Sufficient Sleep: కంటికి సరిపడ నిద్ర అంటే ఏమిటి? మీరు కావల్సినంత నిద్రపోతున్నారా..? ఇలా చెక్ చేసుకోండి
Sufficient Sleep: రాత్రి నిద్ర సరిగా పట్టకపోతే, మరుసటి రోజంతా శారీరకంగానూ, మానసికంగానూ అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. శరీరానికి కావాల్సినంత నిద్రపోగలిగితే అటువంటి ఇబ్బందులు లేకుండా గడిపేయొచ్చు. అంతేకాదు డిప్రెషన్, జ్ఞాపకశక్తి సమస్యలను కూడా దూరం చేస్తుందట.
నిద్రలేమి శరీరంతో పాటు మనస్సును ఎన్నో రకాలుగా నాశనం చేస్తుంది. కప్పు కాఫీయో, టీనో తాగి నిద్రను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్న వారు ఈ విషయం తెలుసుకోవాలి. గుండెకు, మెదడుకు సంబంధించి కలిగే ప్రయోజనాలను ఎన్నింటిని దూరం చేసుకుంటున్నారో తెలుసుకోవాలి.
సరిపడ నిద్ర అనేది శరీరంలో శక్తి పునరుద్ధరణ, మానసిక ప్రశాంతత కలిగేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుంది. నిద్ర అనేది ఒక్కో వ్యక్తి వయస్సు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఎవరు ఎన్ని గంటలు నిద్రపోతే శారీరక అవసరాలు తీరతాయంటే..
పిల్లలు (6 12 ఏళ్ల వయస్సు) : 9 12 గంటలు
మహిళలు (13 18 ఏళ్ల వయస్సు) : 8 10 గంటలు
పెద్దవారు (18 64 ఏళ్ల వయస్సు) : 7 9 గంటలు
పెద్దలు (65 ఏళ్లకు పైగా) : 7 8 గంటలు
నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. శక్తి పునరుద్ధరణ: నిద్ర ద్వారా శరీరం తక్కువగా శక్తిని ఉపయోగించుకుంటుంది. పునరుద్ధరణ కోసం శక్తిని స్టోర్ చేసుకోగలుగుతుంది.
2. మానసిక ఆరోగ్యం: సరైన నిద్ర మానసిక ప్రశాంతతను అందించి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
3. శారీరక ఆరోగ్యం: నిద్ర సమయంలో శరీరం జీర్ణ సంబంధిత క్రియలు, హార్మోన్ల ఉత్పత్తి, శరీర అవయవాల నిర్వహణలో పనిచేస్తుంది.
4. శరీర బరువు నియంత్రణ: సరైన నిద్ర వలన మెటబాలిజం సరిగా పనిచేస్తుంది, ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
5. జ్ఞాపకశక్తి, విద్యా సామర్థ్యం మెరుగుపరచడం: నిద్రపోవడం వల్ల నేర్చుకున్న విషయాలను మెరుగుగా జ్ఞాపకం పెట్టుకోగలం.
6. ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపరచడం: సరైన నిద్ర ఇమ్యూన్ సిస్టమ్ ను బలపరిచి, శరీరాన్ని వ్యాధులకు గురికాకుండా కాపాడుతుంది.
7. సుస్థిర హార్మోన్ స్థాయిలు: నిద్ర హార్మోన్ ల విడుదలపై ప్రభావం చూపుతుంది. ఇది శరీరంలో వివిధ ముఖ్యమైన చర్యలు జరిగేందుకు ప్రేరేపిస్తుంది.
సరైన నిద్ర ద్వారా మనం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి మీరు రోజు మొత్తంలో కావాలసినంత నిద్రపోతున్నారా..లేదా? అని ఇలా చెక్ చేసుకోండి.
కావాల్సినంత నిద్ర పోతున్నారో లేదో ఈ ప్రశ్నలు వేసుకుని తెలుసుకొండి
1. మీరు ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత అలసటగా ఫీలవుతున్నారా?
2. మీరు వారంలో మూడు రాత్రులు నిద్రపోవడానికి ఇబ్బంది పడతున్నారా?
3. మీరు తరచూ రాత్రుళ్లు మధ్యలో లేచి తిరిగి నిద్రపోవడానికి కష్టపడుతున్నారా?
4. మీరు డైలీ యాక్టివ్ ఉండటానికి ఎనర్జీ డ్రింక్స్‌పై ఆధారపడతున్నారా?
5. మీరు రోజు పొద్దున్న లేదా మధ్యాహ్నం సమయంలో నిద్రపోయినట్లుగా, అలసటగా, లేదా శక్తి లేకుండా ఫీలవుతున్నారా?
6. మీరు రోజు పొడవునా ఏకాగ్రత కేంద్రీకరించడంలో లేదా విషయాలను గుర్తు పెట్టుకోవడంలో కష్టపడతున్నారా?
7. మీరు తరచుగా అవగాహన లేకుండా కోపంగా, మనస్తాపంగా లేదా ఒత్తిడిగా ఫీలవుతున్నారా?
8. మీరు ఏవైనా సమావేశాలు, ప్రసంగాలు లేదా టీవీ చూస్తున్నప్పుడు ఇట్టే నిద్రపోతున్నారా?
9. మీరు నిద్రపోతున్నప్పుడు గురక పెడుతూ లేదా కొంత సమయం శ్వాస తీసుకోవడాన్ని ఆపేస్తూ ఉంటారని ఎవరైనా చెప్పారా?
10. మీరు నిద్రలోకి జారుకోవడానికి 30 నిమిషాలు కన్నా ఎక్కువ సమయం తీసుకుంటున్నారా?
ఈ ప్రశ్నల్లో ఐదింటికి పైగా మీ సమాధానం అవును అయితే మీరు కచ్చితంగా చాలా తక్కువ సమయం పాటు నిద్రపోతున్నారని అర్థం. కొన్నింటికి మాత్రమే అవును అని సమాధానం ఉంటే, మీలో సమస్య ఇప్పుడిప్పుడే మొదలవుతుండవచ్చు. వెంటనే ఆరోగ్య నిపుణుడ్ని సంప్రదించండి. నిద్ర అనేది శరీరానికి చాలా అత్యవసరమైన ప్రక్రియ అని గుర్తుంచుకోండి.
సంబంధిత కథనం