Intermittent Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? దాన్నెలా చేస్తే లాభదాయకం?
Intermittent Fasting: ఈ మధ్య చాలా మంది 16 గంటలపాటూ ఏమీ తినట్లేదనీ, ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నామనీ అంటున్నారు. అదేంటీ, దాని ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకోండి.

మన దేశంలో ఉపవాసం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. అయితే అందరికీ అది పడదు. రోజంతా ఏమీ తినకుండా అంతా ఉండలేరు. ముఖ్యంగా బీపీ, మధుమేహం, గుండె జబ్బుల్లాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఉపవాసాలు చేయడం కష్టమే. అందుకనే చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అంతో జనాదరణ పొందుతోంది. అది చేయడానికి సులువుగా ఉండటం, ఫలితాలు ఉపవాసానికి సమానంగా ఉండటంతో అంతా దీన్ని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయంతో బాధ పడేవారు, బరువు తగ్గాలనుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు దీన్ని ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి :
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన విధానం 16/8. అంటే రోజులో 16 గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచుకోవడం, ఎనిమిది గంటల పాటు తినడం. పది రోజులో, నెల రోజులో ఈ విధానాన్ని పాటించడం కంటే దీన్ని ఒక ఆహారపు అలవాటుగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధానంలో తినాలనుకునే వారు ఉదయం టిఫిన్ మానేసి పది గంటలకు నేరుగా భోజనం చేయవచ్చు. అలాగే సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో సాయంత్రపు భోజనం చేయవచ్చు. మధ్యహ్నం ఆకలైతే పండ్లు, ఉడకబెట్టిన గుడ్లు, దుంపల్లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తినవచ్చు. సాయంత్రం ఆరు నుంచి ఉదయం 10 వరకు ఏమీ తినకుండా ఉంటే 16 గంటల పాటు మనం పొట్టకు విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది.
దీన్ని ప్రారంభించాలనుకునే వారు మొదటి వారం మూడు రోజుల పాటు ఇలా చేసి చూడండి. తర్వాత దాన్ని మెల్లగా ఒక వారానికి చేర్చండి. ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే అలాగే కొనసాగించండి. నెలకు రెండు వారాలైనా ఈ పద్ధతిని అనుసరించండి. బాగుందనిపిస్తే దీన్నే మీ రోజువారీ డైట్ ప్లాన్‌లా మార్చుకోండి. మీ శరరం ఏం చెబుతోందనేదాన్ని అర్థం చేసుకోండి. కళ్లు తిరగడం, విపరీతంగా నీరసం రావడం లాంటివి ఏమైనా ఉంటే దానికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకోండి. తక్షణం శక్తినిచ్చే ఆహార పదార్థాలను అప్పుడు మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ విధానాన్ని అనుసరించేప్పుడు తప్పక పౌష్టికాహారాన్ని తినాల్సి ఉంటుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో ప్రయోజనాలు :
ఊబకాయంతో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మనం శరీరానికి ఎక్కువ సమయం ఆహారాన్ని ఇవ్వకపోయే సరికి అది శక్తి కోసం తహతహలాడుతుంది. దీంతో శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వులు కొద్ది కొద్దిగా కరగడం మొదలవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అదే ఎప్పటికప్పుడు మనం తినేస్తూ ఉంటే శక్తి కోసం శరీరం లోపలున్న కొవ్వుల్ని ఎప్పటికీ కరిగించుకోదు. ఈ విధానం వల్ల జీవ క్రియ వేగవంతం అవుతుంది. టైప్ టు డయాబెటీస్, గుండె జబ్బులు, వయసుతోపాటు వచ్చే నరాల బలహీనతలు, క్యాన్సర్ల లాంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాం. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.