ఈద్-ఉల్-ఫితర్ పండుగను మీథీ ఈద్ అని కూడా పిలుస్తారు. ఇది ఇస్లాంలో అత్యంత ప్రధానమైన పండుగలలో ఒకటి. ఇది ఉపవాసాల పవిత్ర మాసం రంజాన్ ముగింపును సూచిస్తుంది. ఈ ప్రత్యేక పండుగ ఇస్లాంలో వేడుకల సమయం. నెలవంక కనిపించగానే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ప్రార్థనలు, విందులు, ప్రియమైనవారితో హృదయపూర్వక శుభాకాంక్షలు ఆనందంగా జీవిస్తారు.
ఈద్-ఉల్-ఫితర్ తేదీని ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ద్వారా నిర్ణయిస్తారు. ఇది పదవ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున వస్తుంది. నెలవంక దర్శనం ప్రదేశాన్ని బట్టి మారుతుంది. కాబట్టి, మధ్యప్రాచ్యం, పాశ్చాత్య దేశాలలో మార్చి 30 లేదా మార్చి 31 న ఈ పండుగ నిర్వహించుకునే అవకాశం ఉంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దక్షిణాసియా దేశాలలో, ఈద్ 2025 మార్చి 31 లేదా ఏప్రిల్ 01 న వచ్చే అవకాశం ఉంది.
ఈ పండుగ వెనుక లోతైన చరిత్ర, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. పవిత్ర ఖురాన్ రంజాన్ సమయంలో ముహమ్మద్ ప్రవక్తకు కనిపించిందని నమ్ముతారు. అందుకే ఈ మాసం ఆధ్యాత్మిక భక్తికి, స్వీయ క్రమశిక్షణకు ఉత్తమ సమయంగా భావిస్తారు.
ఈద్-ఉల్-ఫితర్ అంటే "ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేసే పండుగ" అని అర్థం. ఇది ముస్లిం సమాజంలో కృతజ్ఞత, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. రంజాన్ మాసానికి ఆనందకరమైన ముగింపుగా చెప్పుకోవాలి. రంజాన్ మాసమంతా ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు ముస్లింలు. ఈద్ ఉల్ ఫితర్ ఆ ఉపవాసాలకు ముగింపు పలుకుతుంది.
మీథీ ఈద్… మసీదులు, ఈద్గాలు, బహిరంగ మైదానాలలో నిర్వహించే ఈద్ సలాహ్ అని పిలిచే ప్రత్యేక సామూహిక ప్రార్థనతో ప్రారంభమవుతుంది. రంజాన్ సందర్భంగా తమకు బలాన్ని ప్రసాదించిన అల్లా కు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే సంవత్సరానికి ఆశీస్సులు కోసం ప్రార్థిస్తారు.
ఈ ఈద్ లో ముఖ్యమైన అంశం జకాత్-అల్-ఫితర్. ఇది ఈద్ ప్రార్థనకు ముందు పేదవారికి దానధర్మాలు ఇవ్వడంతో ప్రారంభం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, వేడుకలలో పాల్గొనడానికి, పండుగ భోజనాన్ని ఆస్వాదించడానికి నిర్ధేశించింది . ఈద్ పండుగ సమైక్యతను సూచిస్తుంది.
బిర్యానీ, హలీమ్, నిహారీ, కబాబ్స్ వంటి సాంప్రదాయ వంటకాలతో పాటూ తీపి వంటకం సెవియన్ (షీర్ ఖుర్మా) ఈద్ రోజు ఉండాల్సిందే. కుటుంబమంతా కలిసి ఈ భోజానాన్ని తింటారు. కేవలం సొంత కుటుంబీకులే కాదు బంధువులు, స్నేహితులకు కూడా ఆహ్వానిస్తారు. స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ శుభాకాంక్షలు, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేస్తారు. ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. పిల్లలు ఈద్ పండుగ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. పెద్దలు వారికి బహుమతులు, ప్రేమ, ఆశీర్వాదాలను అందిస్తారు.
ఈద్ ఆచారం ఆనందాన్ని, సంతోషాన్ని మోసుకొస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని చెబుతుంది. పేదలను ఆదుకోవాలని, దాన ధర్మాలు చేయాలని వివరిస్తుంది. ఈద్-ఉల్-ఫితర్ ఒక పండుగ మాత్రమే కాదు… ఇది విశ్వాసం, కరుణ, సమాజ స్ఫూర్తికి ప్రతిబింబం.
ఆనందాన్ని వ్యాప్తి చేయడం, సంబంధాలను బలోపేతం చేయడంలో ఈద్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన రోజును నిర్వహించుకోవడానికి కుటుంబాలు ఏకమవుతాయి. ఈద్ స్ఫూర్తి కృతజ్ఞత, ఐక్యత, జీవితం ఆశీర్వాదాలు మిళితమైన అందమైన జ్ఞాపకంగా మారిపోతుంది.
మీకు ముందుగా ఈద్ ముబారక్! ఈ ఈద్ అందరికీ శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము.
సంబంధిత కథనం