Iron Deficiency Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే ఐరన్ లోపం ఉన్నట్టే లెక్క-what happens when your body is lacking iron know the iron deficiency symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Happens When Your Body Is Lacking Iron Know The Iron Deficiency Symptoms

Iron Deficiency Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే ఐరన్ లోపం ఉన్నట్టే లెక్క

HT Telugu Desk HT Telugu
Oct 26, 2023 10:37 AM IST

కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ (ఇనుము) లోపం ఉన్నట్టు భావించాలి.

ఐరన్ లోపం ఉంటే ఏయే లక్షణాలు కనిపిస్తాయి?
ఐరన్ లోపం ఉంటే ఏయే లక్షణాలు కనిపిస్తాయి? (pixabay)

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం ఐరన్. మన రోగ నిరోధక వ్యవస్థకు, మెదడు పనితీరుకు, మానసిక పరిస్థితికి, కండరాల బలంగా ఉండడానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి శరీరంలో సరిపడా ఐరన్ ఉండాలి. ఐరన్ లోపం వల్ల ఎన్నో వ్యాధులు దాడి చేస్తాయి. శరీరం సమర్థంగా పూర్తిస్థాయిలో పనిచేయలేదు. పిల్లల్లో మెదడు ఆరోగ్యంగా ఎదగడానికి ఇనుము చాలా అవసరం. అయితే ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దీంతో ఎక్కువ మందిలో ఇనుము లోపం కనిపిస్తోంది. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మీకు ఇనుము లోపం ఉన్నట్టు భావించాలి.

ట్రెండింగ్ వార్తలు

హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడానికి ఐరన్ చాలా అవసరం. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్... ఆక్సిజన్‌ను అవయవాలకు రవాణా చేస్తుంది. ఐరన్ లోపిస్తే పోషకాలు, ఆక్సిజన్ శరీర అవయవాలకు రవాణా అవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఐరన్ లోపంతో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఐరన్ లోపంతో అధికంగా బాధపడుతున్నారు. గర్భిణీలు ప్రసవ సమయంలో ఐరన్ లోపం వల్ల ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

శరీరంలో ఐరన్ తగ్గిపోతే ఇలా పోషకాహార లోపం ఏర్పడుతుంది. మీరు తినే ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకొని తినాలి. ఎందుకంటే శరీరం తనంతట తానుగా ఐరన్ ను ఉత్పత్తి చేసుకోలేదు. కేవలం ఆహార పదార్థాల ద్వారానే అది శరీరానికి అందుతుంది. శరీరంలో ఇనుము లోపం ఏర్పడడానికి ముఖ్య కారణాలు మీరు తగినంతగా ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తినకపోవడం, ఇనుమును మీ శరీరం గ్రహించలేకపోవడం లేదా అధికంగా రక్తస్రావం జరగడం. ఇక్కడ చెప్పిన ఈ కారణాల వల్లే శరీరంలో ఐరన్ శాతం తగ్గిపోతుంది.

ఐరన్ లోపం లక్షణాలు

ఐరన్ లోపం ఏర్పడితే కొన్ని రకాల లక్షణాల ద్వారా ఆ విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. చిన్న చిన్న పనులకి అలసట రావడం, విపరీతంగా నీరసంగా ఉండడం, బలహీనంగా ఉన్నట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, తరచూ మైకం కమ్మినట్టు, గాలిలో తేలుతున్నట్టు అనిపించడం వంటివన్నీ కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే లక్షణాలు. అలాగే ఐరన్ లోపం వల్ల ఏ విషయం పైన ఏకాగ్రత ఉంచలేరు. విషయాలను గుర్తు పెట్టుకోలేరు. త్వరగా అంటువ్యాధులు సోకుతాయి. అలాగే లైంగిక ఆసక్తి తగ్గిపోవడం కూడా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉందేమో పరీక్షించుకోవడం ఉత్తమం.

ఆహారం ద్వారా మనం ఇనుమును పొందవచ్చు. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకుకూరలు, నట్స్ వంటి మొక్కలు నుంచి వచ్చే ఆహారంలో ఇనుము అధికంగా ఉంటుంది. అలాగే చికెన్, గుడ్లు, చేపలు వంటి వాటిలో కూడా ఇనుము లభిస్తుంది. ఇనుము నిండిన ఆహారాలను తింటున్నప్పుడు విటమిన్ సి నిండిన ఆహారాలను కూడా తినడం చాలా మంచిది. దీనివల్ల విటమిన్ సి... శరీరం ఐరన్ ను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. అందుకే విటమిన్ సి, ఐరన్ నిండిన ఆహారాలను ఒకేసారి తింటే మంచిది. కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా టీ, కాఫీ, వైన్, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఇనుమును శరీరం శోషించుకోకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఇనుము నిండిన ఆహారాలు తింటున్నప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలి.

WhatsApp channel