డయాబెటిక్ న్యూరోపతి అనేది డయాబెటిస్ ఉన్న రోగులను ప్రభావితం చేసే ఒక నరాల వ్యాధి. డయాబెటిస్ ఉన్నవారు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ డయాబెటిక్ న్యూరోపతి బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎవరైతే అధిక బరువుతో బాధపడతారో వారు ఈ డయాబెటిక్ న్యూరోపతి బారిన పడే అవకాశం ఎక్కువ.
అధిక రక్తపోటు ఉన్న వారు, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు, మూత్రపిండా వ్యాధులతో ఉన్నవారు, మద్యం తాగేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారికి డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో ఉన్న కొన్ని జన్యువులు కూడా డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.
డయాబెటిస్ అదుపులో ఉండనప్పుడు అంటే రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోజ్ ఉన్నప్పుడు, ట్రై గ్లిజరైడ్స్ వంటి అధిక కొవ్వు స్థాయిలు ఉన్నప్పుడు నరాలు దెబ్బతింటాయి. నరాలకు ఆక్సిజన్ పోషకాలను అందించే చిన్న రక్తనాళాలు కూడా నష్టపోతాయి. దీనివల్ల నరాలకూ తగినంత ఆక్సిజన్ పోషకాలు వంటివి లభించవు. అప్పుడు అవి సరిగా పనిచేయలేవు. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు.
పాదాలలో స్పర్శ కోల్పోవడం, కాళ్ల దిగు భాగంలో తీవ్రంగా మంట, లేదా నొప్పి పెట్టడం వంటివి డయాబెటిక్ న్యూరోపతి లో కనిపించే లక్షణాలు. దీనిలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పెరిపెరల్ న్యూరోపతి, ఇక రెండోది అటానమిక్ న్యూరోపతి.
పెరి పెరల్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయంటే రాత్రి సమయంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాళ్లు, పాదాల భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది. పాదాలు కాళ్లు మండుతున్నట్టు తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తుంది. అలాగే బలహీనంగా కూడా అనిపిస్తుంది.
ఇక అటానమిక్ న్యూరోపతి బారిన పడితే పొట్ట ఉబ్బరం, గుండెల్లో మంట, అజీర్ణం అంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరికి విపరీతంగా చెమట పడుతుంది. వేడిని తట్టుకోలేరు. విరేచనాలు అధికంగా అవుతాయి. లేదా మలబద్ధకం సమస్య వస్తుంది. మూత్ర విసర్జనకు కూడా పదే పదే వెళ్లాల్సి వస్తుంది. నిలబడి ఉన్నప్పుడు రక్తపోటు తగ్గిపోవడం, తలతిరగడం వంటివి జరుగుతాయి. అటానమిక్ న్యూరోపతి, గుండె కొట్టకునే రేటును కూడా నియంత్రించడంలో సమస్యలను కలిగిస్తుంది .
మీకున్న లక్షణాలు తీవ్రంగా మారితే వెంటనే వైద్యులను కలవాలి. వారు మీకు వచ్చినది పెరిఫెరల్ న్యూరోపతి లేదా అటానమిక్ న్యూరోపతి అనేది తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర ఎంతుందో చూస్తారు. రక్త పరీక్షలు చేయడం ద్వారా మీకు వచ్చిన సమస్యను నిర్ధారించి చికిత్స మొదలు పెడతారు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ముందుగా ప్రయత్నిస్తారు. అలాగే పెయిన్ కిల్లర్స్ ఇచ్చే అవకాశం ఉంది. పాదాల ను కాపాడడానికి కూడా ప్రత్యేక చికిత్సను అందిస్తారు.
డయాబెటిక్ న్యూరోపతి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే రక్తపోటును కూడా పెరగకుండా చూసుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. సమతుల్యమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు నడక వంటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వదిలేయడం చాలా ముఖ్యం. దీనివల్ల డయాబెటిక్ న్యూరోపతి బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం