Eldest Daughter Syndrome: ఇంట్లో పెద్దకూతురిగా పుట్టడం అనేది ఒక సిండ్రోమ్? పెద్ద కూతుళ్లు ఏం ఫీలవుతారు?
Eldest Daughter Syndrome: ఇంట్లో మొదట జన్మించిన కుమార్తెలు తరచుగా తమ తరువాత పుట్టినవారికి సంరక్షకులుగా మారుతూ ఉంటారు. దీని వల్ల వారిలో ఎల్డర్ డాటర్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది జీవితాంతం ప్రవర్తనా సమస్యలను కలిగిస్తుంది.
ఒక కుటుంబంలో మొదట పుట్టిన కుమార్తె… తన తరువాత పుట్టే తోబుట్టువులకు చిన్న వయసులోనే గార్డియన్‌గా మారిపోతుంది. ఆమెపై చిన్నవయసులోనే బాధ్యతలు మోయాల్సి వస్తుంది. తన తరువాత పుట్టిన తమ్ముళ్లు, చెల్లెళ్లు ఆడుకుంటున్నా, పెద్ద కూతురికి మాత్రం ఆడే అవకాశం దొరకదు. ఇంట్లో పనులు సాయం చేయడం, చిన్న పిల్లలను చూసుకోవడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల వారికి తెలియకుండా "పెద్ద కుమార్తె సిండ్రోమ్" (Eldest Daughter Syndrome) బారిన పడే అవకాశం ఉంది.
ఈ వ్యాధి అధికారికంగా రోగ నిర్ధారణ చేయలేనప్పటికీ ఎంతో మంది పెద్ద కూతుళ్లు తమకు తెలియకుండా ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. పెద్ద కుమార్తె చిన్నవయసులోనే సంరక్షక పాత్రను పోషిస్తుంది. చిన్న వయస్సులోనే ఈ స్థానానికి అడుగుపెడుతుంది. తల్లి తరువాత తల్లిగా మారుతుంది.
ఆమె తన తోబుట్టువులను చూసుకోవడానికి బాధ్యత వహిస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు, ఆమె తల్లిదండ్రుల రూపంలోకి మారుతుంది. పెద్ద కుమార్తె సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలనే సంప్రదాయం పూర్వం నుంచి వస్తోంది. మొదటిగా పుట్టిన ఆడబిడ్డ పరిపక్వతను ప్రదర్శిస్తుందని, వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తుందనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. తల్లిదండ్రుల కోసం మొదట పుట్టిన కూతురు త్వరగా పెద్దదైపోతుంది. ఆమె పాత్రపై చాలా భారీ అంచనాలు ఉంటాయి. దానివల్ల ఎంతో మంది పెద్ద కూతుళ్లు మానసికంగా నలిగిపోతారు.
బాల్యంలోనే బాధ్యతలు మోయాల్సి రావడం ఆమె వ్యక్తిత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మారుస్తాయి. ఆమె సంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఆమెకు నచ్చకపోయినా ఇంట్లో పెద్దరికం పాత్రను పోషించాల్సి వస్తుంది. అది ఆమె అయిష్టంగానే నిర్వర్తిస్తుంది. ఇది వారిలో చికాకును, కోపాన్ని, ఇబ్బందిని పెంచుతాయి. వారికి తెలియకుండానే వారు ‘Eldest Daughter syndrome’ బారిన పడుతున్నారు.
ఇంట్లో పెద్ద కూతురు కేవలం ఇంట్లోనే కాదు బయట కూడా అంతే బాధ్యతగా ప్రవర్తించడం జరుగుతుంది. కుటుంబంతో బయటికి వెళ్లినప్పుడు కూడా తన కన్నా చిన్నపిల్లలను చూసుకోవడానికే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తుంది. కేరింగ్ పాత్రలోనే ఆమె ఉంటుంది. స్నేహితులతో కూడా ఆమె చాలా పెద్దరికంగా వ్యవహరిస్తుంది. వారికి సాయం చేసేందుకు కూడా ఈమె ముందుకు వస్తుంది. ఇంట్లోని పరిస్థితుల వల్ల ఆమెకు అలా పనులు ఎవరూ అడగకుండానే చేసేయడం అలవాటు అయిపోతుంది.
ఏదైనా ట్రిప్ కు బయటికి వెళితే ఆమె తాను ఆస్వాదించడానికి బదులుగా, ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకోవడానికే సరిపోతుంది. ఆమె ఎల్లప్పుడూ తన చుట్టూ ఉన్నవారి సమస్యలను వినడానికి, వారికి సహాయం చేయడానికి ముందుంటుంది. కానీ ఆమె చెప్పేది వినడానికి మాత్రం ఎవరికీ సమయం ఉండదు.
ఉద్యోగంలో తన సహోద్యోగుల వద్ద కూడా ఆమె అదనపు పని బాధ్యతలను చేపట్టడానికి రెడీగా ఉంటుంది. ఆమె సహోద్యోగులు అడిగే ఏ సాయాన్ని కాదనలేక అన్ని పనులు నెత్తిమీద వేసుకుంటుంది. ఆమె తన జూనియర్లను కూడా తన ఇంట్లోని తోబుట్టువుల్లా చూసుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లోనూ పెద్ద కూతురు ఉంటే మీకు తెలియకుండానే ఆమెపైన బాధ్యతలు, బరువులు వేస్తున్నారేమో చెక్ చేసుకోండి.
టాపిక్