Control Hypertension । మీకు బీపీ ఎక్కువైతే.. ఇలా చేయండి!
Control Hypertension: హైపర్ టెన్షన్ ముప్పు నుంచి బయటపడాలంటే, వైద్యులు అందుకు కొన్ని మార్గాలను సూచించారు, అవేమిటో ఈ కింద తెలుసుకోండి.
High Blood Pressure: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కలిగే ఆకస్మిక మరణాలకు హైపర్‌టెన్షన్ ఒక ప్రధాన కారణం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, రక్తపోటుకు సంబంధించిన కారకాలు వృద్ధాప్యం, స్థూలకాయం, అనారోగ్యకరమైన ఆహారం, శ్రమలేని జీవనశైలి, మధుమేహం, అతిగా మద్యం సేవించడం లేదా ఉప్పు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ఉన్నాయి, వంశపారంపర్యంగా కూడా ఇది సంభవించవచ్చు. అధిక రక్తపోటు ఉన్న చాలా మందికి లక్షణాలు కనిపించవు. ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులలోనూ హైబీపీ సమస్య ఉంటుంది. నివేదికల ప్రకారం, 46% మందికి తమకు హైబీపీ ఉన్నట్లు కూడా తెలియదు. దీర్ఘకాలంగా చికిత్స చేయకపోతే, ఇది గుండె, మెదడు, కళ్ళు, మూత్రపిండాలను ప్రభావితం చేసే సమస్యలకు దారితీస్తుంది. ఆకస్మిక గుండెపోటు లేదా స్ట్రోక్‌లను కలిగిస్తుంది. అందుకే హైబీపీకి "సైలెంట్ కిల్లర్" అనే పేరు ఉంది.

బీపీ నార్మల్ అంటే 120/80 లేదా అంతకు తక్కువ ఉండాలి. మీకు బీపీ 140/90 ఉంటే అది హైబీపీ లేదా హైపర్ టెన్షన్ అంటారు. ఒకవేళ బీపీ రీడింగ్ 180/110 దాటితే ప్రాణాలు గాలిలో ఉన్నట్లే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం పొందాలి.
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పూణేలోని సహ్యాద్రి హాస్పిటల్స్‌లో కార్డియాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రియా పాలిమ్‌కర్, హిందుజా హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌లోని కన్సల్టెంట్ డాక్టర్ అనిల్ బల్లాని హైబీపీ ఎంత ప్రమాదకరమైనదో తెలియజేశారు. హైపర్ టెన్షన్ ముప్పు నుంచి బయటపడాలంటే, వైద్యులు అందుకు కొన్ని మార్గాలను సూచించారు, అవేమిటో ఈ కింద తెలుసుకోండి.
Ways To Control Hypertension- హైబీపీ తగ్గించుకునేందుకు మార్గాలు
- ఆహారంలో ఉప్పు చాలా తగ్గించాలి, రోజుకు 3-4 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. అలాగే సాల్ట్ చిప్స్, సాల్టెడ్ వేరుశెనగ, పాపడ్, ఊరగాయలు, సాల్టెడ్ బిస్కెట్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
- ధూమపానం పూర్తిగా మానేయండి, సిగరెట్ తాగితే హైబీపీ చాలా పెరుగుతుంది.
- వారానికి 5 రోజులు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈత, సైక్లింగ్, నడక, ట్రెడ్‌మిల్ పై నడవడం మొదలైన కార్డియో-ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
- మద్యం మితంగా తీసుకోవాలి, వారానికి గరిష్టంగా 2 పెగ్గులకు మించి తాగకూడదు.
- ఊబకాయం ఉన్నవారు బరువు చాలా వరకు తగ్గాలి. వారి BMI 25 కంటే తక్కువకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ముఖ్యం.
- ప్రతిరోజూ 8-10 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. నిద్రలేమి రక్తపోటుకు కారణమవుతుంది.
- యోగా, ధ్యానం, సంగీతం ద్వారా రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించండి. పని గంటలు పరిమితం చేయండి, తగినంత విశ్రాంతి అవసరం
- ఆహారం విషయానికొస్తే, పొటాషియం అధికంగా ఉండే ఆహారం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. టమోటాలు, బీన్స్, పుట్టగొడుగులు, అవకాడో, కివీ పండ్లు, గింజలు- విత్తనాలలో పొటాషియం అధికంగా లభిస్తుంది.
- కెఫిన్ తీసుకోవడం తగ్గించడం చాలా ముఖ్యం. ఎక్కువ కాఫీలు, కెఫిన్ పానీయాలు తాగవద్దు.
- నూనెల విషయానికొస్తే, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన నూనెలు ఉత్తమమైనవి. ఇతర నూనెలను తినడం తగ్గించాలి.
- ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి. వైద్యుడిని సంప్రదించి హైబీపీని తగ్గించే మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం.
ఈ రకమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచుకోవచ్చు, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు.
సంబంధిత కథనం