Paint my love: చిత్తం చెదరకుండా చిత్రం గీసిచ్చే లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్.. ధర ఎంతంటే..-what is live wedding painting see how weddings are captured live on canvas ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paint My Love: చిత్తం చెదరకుండా చిత్రం గీసిచ్చే లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్.. ధర ఎంతంటే..

Paint my love: చిత్తం చెదరకుండా చిత్రం గీసిచ్చే లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్.. ధర ఎంతంటే..

Paint my love: మన ముందుగా జరుగుతున్న సందర్భాన్ని అక్కడే పెయింటింగ్ వేయడం చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు వేడుకలలో ట్రెండ్ అవుతున్న ఈ లైవ్ పెయింటింగ్ గురించి తెల్సుకోండి.

ఈ లైవ్ పెయింటింగ్ ముంబయికి చెందిన అద్విర్‌కార్ గీశారు. ఒక పెళ్లి వేడుకలో వధూవరుల పెయింటింగ్ ను పెళ్లి మండపంలోనే గీశారు.
 లైవ్ పెయింటింగ్ ఫొటోలు(Courtesy Pritesh Rangole)
లైవ్ పెయింటింగ్ ఫొటోలు(Courtesy Pritesh Rangole)

పెళ్లికి వధూవరులు రాక కన్నా రెండు గంటల ముందే 27 సంవత్సరాల ప్రితేష్ మండపానికి చేరుకున్నాడు. స్టేజీ డెకరేషన్ కోసం ఏ లైట్లు, పూలు వాడారు? ఏమేం ఏర్పాట్లు చేశారు? లాంటివన్నీ పక్కాగా చూసుకుంటున్నాడు. స్టేజీ బ్యాక్ గ్రౌండ్ రంగులు, డిజైన్లు అన్నీ అతనికి అవసరమే. ఎందుకంటే వాటిని పెయింటింగ్ వేయబోయేది అతనే. అదీ గదిలో కూర్చుని కాదు. వేల మంది అతిథుల మధ్యలో స్టేజీ మీద పెళ్లి జరుగుతుందే ఇక్కడ ప్రితేష్ అక్కడ జరుగుతుందంతా పెయింటింగ్ వేసేయాలి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతోన్న లైవ్ పెయింటింగ్ ఇదే మరి. 

ఫొటోలు తీయడం కూడా పాత ట్రెండ్ అయిపోయింది. అందరితో ప్రత్యేకంగా ఉండాలంటే ఫొటోలకు మించింది ఉండాలి కదా. అందుకే అంతా ఇప్పుడు పెయింటింగ్ చేసిన కాన్వాస్ ఇష్టపడుతున్నారు. 

రాజుల కాలం నుంచే..

ఈ లైవ్ పెయింటింగ్ పద్ధతి దాదాపుగా పదేళ్ల క్రితం నుంచి యూఎస్ లో మొదలయ్యింది. కానీ మన దగ్గర ఎన్నో ఏళ్ల క్రితమే ఈ సాంప్రదాయం ఉంది. రాజుల కాలంలో ముఖ్యమైన వేడుకలన్నీ పెయింటింగ్ ద్వారానే భద్రపర్చేవారు.   వర్లి, పట్టచిత్ర, మధుబని లాంటి పెయింటింగ్ శైలుల్లో పండగల వేడుకలను,ముఖ్యమైన సందర్భాలను చిత్ర లేఖనం ద్వారా పొందుపర్చారు. రాజుల బొమ్మలు, మహారాణుల పెళ్లి వేడుకలు కూడా చిత్ర లేఖనం ద్వారానే గుర్తులుగా దాచుకునేవారు. 

ఎంత ఖరీదు ఉంటుంది? 

రంగోల్ అనే పెయింటర్ ఇప్పటిదాకా దాదాపు 40 పెళ్లిళ్లకు ఈ లైవ్ పెయింటింగ్ వేశారు. ఒక్కోదానికి ఆయన దాదాపు 35,000 రూపాయల దాకా తీసుకుంటారట. పెయింటర్ బట్టి, వాళ్లు అందిస్తున్న సేవలు బట్టి ఈ ధర తగ్గొచ్చు, పెరగొచ్చు. అయితే ప్రస్తుతం ఈ సేవలు కేవలం ప్రముఖ నగరాల్లోనే అందుబాటులో ఉంటున్నా తొందర్లోనే అంతటా వచ్చేస్తాయి. మన హైదరాబాద్ లో కూడా ఈ పెయింటింగ్ వేసే వెసులుబాటు ఉంటోంది.

