Postpartum Depression । ప్రసవానంతర డిప్రెషన్ అంటే ఏమిటి? బయటపడే మార్గాలు ఉన్నాయా?!-what is postpartum depression how long it last risk factors treatment and remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Postpartum Depression । ప్రసవానంతర డిప్రెషన్ అంటే ఏమిటి? బయటపడే మార్గాలు ఉన్నాయా?!

Postpartum Depression । ప్రసవానంతర డిప్రెషన్ అంటే ఏమిటి? బయటపడే మార్గాలు ఉన్నాయా?!

HT Telugu Desk HT Telugu
Jun 20, 2023 03:27 PM IST

Postpartum Depression: శిశువు జన్మించిన తర్వాత బాలింత ముఖంలో కొంత విచారం ఉంటుంది. ఇది వారిలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా అలాంటి పరిస్థితి ఉండవచ్చు. మరి ప్రసవానంతర డిప్రెషన్ అంటే ఏమిటి? తెలుసుకోండి.

Postpartum Depression
Postpartum Depression (istock)

Postpartum Period: శిశువుకు జన్మనిచ్చిన తరువాత ఆ స్త్రీ సాధారణంగా 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెను బాలింతగా వ్యవహరిస్తారు. ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు వారి మానసిక స్థితిలో కొన్ని మార్పులను అనుభవిస్తారు. శిశువు పుట్టిన తర్వాత ఆనందంగా ఉండాల్సిన తల్లి మొఖంలో కొద్ది రోజులకే విచారంగా ఉంటారు. వారిలో దుఃఖం, చిరాకు, ఆత్రుత వంటివి కనిపిస్తాయి. ఈ సమయంలో బాలింతలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా అలాంటి పరిస్థితి ఉండటం సహజం. చాలా మంది మహిళలకు ఈ లక్షణాలు 3 నుండి 5 రోజులలో తొలగిపోతాయి.

అయితే కొందరిలో ఈ లక్షణాలు 2 వారాలకు మించి కూడా కొనసాగుతాయి, కొన్ని నెలల వరకు కూడా కొనసాగవచ్చు. అలాంటి పరిస్థితిని ప్రసవానంతర వ్యాకులత (Postpartum Depression) అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఈ కింద చూడండి.

ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు

  • విచారంగా, ఆందోళనగా, ఆత్రుతగా, నిష్ఫలంగా అనిపించడం
  • బిడ్డను ప్రేమించలేమేమో లేదా సరిగ్గా చూసుకోలేకపోతానేమోననే భయం ఉండటం
  • బాధతో సాధారణం కంటే ఎక్కువ ఏడుపు రావడం
  • చంచలమైన మానసిక స్థితి లేదా కోపం
  • సరిగ్గా నిద్రపోకపోవడం
  • చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా తినడం
  • స్పష్టమైన కారణం లేకుండా తలనొప్పి, ఒళ్లు నొప్పులు
  • సామాజిక ఒంటరితనం, వేడుకలకు దూరంగా ఉండటం
  • స్వీయ-హాని లేదా శిశువుకు హాని కలిగించే ఆలోచనలు
  • తనను, బిడ్డను లేదా కుటుంబాన్ని చూసుకోవడం కష్టంగా అనిపించడం
  • చేతకానితనం లేదా అపరాధ భావాలు
  • ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకోవడం కష్టం అనిపించడం

ఎందుకు ఇలా, కారణాలేమిటి?

  • ప్రసవానంతర డిప్రెషన్ ఎక్కువ రోజులు ఉండటానికి గల కారణాలు
  • గర్భధారణకు ముందు లేదా గర్భధారణ సమయంలో డిప్రెషన్ కు లోనవడం
  • బైపోలార్ డిజార్డర్ కలిగి ఉండటం
  • రక్త సంబంధంలో ఎవరికైనా డిప్రెషన్ లేదా మానసిక అనారోగ్యం కలిగి ఉండటం
  • గర్భధారణ సమయంలో గృహ హింస, మరణం, ఉద్యోగం కోల్పోవడం లేదా అనారోగ్యం వంటి ఒత్తిడితో కూడిన జీవిత అనుభవాలు
  • భాగస్వామి లేదా ఇతర ప్రియమైనవారి నుండి మద్దతు లేకపోవడం
  • ప్రసవం సమయంలో అనారోగ్య సమస్యలు
  • ముందస్తు జననం లేదా అనారోగ్య సమస్యలతో శిశువు జననం
  • గర్భం గురించి మిశ్రమ భావాలు
  • మద్యం లేదా మాదక ద్రవ్యాల అలవాట్లు

బయటపడే మార్గాలు

  1. వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం
  2. వీలైతే, పనుల్లో సహాయం చేయమని ఇతరులను అడగడం
  3. ప్రతిదీ పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించాలనే కోరికను నిరోధించడం
  4. స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో సమయం గడపడం
  5. తమ భావాలను ఇతరులతో పంచుకోవడం
  6. ఎక్కువ మందితో కలిసి ఉండటం
  7. ఆరుబయట నడక మొదలైన, మితమైన వ్యాయామం చేయడం

ప్రసవానంతర డిప్రెషన్ దీర్ఘకాలం కొనసాగితే?

సాధారణంగా ప్రసవానంతర డిప్రెషన్ దీర్ఘకాలం కొనసాగడానికి కారణం వారిలో అంతకు ముందే డిప్రెషన్ భావాలు లేదా ప్రమాదంగా భావించిన కారకాలు ఉండవచ్చునని వైద్యులు అంటున్నారు. భాగస్వామితో సంబంధం సరిగ్గా లేకపోవడం, నిరంతరం అనుభవించిన ఒత్తిడి, లేదా గతంలో ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కోవడం వంటివి దీర్ఘకాలం పాటు ప్రసవానంతర డిప్రెషన్ కొనసాగటానికి కారణం అవుతాయి.

చికిత్స చేయకపోతే ప్రసవానంతర డిప్రెషన్ నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయినప్పటికీ, మహిళలకు ఈ లక్షణాలను నిర్వహించడంలో, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడే సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం