Stage 0 breast cancer: స్టేజ్ జీరో రొమ్ము క్యాన్సర్ గురించి విన్నారా? ఇది ప్రమాదకరమా?-what is stage zero breast cancer know its symptoms and treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stage 0 Breast Cancer: స్టేజ్ జీరో రొమ్ము క్యాన్సర్ గురించి విన్నారా? ఇది ప్రమాదకరమా?

Stage 0 breast cancer: స్టేజ్ జీరో రొమ్ము క్యాన్సర్ గురించి విన్నారా? ఇది ప్రమాదకరమా?

Stage 0 breast cancer: స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ ప్రారంభ దశ. ఈ దశలో రొమ్ములో క్యాన్సర్ కణాలుంటాయి, కానీ వృద్ధి చెందవు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో, దీన్ని ఎలా గుర్తించొచ్చో తెల్సుకోండి.

స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్ (freepik)

స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్‌నే డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (డీసీఐ‌ఎస్) అంటారు. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశ. ఇది ప్రాణాంతకం కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర రొమ్ము క్యాన్సర్‌లాగా మారిపోతుంది. కాబట్టి దీని లక్షణాలు, కారణాలు ఏంటో తెల్సుకోవడం చాలా ముఖ్యం. తొలిదశలోనే గుర్తించగలిగితే చికిత్స తొందరగా తీసుకునే అవకాశం ఉంటుంది.

స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్:

ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కానీ వృద్ధి చెందవు. ఈ దశలో గుర్తించిన క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. రొమ్ము క్యాన్సర్లలో 20 శాతం స్టేజ్ జీరో రొమ్ము క్యాన్సర్లే అని ది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది. ఈ దశలో రొమ్ములోని పాల వాహికలో అసాధారణ కణాల పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఇవి మిగతా రొమ్ము కణజాలానికి గానీ, మిగతా శరీర భాగాలకు గానీ వ్యాప్తి చెందవు. అందుకే దీన్ని ప్రి క్యాన్సరస్ దశగా పరిగణిస్తారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్లిష్టమైన మరో దశ రొమ్ము క్యాన్సర్ గా మారుతుంది. క్రమం తప్పకుండా మామోగ్రామ్ , స్కాన్స్ చేయించుకోవడం, రొమ్ములను స్వీయ పరిశీలన నెలకోసారైనా చేసుకోవడం వల్ల.. మార్పులను తక్షణమే గుర్తించొచ్చు.

స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు:

దీనికి ఏ లక్షణాలు ఉండవనే చెప్పాలి. అందుకే దీన్ని సులభంగా గుర్తించలేరు. కేవలం స్కానింగ్స్ లోనే దీన్ని గుర్తించొచ్చు. మామోగ్రామ్ చేసినప్పుడు అసాధారణ కణాలు చిన్న క్యాల్షియం అవశేషాలు రొమ్ము కణజాలంలో కనిపిస్తాయి. ఇది హాని చేసే దశ కాదు కాబట్టి రొమ్ములో ఎలాంటి నొప్పి గానీ, చేత్తో తాకితే గడ్డలు తగలడం, రొమ్ములో మార్పులు రావడం జరగదు. చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ దశలో రొమ్ములో గడ్డ, చనుమొన్న నుంచి స్రావాలు కనిపిస్తాయి. కానీ ఇవి స్టేజ్ జీరో క్యాన్సర్ లక్షణాలని చెప్పలేం.

స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఎవరికి?

యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్టేజ్ జీరో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంతమందికి ఎక్కువని ఒక జాబితాలో తెలిపింది. ఎవరిలో అంటే..

  1. ఇది వరకే కుటుంబంలో, దగ్గరి బందువుల్లో గానీ ఎవరికైనా యుక్త వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే.. వాళ్లకి ప్రమాదం ఎక్కువ.
  2. చిన్నప్పుడు కానీ ఇది వరకే చాతీకి రేడియేషన్ థెరపీ చేయించుకున్న వాళ్లలో
  3. మోనోపాజ్ దశలోకి తొందరగా అడుగుపెట్టిన వాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ
  4. ముప్ఫై ఏళ్ల తర్వాత మొదటి సంతానం కన్నవాళ్లలో
  5. మోనోపాజ్ దశలో హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్న వాళ్లలో
  6. అధిక బరువు, ఆల్కహాల్, చురుగ్గా లేని జీవనశైలి ప్రమాదం పెంచుతాయి

చికిత్స:

ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి తగ్గిపోతుందనే నిర్లక్ష్యం అస్సలు మంచిది కాదు. గుర్తించిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఈ చికిత్సలో ముందుగా క్యాన్సర్ మరింత ముదిరిపోకుండా చేస్తారు. అలాగే కణాలను వృద్ధి చెందకుండా చికిత్స ఉంటుంది. సర్జరీ, లంపెక్టమీ.. అంటే అసాధారణంగా పెరిగిన కణజాలాన్ని, దాని చుట్టూ ఉన్న కొద్ది మాత్రం ఆరోగ్యకరమైన కణజాలాన్ని వ్యాధి వ్యాప్తి కాకుండా తొలిగిస్తారు. లేదంటే మాస్టెక్టమీ.. రొమ్ములను తొలగించడం లాంటి చికిత్సలుంటాయి. ఇవన్నీ వ్యక్తిని, వ్యాధిని, దాని తీవ్రతను బట్టి మారతాయి.