పెయింటర్ ఇబ్బందులు :

పెళ్లి జరుగుతున్న వేదిక కింద ముందు కూర్చుని ఈ లైవ్ పెయింటింగ్ వేస్తారు. ఒక్కసారి మొదలు పెట్టారంటే కనీసం ఏం తినే వీలుండదు. కొన్నిసార్లు టాయిలెట్ వెళ్లడానికి బ్రేక్ కూడా తీసుకోలేరట. ఇక చలికాలంలో అయితే చేతులు వణకుతున్నా కూడా బ్రష్ వణకకుండా అందమైన పెయింటింగ్ గీసివ్వాల్సిందే. గాలి ఉన్నట్లుండి ఎక్కువగా వస్తే, వర్షం పడితే అంతా చిన్నాభిన్నం అయిన సందర్భాలూ ఉంటాయి.

ఇక ఒక పెయింటర్ ప్రత్యేకంగా గదిలో కూర్చుని గీస్తేనే ఒక బొమ్మ పూర్తి కావడం చాలా కష్టంగా ఉంటుంది.  అలాంటిది పెళ్లిలో చుట్టూ ఎవరో ఒకరు వచ్చి చూస్తూ పోతూ ఉంటారట. బొమ్మ చూసి కొంతమంది వంకలూ పెడతారట. అస్సలు పోలికే లేదంటూ ముఖం మీదే చెప్పే వాళ్లూ ఉంటారు. ఏవేవో ప్రశ్నలు వేసి డిస్టర్బ్ చేసేవాళ్లుంటారు. కాబట్టి వీటన్నింటినీ పట్టించుకోకుండా లైవ్ పెయింటింగ్ వేయడం సులభం ఏం కాదు. అందుకే వాటికి తగ్గట్లు ధర ఉంటోంది. 

 లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్(Courtesy Noor)
లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్(Courtesy Noor)

కస్టమైజేషన్:

ఫొటో అనుకోండి అక్కడ వేదికపై ఉన్నది ఉన్నట్లు వస్తుంది. కానీ లైవ్ పెయింటింగ్ లో వధూవరుల వాళ్ల ఇష్టాలను ముందుగానే చెప్పి దానికి తగ్గట్లు పెయింటింగ్ వేయించుకోవచ్చు. కొంతమంది చుట్టూ ఉండే జనాలు రాకుండా పెయింటింగ్ గీయమంటారు. మరికొంతమంది మండపంలో వాళ్లతో లేని పెంపుడు జంతువు బొమ్మ ఇచ్చి దాన్నీ కూడా చేర్చమంటారు. చెప్పాలంటే డ్రెస్సుల రంగులు కూడా కాస్త మార్చి గీయించుకునే వాళ్లుంటారు. కాబట్టి మన ఇష్టానికి తగ్గట్లు వీటిని కస్టమైజేషన్ చేయించుకునే అవకాశం ఉంటోంది.

లైవ్ పెయింటింగ్ (Courtesy Keerthana Adepu)
లైవ్ పెయింటింగ్ (Courtesy Keerthana Adepu)

అంతా గీశాక అందరికీ నచ్చుతుందని కాదట. ఎంత కష్టపడి గీసినా సరే కొన్నిసార్లు సమయానికి పెయింటింగ్ పూర్తవ్వదు. మరికొన్ని సార్లు వాళ్లకు పెయింటింగ్ నచ్చదు. దాంతో ఇంటికెళ్లాక మళ్లీ కొన్ని మార్పులు చేసి పెయింటింగ్ ఫినిష్ చేసివ్వాలి. వాళ్ల ప్రత్యేకమైన రోజుకోసం ఆమాత్రం కష్టం తప్పదు అంటోంది హైదరాబాద్ కు చెందిన కీర్తనా ఆడెపు.

ఏదేమైనా పెళ్లిలో లైవ్ పెయింటింగ్ పెడితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మన బొమ్మను ఒకరు మనముందే గీస్తే మనకూ, చూసేవాళ్లకి థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంకేం.. దీని గురించి మీరూ ఆలోచించండి మరి.