మద్దతు ఇవ్వడానికి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని నిర్ణయించారు. అప్పటి నుండి, ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ద్వారా ఈ రోజును నిర్వహిస్తోంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగ అసమానతకు వ్యతిరేకంగా స్వరం వినిపించేందుకు ఏర్పాటైన వేదిక. ఇది సమానత్వాన్ని ప్రోత్సహించే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మహిళల హక్కులను కాపాడేందుకు, ఆర్థిక అసమానత, రాజకీయాల్లో ప్రాతినిధ్యం, లింగ ఆధారిత హింస వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ దినోత్సవం ఎంతో విలువ ఇస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను పూర్తిగా సాకారం చేయడంలో ఇంకా ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. లింగ సమానమైన భవిష్యత్తుకు అడుగులు వేయడానికి మహిళా దినోత్సవం దారి చూపిస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం